కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నయాపైసా విడుదల చేయలేదు. దీంతో ఏడాది క్రితం రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కార్యాలయం చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. బీసీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు చెందిన ప్రజలు సబ్సిడీతో కూడిన రుణాలను అందుకొని యూనిట్లను నెలకొల్పుకుంటుండగా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందాలనుకున్న వారు ఏడాది కాలంగా నిరీక్షణకు గురవుతున్నారు.
2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని 2937 మందికి రుణాలు అందించాలని లక్ష్యం నిర్ణయించుకోగా, 2015 జూలై నెల నుంచి అదే ఏడాది ఆగష్టు నెల వరకు దాదాపు 4 వేల మంది వరకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు అనుమతి పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3471 మందికి జిల్లా కలెక్టర్ రుణాలు మంజూరు చేశారు.
వీరిలో 2648 మంది రెండు బ్యాంకు ఖాతా నెంబర్లను అందజేశారు. ఇంకా 823 మంది బ్యాంకు ఖాతా నెంబర్లు అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తమకు అందిన రెండు బ్యాంకు ఖాతా నెంబర్లను కూడా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సబ్సిడీ విడుదల కోసం ఉన్నతాధికారి కార్యాలయానికి అప్‌లోడ్ చేశారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా సబ్సిడీ విడుదల కాలేదు.
ఏ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారంటే..
ఐఎస్‌బీ సెక్టార్ కింద పెయింటింగ్ అండ్ రేడియం వర్క్స్, ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్, చెప్పులు, లెదర్ ఆర్టికల్స్, స్క్రీన్ ప్రింటింగ్, ఫ్లోర్ మిల్లు, ఇంటర్‌నెట్, జీరాక్స్ సెంటర్లు, టిఫిన్, టీ స్టాల్స్ తదితరాలను ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ట్రాన్స్‌పోర్టు సెక్టార్ కింద మూడు చక్రాల ప్యాసింజర్ ఆటో, పిక్‌అప్ వ్యాన్, ట్రాలీ ఆటో, టాటా ఏసీ, ట్రాక్టర్, మైనర్ ఇరిగేషన్ కింద షాలో ట్యూబ్ వెల్స్ అండ్ సబ్‌మెర్సిబుల్ పంప్‌సెట్స్, ఆయిల్ ఇంజన్లు, బర్రెలు, మేకల పెంపకంతో పాటు మహిళా గ్రూపులు కూడా ఆర్థిక చేయూత కోసం దరఖాస్తు చేసుకున్నారు.
విడుదల కావాల్సింది రూ.76.45 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాలు మంజూరైన లబ్ధిదారులకు రూ.43.76 కోట్ల సబ్సిడీతో కలిపి మొత్తం రూ.76.45 కోట్ల బడ్జెట్ విడుదల కావాల్సి ఉంది. అయితే ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు సబ్సిడీ విడుదల కాలేదు. మరో రెండు నెలలు ఉంటే 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.
అయితే ఇప్పటి వరకు కార్పొరేషన్‌కు ఎలాంటి బడ్జెట్ విడుదల కాకపోవడంతో అసలు ఈ ఏడాది రుణాలు మంజూరు అవుతాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏడాది డిసెంబర్ నెల నుంచి సబ్సిడీ విడుదలవుతూ వచ్చేది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ విడుదల కాకపోవడంతో ఎస్సీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ బుధవారం కర్నూలుకు వస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు.ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల, నాయకులు, మేధావులు, ఎన్‌జీఓల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. సమావేశానికి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులందరూ హాజరు కావాలని ఆయన కోరారు.
త్వరలో విడుదలయ్యే అవకాశం
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ కార్యాలయంలో ఎలాంటి దరఖాస్తులు పెండింగ్ లేవు. రుణం మంజూరై రెండు బ్యాంకు ఖాతా నెంబర్లు అందించిన 2648 మంది లబ్ధిదారులకు సబ్సిడీ విడుదల చేయాలని వారి దరఖాస్తులను అప్‌లోడ్ చేయడం చేశారు. త్వరలోనే సబ్సిడీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
- ఏ వీరఓబులు,ఈడీ, ఎస్సీ కార్పొరేషన్
ఎదురు చూపులకు ఏడాది!
Published Wed, Jun 29 2016 9:39 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM
Advertisement