సాక్షి, హైదరాబాద్: దళిత పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఔత్సాహిక పాడి రైతులకు ‘మినీ డెయిరీ’ల ఏర్పాటుకు ఆర్థిక సహకారం ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రూ.4లక్షల వ్యయంతో ఒక్కో యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 3 జిల్లాల్లో ప్రయోగ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సాగుకు యోగ్యమైన భూమి ఉన్న చిన్న రైతులకు ఈ యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్ విలువలో 60% రాయితీ రూపంలో ఎస్సీ కార్పొరేషన్ ఇవ్వనుండగా.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణానికి అనుసంధానం చేస్తారు. బ్యాంకు ద్వారా రుణం ఇప్పించే బాధ్యత కూడా ఎస్సీ కార్పొరేషనే పర్యవేక్షిస్తుంది.
మినీ డెయిరీ యూనిట్లను సూర్యాపేట జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దాదాపు 830 మంది రైతులకు వివిధ దశల్లో రుణాలిచ్చి యూనిట్లు ఏర్పాటు చేయగా సత్పలితాలు వచ్చాయి. ఒక్కో రైతు ప్రతినెల కనిష్టంగా రూ.10వేలు సంపాదిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో మినీ డెయిరీ కార్యక్రమాన్ని మరో 5 జిల్లాలకు విస్తరింపజేయాలని తాజాగా ఎస్సీ కార్పొరేషన్ నిర్ణయించింది. కొత్తగా జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ గ్రామీణం, మహబుబాబాద్ జిల్లాల్లో అర్హులైన ఎస్సీ చిన్నకారు రైతులను గుర్తించి దశల వారీగా పథకాన్ని అమలు చేస్తారు.
కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
మినీ డెయిరీల కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కేవలం యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్‌తోనే కాకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. వారి ఆర్థిక స్థితిని అంచనా వేస్తుంది. ఆర్థికంగా నిలబడే వరకు సలహాలు సూచనలు చేస్తుంది. మినీ డెయిరీల నుంచి వచ్చే పాల సేకరణ బాధ్యతలను స్థానిక నిరుద్యోగ ఎస్సీ యువతకు అప్పగించనుంది. వీరికి ఆర్థిక సహకారం అందించనుంది. గ్రామంలో నిరుద్యోగ యువతతో బృందం ఏర్పడితే వారికి పాల ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుకు సైతం రాయితీ రుణాలు ఇచ్చేలా ఆ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి పంపించనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు సాక్షితో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment