డబ్బులు బాకీ ఉన్నారని పాస్‌బుక్‌లు లాక్కున్న తెలుగు తమ్ముళ్లు
ఆ తర్వాత అక్రమంగా తన పేర రిజిస్ట్రేషన్
అధికారుల చుట్టూ తిరుగుతున్న వృద్ధురాలు నారాయణమ్మ
అనంతపురం సిటీ : తెలుగు తమ్ముళ్లు దర్జాగా భూమిని కబ్జా చేశారు. తన భూమి ఇప్పించి న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతోంది. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్‌కు వచ్చిన ఆమెకు సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయంగా తిరుగుతోంది. ఆమెను పలకరించిన ‘సాక్షి’కి తన కన్నీటి గాథను తెలిపింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...తాడిపత్రి మండల పరిధిలోని పెద్ద పొడమల గ్రామానికి చెందిన ఓబుళేసు భార్య పి.నారాయణమ్మకు సర్వే నంబర్లు 790-1లో 45 సెంట్లు, 792-ఎ1లో 30 సెంట్లు, 794-1లో 48 సెంట్లు, 795-2లో 68 సెంట్లు కలిపి మొత్తం 1.91 ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2004 లో భూమి వచ్చింది.
ఈ భూమి ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా దేవాదాయ శాఖ నుంచి ఎస్సీ కార్పొరేషన్ కొని లబ్ధిదారులకు అందజేసింది. లబ్ధిదారుల్లో నారాయణమ్మ ఒకరు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత నాగసుబ్బరాయుడు కుమారుడు టి.సుబ్బయ్య మూడు సంవత్సరాల క్రితం నీ కుమారుడు డబ్బులు బాకీ ఉన్నాడని నారాయణమ్మ వద్ద ఉన్న భూమి పాస్‌పుస్తకాలు లాక్కున్నాడు. డబ్బు కట్టినప్పుడు పాస్ బుక్ తీసుకెళ్లాలని హుకుం జారీ చేశాడు.
ఆ తర్వాత ఆ భూమిని తన పేర రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎమ్మార్వో ద్వారా ఏకంగా పాస్‌బుక్కులు, అడంగుల్లో సైతం నమోదు చేయించుకున్నాడు. విషయం తెలిసిన నారాయణమ్మ తన భూమి ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతోంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబుళేసు దీనిపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామునాయక్ వద్ద ఆరా తీశారు. ఇది తమ పరిధి కాదని స్పష్టం చేయడంతో బుధవారం జరగనున్న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌లో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. బాధితురాలికి న్యాయం జరగకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
వృద్ధురాలి భూమి దర్జాగా కబ్జా
Published Wed, May 20 2015 2:49 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement