- సబ్సిడీ రుణాల్లో వడపోత
- తెలుగు తమ్ముళ్లకే కమిటీ బాధ్యతలు
- ఎస్సీ, బీసీల సంక్షేమానికి తూట్లు
గుడ్లవల్లేరు : రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందాలన్నా తెలుగు తమ్ముళ్ల కనికరం పైనే‘ఆధార’పడి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా వారిదయ తప్పనిసరి అవుతోంది. సంక్షేమ కార్పొరేషన్లలో సబ్సిడీ రుణాల్ని పొందాలనుకునే ఈ వర్గాల వారు ప్రభుత్వం విధించిన అర్థంపర్థంలేని నిబంధనలతో నానాఇబ్బందులకు గురవుతున్నారు.
గతంలో లోను మంజూరైనప్పటికీ... పంచాయతీల స్థాయిలో ఇటీవల ప్రభుత్వ పింఛన్లను వడపోసిన కమిటీల వారే ఈ సంక్షేమ రుణాల జాబితాను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తున్నారు. పచ్చ చొక్కాలు వేసుకొచ్చే కార్యకర్తలు పాత జాబితాలో ఉంటేనే సబ్సిడీ రుణాలు మంజూరవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు.
జిల్లాకు చేరని రూ.23కోట్ల సబ్సిడీలు...
జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందాలని గత అక్టోబరులో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు చేసి జిల్లాలో 2,108మందికి రుణాలు మంజూరు చేశారు. అయితే యూనిట్లను గ్రౌండ్ చేసేందుకు కావాల్సిన రూ.11కోట్ల సబ్సిడీలు జిల్లాకు చేరలేదు. బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీలుగా రూ.12కోట్లు ఇవ్వాలి. వీటి కోసం 1,800మంది బీసీలు ఎదురు చూస్తూ... దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. డీడీలు, డాక్యుమెంట్ల పేరిట వారు వేలాది రూపాయల చేతిచమురు వదిలించుకున్నారు. అయితే రుణాలు చేతికి రాకపోగా... కొత్తగా వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మంజూరైన అర్హుల జాబితాల వడబోత కార్యక్రమాన్ని చేపట్టిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్.వి.వి.సత్యనారాయణను వివరణ కోరగా మంజూరైన జాబితాల్లో వున్నవారు అర్హులైతే గ్రామస్థాయి కమిటీల వారు గుర్తించి, తమకు పంపుతారన్నారు.
వడ్డీ చెల్లించమంటున్నారు...
గతేడాది రూ.80వేల రుణం బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైంది. అందులో రూ.40వేలను బ్యాంకు వాటా కింద నా ఖాతాలో బ్యాంకు వారు వేశారు. సబ్సిడీ రూ.40వేలు ఈ రోజు వరకూ రాలేదు. బ్యాంకు మేనేజరు మాత్రం నా ఖాతాలో వేసిన రూ.40వేలకు వేలల్లో వడ్డీ చెల్లించమంటున్నారు. అసలు రుణమే చేతికి రాలేదు. సబ్సిడీని నిలిపేయడం వలన ఈ తిప్పలన్నీ వచ్చాయి.
- నందం నాగేశ్వరరావు, గుడ్లవల్లేరు
అర్హులకు ఎగవేసేందుకే..
అర్హులకు సంక్షేమ రుణాలు ఇవ్వకుండా ఎగవేసేందుకే ప్రభుత్వం ఈ అర్థం లేని నిబంధనలను ప్రవేశ పెట్టింది. పాత జాబితాల్లో తెలుగు తమ్ముళ్లకు రుణాలు ఇచ్చుకునేందుకే తెలుగు తమ్ముళ్ల గ్రామస్థాయి కమిటీలకు ఈ బాధ్యతను అప్పగించింది. దీని వలన అర్హులు అన్యాయమవుతున్నారు.
- డి.కనకరత్నారావు, గుడ్లవల్లేరు దళిత నేత