సాక్షి, గుంటూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల్లో నిరుద్యోగులైన యువకులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు, స్వయం ఉపాధితో ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు ప్రతి ఏటా కేటాయించే బ్యాంకు రుణాలు ఈ ఏడాది వారికి అందుతాయో లేవోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. నిన్నటి వరకు రాయితీపై పీటముడి వేసిన సర్కారు ఇప్పుడు రాయితీ పెంచి ఆంక్షల పర్వం కొనసాగించడంతో జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులు ఉపాధికి దూరం కానున్నారు.
ఇప్పటికే మండలాల్లో క్రెడిట్ క్యాంపులు నిర్వహించి డీఆర్డీఏ పీడీ కన్వీనరుగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే రాయితీ విడుదలపై సందిగ్ధత నెలకొనడంతో ఏ ఒక్కరికీ రుణం మంజూరు చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో సర్కారు జీవో నంబరు 101 జారీ చేసింది. ఈ జీవోతో ఎస్సీ, ఎస్టీలకు 60 శాతంతో రూ.లక్ష వరకు రాయితీ పరిమితి, బీసీలకు 50 శాతం రాయితీతో రూ.లక్ష వరకు పరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
అయితే సర్కారు తీరు ఓ చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్నట్లుంది. రాయితీ పెంచి నిబంధనలు విధించడంతో వేల సంఖ్యలోనే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోనుంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల కార్పొరేషన్ పరిధిలో సుమారు 10 వేలకు పైగా లబ్ధిదారులు అర్హత కోల్పోనున్నారు. సర్కారు నిబంధనలతో లబ్ధిదారుల వడపోత మొదలైంది. పైగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సూచనలతో మళ్లీ లబ్ధిదారుల ఎంపికకు తాజా టార్గెట్లు నిర్ధేశించనున్నారు.
ఎంపిక అలా.. నిబంధనలు ఇలా...
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులకు కేటాయించే రుణాలపై లక్ష్యం విధించింది. ఈ మేరకు ఆయా కార్పొరేషన్ల పరిధిలోని అధికారులు గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ కన్వీనరుగా మండల కేంద్రాల్లో క్యాంపులు నిర్వహించి దరఖాస్తులు ఆహ్వానించారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఆరు వేల లబ్ధిదారుల వరకు ఎంపిక చేయాలని ఆదేశాలు ఉండగా, రెండు వేల వరకు దరఖాస్తులు అందాయి. బీసీ కార్పొరేషన్‌లో 3,429 మందికి 1,300 దరఖాస్తులు అందాయి.
ఎస్టీలు 2,370 , మైనార్టీలు 3,250, వికలాంగుల కోటాలో 1,760 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మొదట్లో రూ.30 వేల వరకే రాయితీ అని చెప్పిన ప్రభుత్వం, తాజా ఉత్తర్వుల ప్రకారం రూ.లక్షకు పొడిగించి మెలిక పెట్టింది. వయస్సు, మీ సేవలో కుల ధ్రువీకరణ పత్రంతో సరిపోవాలని, ఒక ఇంట్లో రేషన్ కార్డు కింద ఏదైనా రుణం తీసుకుంటే, ఐదేళ్ల వరకు మరి ఏ ఇతర రుణం పొందకూడదనే నిబంధనలు విధించింది. వయస్సు 21 సంవత్సరాల నుంచి 45 వరకు ఉండాలనడంతో జిల్లాలో వేలాది మంది స్వయం ఉపాధికి దూరం కానున్నారు.
ఎస్సీ కార్పొరేషన్‌లో అందిన 2వేలకు పైగా దరఖాస్తుల్లో ఇప్పుడున్న నిబంధనలతో కేవలం 700 మంది మాత్రమే అర్హత సాధించనున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు చాలా తక్కువ సమయం ఉండటంతో ఎంపికైన వారికి రుణాలు అందిస్తారో.. లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాయితీ పెంపు..ఆంక్షల విధింపు
Published Wed, Jan 8 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement