రుణాలు ఎగ్గొట్టే వారిని వదలం
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి
నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు తీసుకుని ఎగ్గోట్టే వారిని ఎట్టి పరిస్థితులలో వదిలేది లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణం కడితేనే సబ్సిడీ ఇవ్వాలనే కొత్త విధానం ప్రవేశపెట్టామన్నారు. సబ్సిడీ రుణాలను బ్యాంకు అధికారులు దళితులకు ఇవ్వడంలేదనే విమర్శలు ఉన్నాయన్నారు. ఆయన వెంట సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూధన్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామచంద్రారెడ్డి, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు వాదనాల వెంకటరమణ తదితరులున్నారు.
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
నాయుడుపేట: ప్రభుత్వం మంజూరు చేసే రుణాలను దళితులు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. నాయుడుపేటలోని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నివాసానికి బుధవారం వచ్చిన ఆయనను ఘనంగా సత్కరించారు. జూపూడి మాట్లాడుతూ రుణాలు పొందిన లబ్ధిదారులు కచ్చితంగా ఉపాధి పొందాలని సూచించారు. సబ్‌ప్లాన్ కింద రూ.8,700 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. దళితులకు ఎస్సీ కార్పొరేషన్ హామీగా ఉండి రుణాలు మంజూరు చేసేందుకు త్వరలో ఉత్తర్వులు రానున్నాయన్నారు.