సాక్షి, హైదరాబాద్: ‘మనకు తెలియకుండా మన ఖాతాలో భారీ మొత్తంలో నగదు జమై.. తిరిగి క్షణాల్లో మరో ఖాతాకు బదిలీ అయితే ఎలా ఉంటుంది’.. నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి యూనిట్లపై రాయితీలిచ్చే ఎస్సీ కార్పొరేషన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది.
ఈ ఏడాది మార్చి 31న రూ.1,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణ రూపంలో కార్పొరేషన్ ఖాతాలో జమ చేసింది. ఏమైందో ఏమోగానీ.. మరుసటి రోజే ఆ మొత్తం తిరిగి ప్రభుత్వ ఖాతాకు వెళ్లిపోయింది. రుణం కావాలని కార్పొరేషన్ దరఖాస్తు చేసుకోకుండానే రుణంరావడం, వెళ్లడంతో ఆ శాఖలో అయోమయం నెలకొంది.
నిధులు క్యారీ ఫార్వర్డ్
2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,418.88 కోట్లకు ఎస్సీ కార్పొరేషన్ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలను కార్పొరేషస్ ప్రారంభించింది. కానీ ఆర్థిక సంవత్సరం చివరి వరకూ నిధులు విడుదల కాకపోవడంతో పలు కార్యక్రమాలు పెండింగ్‌లో ఉండిపోయాయి.
ఈక్రమంలో ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న ఆ శాఖ ఖాతాలో రూ.1,500 కోట్లు రుణ రూపంలో రావడం.. మరుసటి రోజు తిరిగి సర్కారు ఖాతాకు వెళ్లిపోవడం జరిగింది. ఆ శాఖ ఖాతా స్టేట్‌మెంట్‌ను చూసిన కార్పొరేషన్ ఉన్నతాధికారులు.. రుణం రావడం, తిరిగి పోవడం చూసి అవాక్కయ్యారు. అయితే ఆ శాఖ బడ్జెట్‌లో రుణం జతకావడంతో 2018–19 ఆర్థిక సంవత్సరం గత నిధులు క్యారీఫార్వర్డ్ అయ్యాయి. దీంతో నిధులు లేక నిలిచిపోతాయనుకున్న పథకాలను అమలు చేసే అవకాశం లభించింది.
ఈ సారీ రూ.1,500 కోట్లతో ప్రణాళిక
2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,560.77 కోట్లతో వార్షిక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ఎస్సీ కార్పొరేషన్ నివేదించింది. కాగా, ఇటీవల కార్పొరేషన్‌కు రూ.250.57 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ మేరకు బీఆర్‌ఓ (బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్) కూడా విడుదలైంది. కానీ వీటిని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో నిధులున్నా ఖర్చు చేయలేక కార్పొరేషన్ అయోమయంలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment