అద్దె ఇవ్వరు.. ఖాళీ చెయ్యరు
-
కొందరి గుప్పిట్లో ఎస్సీ కార్పొరేషన్ దుకాణాలు
-
ఖాళీ చేయమంటే అధికార పార్టీ నేతలతో ఒత్తిళ్లు తెప్పిస్తున్న వైనం
-
రూ.లక్షల్లో పేరుకుపోయిన అద్దె బకాయిలు
ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన షాపులను అద్దెకు తీసుకున్నవారిలో కొందరు కొన్ని సంవత్సరాలుగా అద్దె చెల్లించకుండా, ఖాళీ చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎస్సీల పేరు చెప్పి గతంలో ఉన్న అధికారులను పట్టుకుని షాపులను తీసుకున్న వీరు ఖాళీ చేయమంటే అధికార పార్టీ నాయకుల చేత అధికారులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు.
నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిచేందుకు సూళ్లూరుపేట, కావలి, గూడూరు, కోట, ఇందుకూరుపేట, నెల్లూరు, సీతారామపురం, అనంతసాగరం, ఏఎస్‌పేట, దుత్తలూరు, వెంకటగిరి, వాకాడు ప్రాంతాల్లో దుకాణ సముదాయాలను 1985 సంవత్సరంలో ఏర్పాటుచేశారు. వీటిలో 79 దుకాణాలు ఉండగా అందులో 44 దుకాణాలు వినియోగంలో ఉన్నాయి. సుమారు 35 దుకాణాలు వివిధ కారణాలతో ఖాళీగా ఉన్నాయి. అద్దెలు తక్కువగా ఉండటంతో కాలక్రమేణా ఎస్సీలు కానివారు దుకాణాలను బినామీ పేర్లతో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఒక్కో షాపునకు అద్దె రూ.3 వేలుంటే ఎస్సీలకు కేటాయించిన షాపులకు మాత్రం కేవలం రూ.500 నుంచి రూ.700 మాత్రమే చెల్లిస్తున్నారు.
పేరుకుపోయిన బకాయిలు..
44 దుకాణాల నుంచి కొన్ని సంవత్సరాలుగా అద్దె వసూలు కావడంలేదు. దీంతో ఇప్పటివరకు ఎస్సీ కార్పోరేషన్ షాపులకు రావాల్సిన అద్దె రూ.21.85 లక్షలకు పైగా ఉంది. ప్రతి 11 నెలలకు ఒకసారి షాపు అగ్రిమెంట్‌ను రెన్యువల్ చేసి అద్దె పెంచాల్సి ఉంది. అయితే అలా జరిగిన దాఖలాలు లేవు.
తనిఖీలు నామమాత్రం
షాపులను ఎస్సీ కార్పోరేషన్ అధికారుల తనిఖీలు చేసి దుకాణాలు ఎవరు పేరు మీద ఉన్నాయి? వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు? అనే విషయాలను పరిశీలించాల్సి ఉంది. అయితే తనిఖీలు నామమాత్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది అధికారులు తనిఖీలకు వెళ్లినా, అద్దె కట్టాలని నోటీసులు జారీ చేసినా అధికార పార్టీ నాయకుల ద్వారా వారిపై ఒత్తిళ్లు తెప్పిస్తున్నారు.
విచారణ చేస్తున్నాం : రామచంద్రారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న దుకాణాలు ఎవరి పేరు మీద ఉన్నాయి? వాటిలో ప్రస్తుతం ఎవరున్నారు? ఎన్ని నెలల నుంచి అద్దె కట్టాలి అనే విషయాలను విచారిస్తున్నాం. నామమాత్రపు అద్దె కూడా కట్టకుండా ఉన్న వారిపై ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటాం.
ఎస్సీలకే కేటాయించాలి : కనుపర్తి గంగాధర్, మాలమహానాడు నెల్లూరు నగర అధ్యక్షుడు
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న దుకాణాలు అర్హులైన ఎస్సీలకే ఇవ్వాలి. జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఎస్సీ యువత ఉపాధి లేకుండా ఉన్నారు. షాపులను గుర్తించి వారికి ఇవ్వాలి. వేలం పాట కూడా నిర్వహించి వారికే ఇవ్వాలి. లేకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.