దళిత వర్గాలను కులం పేరుతో కించపరిచినా, ఆ వర్గాల పట్ల వివక్ష చూపినా చర్యలు తీసుకోవడానికి ఆస్కారమిస్తున్న ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం వేధింపులకు ఆయుధంగా మారుతున్న ఉదంతాలు అనేకం ఉంటున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి, వాటిని నివారించేందుకు కీలక ఆదేశాలిచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఈ చట్టం కింద ఫిర్యాదులొస్తే తక్షణ అరెస్టుకు అవకాశం ఉండదు. ప్రభుత్వోద్యోగులపై ఫిర్యాదులొచ్చినప్పుడు వారి నియామక అధికారి నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలి. ప్రైవేటు ఉద్యోగుల విషయంలో అయితే సీనియర్ పోలీసు సూపరింటెండెంట్(ఎస్‌ఎస్‌పీ) అనుమతి తీసుకోవాలి.
అంతే కాదు... ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేముందు సంబంధిత కేసు ఈ చట్టం పరిధిలోకి వస్తుందా రాదా అని ప్రాథమిక విచారణ జరపాలి. అది సహేతుకమైనదని నిర్ధా రించుకోవాలి. కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవనుకుంటే నింది తుడికి ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చునని కూడా సుప్రీంకోర్టు సూచించింది. దాదాపు మూడు దశాబ్దాలనాడు వచ్చిన ఈ చట్టం అమలు విషయంలో మొదటినుంచీ రెండు రకాల అభిప్రాయాలుంటున్నాయి. అది సమర్ధవంతంగా అమలు కావడం లేదని, కేసు నమోదులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నదని దళిత సంఘాలు ఆరోపిస్తుండగా...తమపై అన్యాయంగా కేసు పెట్టారని వాపోయేవారూ ఉంటు న్నారు. కేవలం ఈ చట్టం విషయంలోనే కాదు... దాదాపు అన్ని చట్టాల అమలు విషయంలోనూ ఇలాంటి పరస్పర విరుద్ధమైన వాదనలు వినబడటం రివాజే.
మన దేశంలో శతాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా సాగుతున్న కులవ్యవస్థ అసమానత లకూ, అఘాయిత్యాలకూ, అవమానాలకూ, వివక్షకూ తావిస్తోంది. దీన్ని సరిదిద్దేం దుకు కొందరూ, నామరూపాల్లేకుండా చేయాలని మరికొందరూ ప్రయత్నిస్తున్నా కులతత్వం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. 1905లో బాబా సాహెబ్ అంబే డ్కర్ ఎదుర్కొన్నలాంటి స్థితిగతులే కాస్త హెచ్చుతగ్గులతో ఇప్పటికీ రాజ్యమేలుతు న్నాయి. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే... ఆయన నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగంవల్ల, అది కల్పించిన హక్కుల వల్ల ఆ వర్గాల్లో విద్యాధికులు పెరిగారు. చైతన్యం హెచ్చింది. ప్రశ్నించే తత్వం విస్తరిస్తోంది.
అంతమాత్రాన సమాజంలో వివక్ష అంతరించిందా? అవమానాలూ, అఘాయిత్యాలూ సమసిపోయాయా? దళి తులకూ, ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్ల సదుపాయం లభించి వచ్చే ఏడాదికి 70 ఏళ్లవుతుంది. ఇంతకాలమైనా దళిత వర్గాల్లోని అట్టడుగు కులాలకు అవి ఇంకా చేరనేలేదు. మరోపక్క 1958నాటి కిలవేన్మణి(తమిళనాడు) ఉదంతం మొదలుకొని నిన్నమొన్నటి ఉనా(గుజరాత్) ఘటన వరకూ దళితులపై ఆధిపత్య కులాల అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1996లో దళిత యువకులకు శిరోముండనం చేసిన ఉదంతం జరిగి 22 ఏళ్లవుతున్నా ఈనా టికీ ఆ కేసు నత్తనడకన నడుస్తోంది.
పైగా బాధితులు దళితులు కాదు.. బీసీలన్న వాదనలు బయల్దేరుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యువ మేధావి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలో ఆరోపణలొచ్చిన ఎవ రిపైనా ఇంకా దర్యాప్తు పూర్తికాలేదు. కేసులు నమోదు కాలేదు. ఆయన తల్లి దళిత మహిళే అయినా రోహిత్ వేముల బీసీ కులంకిందికొస్తారని తర్కిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో వాకపల్లి ఆదివాసీ మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారాలకు పాల్పడ్డారన్న ఉదంతం విచారణలోనూ ఏళ్ల తరబడి అనిశ్చితే అలముకొంది. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత ఈమధ్యే దానికి కదలిక వచ్చింది.
ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం1989లో వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసిన ఉదంతాలు లేనేలేవని ఎవరూ అనరు. ఏ చట్టాన్నయినా దుర్వినియోగం చేసేవారు ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకొచ్చిన నిర్దిష్టమైన కేసు కూడా ఆ కోవలోనిదే కావొచ్చు. కానీ ఒక చట్టం దుర్వినియోగం అవుతున్నదా లేదా అనేది ఆ చట్టంకింద పడే శిక్షల శాతాన్నిబట్టి నిర్ణయించడం సబబుకాదు. కేసు వీగిపోవడానికి పోలీసు దర్యాప్తు సక్రమంగా లేకపోవడం మొదలుకొని సాక్షులు గట్టిగా నిలబడకపోవడం వరకూ సవాలక్ష కారణాలుంటాయి.
ఆధిపత్యకులాల అజ్మాయిషీ బాగా నడిచేచోట తమకు జరిగిన అన్యాయంపై కేసులు పెట్టేందుకే దళితులు జంకుతారు. వారు ధైర్యం చేసి కేసులు పెట్టినా ఆ కేసుల్ని రిజిస్టర్ చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తారు. భయపెట్టి, డబ్బు ఆశచూపి లోబర్చుకునే ప్రయత్నాలూ సాగుతాయి. ‘కేసు నిజ మైనదే అయినా తగిన సాక్ష్యాలు లేవ’ని, ‘తప్పుడు కేసుల’ని, ‘పొరబడి పెట్టిన కేసుల’ని పేరుబెట్టి బుట్టదాఖలా చేయడం చాలా ఉదంతాల్లో కనబడుతుంది. నిజా నికి ఈ చట్టంకింద పోలీసులు పెట్టే కేసుల్లో 50 శాతం న్యాయస్థానాల వరకూ పోనేపోవని ఆమధ్య ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అధ్యయనంలో తేలింది.
2015లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం ఆచరణలో బాధితులకు సక్రమంగా వినియోగపడటం లేదని భావించి దానికి సవరణలు తీసు కొచ్చింది. అయినప్పటికీ నిరుడు కేంద్ర హోంశాఖ వార్షిక నివేదికను బట్టి చూస్తే చట్టం అమల్లో ఉన్నా దళితులు, ఆదివాసీలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చింది. చట్టం కారణంగా అమాయక పౌరులకు వేధింపులుండరాదని, కులవిద్వేషాలు ఏర్పడకూడదని సుప్రీంకోర్టు వెలిబుచ్చిన ఆత్రుత అర్ధం చేసుకోదగిందే.
ఆ చట్టం కింద అందిన ఫిర్యాదులపై చిత్తశుద్ధితో సత్వర దర్యాప్తు చేపట్టేలా చర్యలు తీసు కున్నప్పుడే అది సాధ్యమవుతుంది. సుప్రీంకోర్టు ప్రస్తుతం ఇచ్చిన ఆదేశాలతో నిమిత్తం లేకుండానే చాలా సందర్భాల్లో కేసుల నమోదులో, నిందితుల అరెస్టులో అంతులేని జాప్యం చోటుచేసుకుంటున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ఇకపై అది మరింత పెరిగే ప్రమాదం లేదా? అన్ని కోణాల్లోనూ తాజా తీర్పును పరిశీలించి అణగారిన వర్గాల హక్కులకు భంగం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం అవసరం.
Comments
Please login to add a commentAdd a comment