
సాక్షి, హైదరాబాద్: కార్పొరేషన్ ద్వారా ‘స్వయం ఉపాధి’రాయితీ రుణాలకు ఎంపికైన అర్హులకు ఒకేసారి లబ్ధిని పంపిణీ చేయాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబర్ నుంచి మండల స్థాయిలో ‘పంపిణీ మేళా’లు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించి ఆ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2016–17 వార్షిక సంవత్సరంలో రాయితీ రుణాలకు ఎంపికైన 17,277 మందికి రూ.203.89 కోట్లను ఈ పంపిణీ మేళాల ద్వారా నేరుగా అందజేయనుంది.
వాస్తవానికి స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసిన తర్వాత బ్యాంకర్ తనిఖీ చేసి రాయితీ నిధులు విడుదల చేస్తారు. అయితే యూనిట్లు ఏర్పాటయ్యాక రాయితీ ఇవ్వకుంటే ఎలా అనే సందేహంతో లబ్ధిదారులు యూనిట్ల ఏర్పాటుకు సాహసం చేయడం లేదనే భావన ఉంది. దీన్ని అధిగమించేందుకుగాను పంపిణీ మేళాలకు కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. తాజా కార్యక్రమం ద్వారా రాయితీ చెక్కును ముందే లబ్ధిదారునికి ఇవ్వనున్నారు. యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత చెక్కును బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకుంటే సరిపోతుంది. చెక్కుల పంపిణీతో యూనిట్ల ఏర్పాటు వేగవంతమవుతుందని కార్పొరేషన్ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరాం భూక్యా అన్నారు.
డిసెంబర్ నెలంతా..
2016–17లో స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ఎంపికైన లబ్ధిదారులకు డిసెంబర్ మొదటివారం నుంచి చెక్కులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా పంపిణీ మేళా నిర్వహణ తేదీలు ఖరారు చేసుకోవాలి. మండల పరిషత్ అభివృద్ధి అధికారితో పాటు బ్యాంకు మేనేజర్, స్థానిక ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేసుకోవాలి. చెక్కుల పంపిణీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 17,277 మంది లబ్ధిదారులు నిర్దేశిత స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించేలా గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిçపల్ కమిషనర్లకు బాధ్యతలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఎస్సీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా మేళాలో అవగాహన కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment