మంచిర్యాల రూరల్/అర్బన్, న్యూస్‌లైన్: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పేదలు, నిరుద్యోగులకు ఏటా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు సహకరించాలని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఎ.లక్ష్మన్‌కుమార్ సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆ నిబంధనలు అమల్లోకి వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రుణాల లక్ష్యం నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గతంలో ద రఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల దరఖాస్తులను పరిశీలించి, అర్హులను ఎంపిక చేశామని, ఆయా వివరాలు బ్యాంకర్లకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పెరక యాదయ్య అందిస్తారని అన్నారు. బ్యాంకర్లు ఈనెలాఖరులోగా అనుమతిస్తే.. ప్రభుత్వం నుంచి వారంలోగా వారి ఖాతాలో జమచేసేలా చూస్తానని హామీ ఇచ్చారు.
అందరిలోనూ వెలుగులు నింపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 30 శాతం సబ్సిడీని 60 శాతానికి పెంచినట్లు వివరించారు. లక్ష రూపాయల రుణం తీసుకున్న లబ్ధిదారులకు 60 వేలు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. భర్తను కోల్పోయిన ఎస్సీ మహిళలను గుర్తించాలని, వారికి కార్పోరేషన్ తరఫున రూ.50 వేలు అందిస్తామన్నారు. ఫిభ్రవరి 10వ తేదీలోగా సంక్షేమ రుణాల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రైతులకు పంపుసెట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లు అందించాలని, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఇళ్లల్లో 50 యూనిట్లు తక్కువ విద్యుత్ వాడే వారి వివరాలు సేకరించాలన్నారు. అనంతరం బ్యాంకర్లు, అధికారుల సమస్యలను తెలుసుకున్నారు. సమావేశంలో మంచిర్యాల ఎంపీడీవో కె.నరేందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, తహశీల్దార్ రవీందర్‌రావు, దక్కన్ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ రవీందర్, ఈవోపీఆర్డీ శంకర్, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ పూర్తయినట్లే
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిపేందుకు రాష్ట్రపతి మరో వారం రోజుల గడువు ఇచ్చారని, ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే పార్లమెంటు సమావేశంలోనే బిల్లు ఆమోదం పొంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ లక్ష్మణ్‌కుమార్ స్పష్టం చేశారు. గురువారం మంచిర్యాలకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై సీఎం కుట్రలు పనిచేయవని, కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎప్పుడో పూర్తి చేసిందన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు నిబంధనలు పూర్తయ్యాయన్నారు. తదుపరి మంచిర్యాలకు వెళ్లిన ఆయన రహదారులు, భవనాలశాఖ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ యువకులకు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయించి స్వయం పొందాలనేది ప్రభుత్వం లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.296 కోట్లు సబ్సిడీ కింద, రూ.200 కోట్లు బ్యాంకులు రుణాలుగా ఇస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవాలని రెండో వారంలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని చెప్పారు. అనంతరం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి లక్ష్మణ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు.
రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు సహకరించాలి
Published Fri, Jan 24 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement