సాగులో ఉన్న దళితులకు భూ హక్కు పత్రాల మంజూరులో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఇదే అదనుగా తీసుకుని బీజేపీ నేత ఆ భూములపై కన్నేశాడు. దళితులకు ఆ భూములు దక్కకుండా పన్నాగం చేస్తున్నాడు. భూములు ఆక్రమణకు గురయ్యాయంటూ పూజారి చేత పిటిషన్ వేయించి భూమి హక్కు పత్రాలు రాకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నాడు.
సాక్షి,కదిరి: తలుపుల మండలం వేపమానిపేట పంచాయతీ పరిధిలోని కొత్తపూలవాండ్లపల్లి, గంజివారిపల్లి గ్రామాలకు చెందిన 45 మంది దళితులు కొన్నేళ్లుగా అక్కడి ఓబులేశ్వర స్వామి మాన్యం భూములు సాగు చేసుకుంటున్నారు. సాగు చేసుకుంటున్న దళితులకే భూములు దక్కాలని గతంలో కదిరి ప్రాంతానికి చెందిన కొందరు వామపక్ష పార్టీల నాయకులు అప్పట్లో డిమాండ్ చేశారు. ఈ మేరకు సాగుదారులు కూడా అధికారులకు అర్జీల రూపంలో విన్నవించుకున్నారు. దేవదాయ భూమి కావడంతో అప్పట్లో ఉన్న జిల్లా ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చి ఎకరం రూ.15 వేలు చొప్పున సాగుదారులకు విక్రయించాలని నిర్ణయించారు.
గతంలోనే 80 శాతం సొమ్ము చెల్లింపు..
ఓబులేశ్వర స్వామి మాన్యం భూములు సర్వే నంబర్ 901లోని మొత్తం 88.45 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులోని 22.45 ఎకరాల భూమిని ఆ ఆలయ పూజారులకు ధూప, దీప నైవేద్యాల కోసం ప్రభుత్వం అప్పగించింది. మిగిలిన 66 ఎకరాల భూమిలో ఒక్క సెంటు భూమి కూడా లేని ఐదుగురు దళిత మహిళలకు 1.85 ఎకరాల చొప్పున, ఎకరం లోపు భూమి ఉన్న 20 మంది దళిత రైతులకు 1.80 ఎకరాలు చొప్పున, ఎకరం పైన–రెండెకరాల లోపు ఉన్న మరో 20 మంది దళితులకు ఎకరం చొప్పున లాటరీ పద్ధతిలో మొత్తం కేటాయించారు.
ఇందుకు గాను 1999 ఏప్రిల్ 19న దళితుల తరఫున ఎస్సీ కార్పొరేషన్ 80 శాతం అంటే రూ7.92 లక్షలను దేవదాయ శాఖకు డీడీ రూపంలో చెల్లించింది. మిగిలిన 20 శాతం అంటే రూ1.98 లక్షలు ఆ దళితుల పేరు మీద హక్కు పత్రాలు ఇచ్చిన వెంటనే చెల్లిస్తామని అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ భూములను దళితులే సాగు చేసుకుంటున్నారు. కానీ వాటిని దళితుల పేరు మీద మార్చడంలో అధికారులు విఫలమయ్యారు.
కోర్టును సైతం తప్పుదోవ పట్టించే యత్నం..
బీజేపీకి చెందిన ఓ నాయకుడు ఓబులేశ్వరస్వామి ఆలయ పూజారి ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. దేవాలయ భూములను కొందరు దళితులు కబ్జా చేశారని, వాటిని కాపాడాలని కోర్టును సైతం తప్పుదోవ పట్టించే విధంగా పిటిషన్‌లో పేర్కొన్నట్లు సాగుదారులు ఆరోపిస్తున్నారు. అందుకే తాము కూడా హైకోర్టును ఆశ్రయించి కోర్టుకు వాస్తవం తెలియజేసే విధంగా మరో పిటీషన్ దాఖలు చేశామని తెలిపారు. కొందరు అధికారులు సైతం తమను మోసం చేసేందుకు పూజారులతోనూ, బీజేపీ నాయకుడితోనూ కుమ్మక్కయారని ఆరోపించారు.
దళితులకు న్యాయం చేస్తాం
ఓబులేశ్వర స్వామి మాన్యం భూములు దళితులు సాగు చేసుకుంటున్న మాట వాస్తవం. వారికి భూ హక్కు పత్రాలు అందేలా చూ స్తాను. గత ప్రభుత్వం వారికి అన్యాయం చేసింది. వారికి న్యాయబద్ధంగా రావాల్సిన పంట నష్టపరిహారం కూడా అందేలా చూస్తాను.
– కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి
చదవండి: Tokyo Paralympics:టేబుల్ టెన్నిస్ ఫైనల్స్‌కు భవీనాబెన్
Comments
Please login to add a commentAdd a comment