సాక్షి, హైదరాబాద్: దళితులకు మూడెకరాల భూ పంపిణీపై ఎస్సీ కార్పొరేషన్ కొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. 2017–18 వార్షిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు వేగవంతం చేసింది. నెలరోజుల ప్రణాళిక రూపొందించిన కార్పొరేషన్.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 8924.21 ఎకరాల భూమిని దళిత రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతేడాది పంపిణీ ప్రక్రియ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ ఏడాది గడువుకు ముందే లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలివ్వాలని భావిస్తోంది.
నెలరోజుల కార్యాచరణ
జిల్లాల వారీగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు భూ పంపిణీ లక్ష్యాలు నిర్దేశించిన ఎస్సీ కార్పొరేషన్.. ఆ మేరకు భూమి సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది. భూముల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను పక్షం రోజుల్లోగా పూర్తి చేయాలని పేర్కొంది. అలాగే భూముల రిజిస్టర్, డీమార్కేషన్ ప్రక్రియను మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది. దీంతో జిల్లా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. 30 రోజుల పనిదినాల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మరోవైపు పంపిణీకి గుర్తించిన భూముల్లో నీటి వసతి ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.
పంట ఖర్చుల పంపిణీ..
లబ్ధిదారులకు ఏడాదిపాటు సాగు ఖర్చులివ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. పథకం మార్గదర్శకాల్లోనూ నిబంధనలు పొందుపరిచింది. తాజాగా 2014–15 వార్షిక సంవత్సరానికి రైతులకు ఇవ్వాల్సిన సాగు ఖర్చుల పంపిణీకి ఎస్సీ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. 2014–15లో రాష్ట్రవ్యాప్తంగా 11,786 ఎకరాలు పంపిణీ చేయగా.. 6053.10 ఎకరాల్లో పంటలు వేస్తున్నారు. రైతులకు ఒకట్రెండు రోజుల్లో ఆర్థిక సాయం అందించాలని, మిగిలిన భూమికి నవంబర్ నెలాఖరులోగా నిధులివ్వాలని అధికారులు నిర్ణయించారు.
‘మూడెకరాల’కు కొత్త కార్యాచరణ
Published Mon, Oct 23 2017 2:16 AM | Last Updated on Mon, Oct 23 2017 2:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment