భూముల వేటలో సర్కారు!
- దళితులకు భూ పంపిణీ కోసం ఎస్సీ కార్పొరేషన్ పర్యటనలు
- అనువైన భూముల లభ్యతపై క్షేత్ర పరిశీలన
- ఈ ఏడాది 10,500 ఎకరాల పంపిణీకి ప్రణాళిక
- రూ.447.35 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం
- నిర్దేశిత మొత్తంలో భూమి లభిస్తే 3,500 కుటుంబాలకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం భూముల వేటలో పడింది. ఈ పథకాన్ని వేగవంతం చేయాలన్న యోచనతో ఈ ఏడాది ఏకంగా 10,500 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని నిర్ణయించింది. గత మూడేళ్లలో కలిపి 10 వేల ఎకరాలు మాత్రమే పంపిణీ చేసిన నేపథ్యంలో ఈ సారి వేగం పెంచాలని ఎస్సీ కార్పొరేషన్‌ను ఆదేశించింది. దీంతో ఎస్పీ కార్పొరేషన్ అధికారులు అనువైన భూముల లభ్యతపై దృష్టి సారించారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకుంటే ప్రైవేటు వ్యక్తుల నుంచి వ్యవసాయ యోగ్యత ఉన్న భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేసేలా చర్యలు మొదలు పెట్టారు.
కొనుగోలుకు రూ.447.35 కోట్లు
ప్రభుత్వ పరిధిలో చాలా భూములున్నప్పటికీ ఎక్కువ భాగం సాగుకు అనువుగా లేవు. కొండలు, గుట్టలు, రాళ్ల భూమి ఉండడంతో.. ఆ భూములను పంపిణీ చేసినా ఫలితం ఉండదన్న యోచనతో ప్రైవేటు భూములు కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత మూడేళ్లలో పంపిణీ చేసిన భూమిలోనూ ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినదే సగానికి పైగా ఉంది. తాజాగా 2017–18లో రాష్ట్రవ్యాప్తంగా 10,500 ఎకరాల పంపిణీ కోసం ఎస్సీ కార్పొరేషన్ రూపొందించిన ప్రణాళికకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. భూముల కొనుగోలు కోసం రూ.447.35 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు.. జిల్లాల వారీగా భూలభ్యతపై దృష్టి సారించారు. భూములు కొనుగోలుకు సంబంధించి అవగాహన కల్పిస్తూ.. ఆసక్తిగల రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఇప్పటికే 746.18 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. ఇలా ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తున్న భూమికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయి పరిశీలన చేపడుతోంది. ప్రస్తుతం వివిధ జిల్లాల పరిధిలో దాదాపు 6 వేల ఎకరాల విక్రయానికి సంబంధించి తహసీల్దార్ల వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిలో భూగర్భ జలాల పరిస్థితి, భూమి రకం, టైటిల్‌తో పాటు అన్ని అంశాలనూ పరిశీలించాక భూమిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ప్రణాళిక ప్రకారం 10,500 ఎకరాల భూమి లభిస్తే... ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 3,500 కుటుంబాలకు లబ్ధి కలుగనుంది.
పంట సాగుకూ సహకారం..
భూ పంపిణీ పథకం కింద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమితో పాటు ఏడాది పాటు సాగుకు ప్రభుత్వం సహకారం అందించనుంది. వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా విత్తనాల పంపిణీ, బోరు వేసేందుకు ఆర్థిక సాయం కూడా ఇవ్వనుంది.