కర్నూలు(అర్బన్): జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2013- 14 ఆర్థిక సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నోటికాడికొచ్చిన సబ్సిడీ చేజారిపోయింది. కాగా వీరికి 2014-15 ఆర్థిక సంవత్సరంలోనైనా సబ్సిడీ మంజూరు చేసే విషయంలో తీవ్ర సందిగ్ధత నెలకొంది. దీంతో వందల సంఖ్యలో ఎస్సీ లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను పొందేందుకు అష్టకష్టాలు పడి దరఖాస్తు చేసుకున్నారు.
ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాలు, బ్యాంకుల చుట్టు తిరిగి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 2568 మంది ఎస్సీ వర్గాలకు చెందిన ప్రజలు కోరిన ధ్రువీకరణ పత్రాలను జతపర్చి దరఖాస్తు చేశారు. వీరిలో 1896 మందికి రుణాలు మంజూరు కాగా నాన్ బ్యాంకింగ్ పథకాల కింద 63 మంది లబ్ధిదారులకు సబ్సిడీని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు విడుదల చేశారు. మిగిలిన 1833 మందిలో అప్పటి జిల్లా కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డి అర్హులైన 1157 మందికి రుణాలను విడుదల చేసేందుకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ప్రొసీడింగ్స్ పొందిన వారిలో 676 మంది మాత్రమే జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతా నంబర్లను కార్పొరేషన్‌కు అందజేసిన నేపథ్యంలో వీరి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీని విడుదల చేయాలని సంబంధిత అధికారులు హైదరాబాద్‌లోని ఎండీ కార్యాలయానికి అప్‌లోడ్ చేశారు.
అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా సబ్సిడీ విడుదల కాలేదు. గత ఏడాదికి సంబంధించిన సబ్సిడీ పెండింగ్ ఉంటే... ప్రస్తుతం 2014-15 ఆర్థిక సంవత్పరంలో కొత్తగా రుణాలు అందించేందుకు వార్షిక ప్రణాళిక రూపొందించి ఆన్‌లైన్‌లో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే గత ఏడాది రుణాలు మంజూరైనా, ఎలాంటి సబ్సిడీ విడుదల కాని లబ్ధిదారులు తిరిగి ఈ ఏడాది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేకునేందుకు ప్రయత్నిస్తుంటే వెబ్‌సైట్ వారి దరఖాస్తులను స్వీకరించడం లేదు.
గత ఏడాది వీరి ఆధార్ నెంబర్లు, రేషన్‌కార్డు వ్యాప్ నంబర్లన్ని అప్‌లోడ్ అయిన కారణంగా ఈ ఏడాది తిరిగి దరఖాస్తు చేసేకునేందుకు ప్రయత్నిస్తే వెబ్‌సైట్ తిరస్కరిస్తోంది. దీంతో గత ఏడాది సబ్సిడీ మంజూరైన నయాపైసా చేతికందక పోవడం. ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేని పరిస్థితి ఏర్పడడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రుణాలు మంజూరైన వారికి ఈ ఏడాది ఇచ్చిన తరువాతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి రుణాలు అందించాలని కోరుతున్నారు.
సబ్సిడీ పాయె..!
Published Tue, Dec 2 2014 2:08 AM | Last Updated on Tue, Jul 24 2018 2:17 PM
Advertisement