నిబంధనలకు విరుద్ధంగా తెల్ల నెంబరు ప్లేటుతో మెప్మా పీడీ కార్యాలయంలో కొనసాగుతున్న అద్దె వాహనం
జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు గతంలో అద్దె కారు ఉండేది. అయితే, గతంలో పని చేసిన ఓ అధికారిణి అద్దె కారును పక్కన పెట్టి.. తన సొంత వాహనాన్ని ‘అద్దె’కు వినియోగించుకున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి తెల్ల నెంబరు ప్లేటు గల వాహనాన్ని కొన్ని నెలల పాటు నడిపించి నెలనెలా అద్దె డబ్బులను పర్సులో వేసుకున్నారు.
సాక్షి, ఇందూరు(నిజామాబాద్): జిల్లాలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అద్దె వాహనాల పేరుతో వేల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. సొంత వాహనాలనే వినియోగిస్తూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. చాలా ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకానికి అధికారులే తూట్లు పొడుస్తున్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి దొరక్కుండా పోతోంది. ప్రభుత్వ శాఖ ల్లో అధి‘కార్ల’ దందా కొనసాగుతున్నా అడిగే వారు లేరు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.
సర్కారు కార్యాలయాల్లో సంబంధిత శాఖకు సొంత కార్లు లేకపోతే అధికారుల పర్యటనలకు అద్దెకు తీసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అద్దె వాహనం తీసుకోవాలంటే చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఓనర్ కమ్ డ్రైవర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియారిటీ కలిగిన వారికి అవకాశం కల్పించాలి. పసుపు రంగు (ట్యాక్సీ) నెంబరు ప్లేట్ కలిగి ఉండడంతో పాటు వాహనం పూర్తి కండిషన్‌తో ఉండాలి. అగ్రిమెంట్ సమయంలో ఆయా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. నెలకు 2,500 కిలో మీటర్లు తిరిగితే ఇంధనం (పెట్రోల్/డీజిల్), కారు అద్దె, డ్రైవర్ బత్తా అన్నీ కలిపి గతంలో రూ.24 వేలు ఇచ్చే వారు. అయితే, ప్రభుత్వం దీనిని రూ.33 వేలకు పెంచింది. దీంతో అధికారుల కన్ను ‘అద్దె’పై పడింది. తెల్ల నెంబరు ప్లేటు ఉన్న తమ సొంత వాహనాలను అద్దెకు పెట్టి ‘ఆన్ గోవ్ట్ డ్యూటీ’ అని రాయించుకుని మరీ యథేచ్ఛగా తిప్పుతున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు కలిపి సుమారు 40 మంది అధికారులు తమ సొంత వాహనాలను వినియోగిస్తూ నెలకు రూ.13 లక్షల వరకూ ‘అద్దె’ వసూలు చేస్తున్నారు!
తిరగకున్నా..
సొంత వాహనం లేదా బినామీ పేర్లతో బంధువుల వాహనాలను ప్రభుత్వ శాఖల్లో అద్దెకు వినియోగిస్తున్న అధికారులు.. ఇతర వాహనాల విషయంలో మాత్రం నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారు. నిరుద్యోగులు తమ వాహనాన్ని అద్దెకు పెడితే నిబంధనల పేరుతో మెలికలు పెడుతూ సతాయిస్తున్నారు. బిల్లులు ఆలస్యంగా ఇస్తున్నారు. అయితే, వేతనానికి కారు అద్దె తోడవుతుందనే ఆశతో అధికారులు సొంత వాహనాలు, బంధువుల పేరిట కలిగినవి ఉపయోగిస్తున్నారు. నెలకు 2,500 కిలో మీటర్లు తిరగకున్నా, తిరిగినట్లు రీడింగ్ చూపి నెలనెలా అద్దెను కాజేస్తున్నారు.
⇔ పై చిత్రంలో కనిపిస్తున్న స్విఫ్ట్ కారు జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో అద్దెకు నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దె వాహనం జిల్లా/రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలాగే, తెల్ల నెంబరు ప్లేటు కాకుండా పసుపు రంగు (ట్యాక్సీ) ప్లేటు ఉండాలి. కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన తెల్ల నెంబరు ప్లేటుతో ఏడు నెలలుగా ఆ శాఖ అధికారులు ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఢిల్లీ నెంబరు ప్లేటు ఉండడంతో అద్దె బిల్లులు చేయడానికి వీలు కావడం లేదు. అయితే, పాత కారు పేరిట బిల్లులు కూడా లేపేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
‘కామారెడ్డి’లో కూడా..
అధికారులు తమ సొంత వాహనాలను వినియోగిస్తున్నారని తెలుసుకున్న కామారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. సొంత వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించవద్దని గత కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, అందుకు ప్రభుత్వ శాఖల్లో ట్యాక్సీ ప్లేటు గల వాహనాలను వినియోగించాలని సూచించారు. కానీ చాలా మంది అధికారులు సొంత వాహనాలే వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment