ఇదెక్కడి న్యాయం!? | Targeted measures faction | Sakshi
Sakshi News home page

ఇదెక్కడి న్యాయం!?

Published Mon, Nov 10 2014 2:36 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

ఇదెక్కడి న్యాయం!? - Sakshi

ఇదెక్కడి న్యాయం!?

బొద్దాం(రాజాం రూరల్): అది రాజాం మండలంలోని బొద్దాం పంచాయతీ. టీడీపీకి చెందిన మడ్డు సాయమ్మ ఆ గ్రామ సర్పంచ్. వృద్ధురాలైన ఆమె పేరుకే సర్పంచ్. అధికారాన్ని ఆమె తనయుడు హరిబాబే వెలగబెడుతున్నాడు. పంచాయతీలో అంతా తానై వ్యవహరిస్తున్నాడు. అధికారులు సైతం ఆయన అదుపాజ్ఞల్లో ఉంటూ ‘జీ హుజూర్’ అంటున్నారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయన అక్కడితో ఆగకుండా అధికారపార్టీకి చెందిన వాడినన్న మదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపై కక్ష సాధింపు చర్యలు తెగబడుతున్నారు. వారు నివసిస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు సైతం తిరస్కరిస్తున్నారు.
 
 చీకట్లో 300 కుటుంబాలు
 ప్రధానంగా గ్రామంలోని ఎస్సీఎస్టీ కాలనీ ఈయనగారి వివక్షకు గురై కనీస సౌకర్యాలకు దూరమైంది. రెండు వార్డులుగా ఉన్న ఈ కాలనీలో సుమారు 300 కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులే. ఈ రెండు వార్డుల సభ్యులు కూడా ఆ పార్టీవారే. ఇదే కక్షతో ఈ కాలనీపై అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నారు. కాలనీలో నాలుగు నెలలుగా వీధి లైట్లు వెలగడం లేదు. మరమ్మతులు చేయాలని స్థానికులు అనేకమార్లు కోరినా ఫలితం లేకపోయింది. చివరికి కాలనీవాసులే బల్బులు, హోల్డర్లు సొంతంగా కొనుగోలు చేసుకొని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించారు. దానికి కూడా సర్పంచ్ తనయుడు మోకాలడ్డారు. కనెక్షన్ ఇవ్వవద్దని విద్యుత్ అధికారులను ఆదేశించడంతో వారు అలాగే చేశారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మైదానంలో సాయంత్రం వేళల్లో ఇక్కడి యువకులు, పిల్లలు ఆటలాడుకునేవారు. పోలీసులతో చెప్పించి ఆటలకు వీల్లేకుండా చేశారు. కాగా కాలనీలో తాగునీటి కుళాయిలు మరమ్మతులకు గురై నెలలు గడుస్తున్నా బాగు చేయించడంలేదు. ఇదేమిటని అడిగితే.. ‘నా ఇష్టం, మీరేమైనా మాకు ఓట్లేశారా, మీ పార్టీ వేరు.. మా పార్టీ వేరు, మీ పంచాయతీ మెంబర్లు ఇద్దరు మా పార్టీలో చేరితేనే మౌలిక సదుపాయాలు కల్పిస్తాం’ అని సర్పంచ తనయుడు హూంకరిస్తున్నారు.
 
 దండెత్తిన ప్రజలు
 ఇంతకాలం ఓపిగా ఈ వివక్షను సహించిన కాలనీవాసులు చివరికి విసిగిపోయి ఆదివారం ఉదయం ఆందోళనబాట పట్టారు. మొదట గ్రామంలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో దిగివచ్చిన ట్రాన్స్‌కో ఏఈ కుమార్ తక్షణమే కాలనీకి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం వారు రాజాం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంపీడీవో బి.వెంకటేశ్వరరావు బయటకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో పంచాయతీ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతటితో సంతృప్తి చెందని కాలనీవాసులు సీఐ అంబేద్కర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన సర్పంచ్ తనయుడు హరిబాబుతో మాట్లాడారు. మరోసారి ఇటువంటి ఫిర్యాదు వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమాల్లో వార్డు మెంబర్లు గండి కుమారి, కింజరాపు పార్వతి, అలజంగి లక్ష్మణరావు, నక్క ఉమామహేశ్వరరావు, ఉపసర్పంచ్ ఎన్ లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యుడు నక్క అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
 
 ఉపాధి పనులకు వెళ్లనివ్వడం లేదు
 మావన్నీ రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు. ప్రభుత్వం ఉపాధి పనులు కల్పించినా స్థానిక సర్పంచ్ తనయుడు అడ్డుకుంటున్నాడు. అధికారులు ఆయన మాటకే విలువిచ్చి పనులకు రానివ్వటం లేదు. కలెక్టర్ చెప్పినా పట్టించుకోవడం లేదు.
  - కింజరాపు గౌరమ్మ
 
 కుళాయిలు బాగు చేయటం లేదు
 కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఉన్న రెండు కుళాయిలు పనిచేయడం లేదు. అడిగితే మీరంతా వైఎస్సార్‌సీపీకి చెందిన వారు కాబట్టి మాకు నచ్చినప్పుడు చేస్తామని సర్పంచ్ ప్రతినిధి తెలిపారు. పంచాయతీ కార్యదర్శి కూడా పట్టించుకోవడం లేదు.
 - గండి పైడిరాజు
 
 వీధిలైట్లు లేక పడిపోయా...
 కాలనీలో నాలుగు నెలలుగా వీధిలైట్లు లేవు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇటీవల చీకట్లో నడుస్తూ కాలువలో పడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. సొంతంగా వీధిలైట్లు వేసుకుంటామన్నా ఒప్పుకోవటం లేదు.
 -దార శింకమ్మ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement