సిండికేటు గాళ్లు..! | Syndicate Bank irregularities In Nizamabad | Sakshi
Sakshi News home page

సిండికేటు గాళ్లు..!

Published Tue, Aug 20 2019 10:34 AM | Last Updated on Tue, Aug 20 2019 10:34 AM

Syndicate Bank irregularities In Nizamabad - Sakshi

బ్యాంకు వద్ద ఆందోళన చేస్తున్న బాధితులు, ప్రజాప్రతినిధులు

సాక్షి, నిజామాబాద్‌ : ఎడపల్లి మండల కేంద్రంలోని సిండికేట్‌బ్యాంకులో అధికారులు, సిబ్బంది కలిసి పంట రుణాల పేరుతో ఏకంగా రూ. 2.5 కోట్లు మేరకు లూటీ చేశారు. బోగస్‌ పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించి, నిరక్షరాస్యులైన ఖాతాదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పంట రుణాల పేరుతో దండుకున్నారు. ఈ క్రమంలో పహాణీలు, వన్‌బిలును కూడా ఆన్‌లైన్‌లో జిమ్మిక్కులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున జరిగిన కుంభకోణం ఆలస్యంగా వెలుగు చూడడంతో బ్యాంకు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్న సిండికేట్‌ బ్యాంకు పరిధిలో ఎడపల్లితో పాటు, అంబం, యర్తి, బ్రాహ్మణపల్లి, వడ్డేపల్లి, ఎంఎస్సీ ఫారం, జైతాపూర్, జంలం తదితర గ్రామాలున్నాయి.

ఆయా గ్రామాల్లోని నిరక్షరాస్యులు, అమాయకులను మభ్యపెట్టి వారి పేర్లతో ఈ బ్యాంకులో ఖాతాలను తెరిచారు. వీరికి భూములు ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. ఆన్‌లైన్‌లో ఉండే పట్టాదారుపాసుపుస్తకాలు, వన్‌బీ, పహాణీల విషయంలోనూ జిమ్మిక్కులకు పాల్పడ్డారు. వారి పేరున పంట రుణం మంజూరు చేసి, ఆ మొత్తాన్ని దండుకున్నారు. ఇలా 64 మంది అమాయక రైతుల పేర్లు ఇప్పటివరకు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. 64 మంది పేర సుమారు రూ. 2.5 కోట్లకు మించి లూటీ చేసినట్లు భావిస్తున్నారు. ఖాతాలు తెరిచిన వారికి నామమాత్రం కొంత మొత్తాన్ని ముట్టజెప్పారు.

వెలుగు చూసిందిలా..
బోగస్‌ పంట రుణం పొందిన ఓ మహిళ గ్రామంలో ఉన్న స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. ఈ సంఘానికి రుణం మంజూరు కావడం లేదు. ఎందుకని బ్యాంకులో సంఘం సభ్యులు ఆరా తీస్తే.. సదరు సభ్యురాలి పేరిట పంట రుణం బకాయిలున్నాయని, అందుకే సంఘానికి రుణం మంజూరు చేయడం కుదరదని అధికారులు తేల్చి చెప్పారు. గుంట భూమి కూడా లేని, రేకుల ఇంటిలో నివాసముంటున్న ఆ మహిళకు మూడున్నర ఎకరాల భూమే లేదని సంఘంలోని మిగతా సభ్యులు బ్యాంకు అధికారులకు చెప్పారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఆందోళనలో బాధితులు..
తమ పేర్లతో రూ. లక్షల్లో పంట రుణాలు తీసుకున్నట్లు తేలడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమకు రూ. పది, రూ. 20 వేలు ఇచ్చి మిగతా మొత్తాన్ని వాళ్లే దండుకున్నారని కొందరు బాధితులు చెబుతున్నట్లు సమాచారం. తమ పేర్లతో జారీ అయిన రూ. లక్షల్లో రుణాలను మేము ఎక్కడి నుంచి తెచ్చి చెల్లించేదని ప్రశ్నిస్తున్నారు.

అధికారులు ‘సిండికేట్‌’ ?
బ్యాంకు ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల బదిలీపై వెళ్లిన బ్యాంకు మేనేజర్, ఫీల్డ్‌అసిస్టెంట్లే కుంభకోణంలో కీలక సూత్రదారులనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో కొందరు దళారులను నియమించుకుని దందాకు పాల్పడినట్లు తెలుస్తోంది. కుంభకోణం వెలుగు చూడడంతోనే అధికారులను ఇక్కడి నుంచి బదిలీ చేసినట్లు సమాచారం. ఈ బదిలీల తర్వాత కూడా అక్రమాలు చోటు చేసుకోవడం గమనార్హం.

ఉన్నతాధికారుల అంతర్గత విచారణ
రుణాల పేరుతో రూ. కోట్లలో కుంభకోణంపై ఆ బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టా రు. గత రెండు, మూడేళ్లుగా ఎవరెవరికి రుణా లు మంజూరు చేశారు.. వారికి సంబంధించిన డాక్యుమెంట్లు సరైనవేనా.. వంటి అంశాలపై రికార్డులను పరిశీలించారు. ఈవిషయమై ‘సాక్షి’ ప్రతినిధి బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ రేణుకను ఫోన్లో సంప్రదించగా విచారణ జరుగుతోందని తెలిపారు. పంట రుణాల మంజూరులో ప్రొసీజర్‌ ల్యాప్సెస్‌ ఉన్నట్లు గుర్తించామని, బ్యాం కు ప్రధాన కార్యాలయానికి నివేదిక ఇచ్చామన్నారు. ఎంత మొత్తంలో అవకతవకలు జరిగా యనే అంశంపై ఆమె సమాధానం దాటవేశారు. 

రైతులు, ప్రజాప్రతినిధుల ఆందోళన
ఎడపల్లి(బోధన్‌): ఎడపల్లిలోని సిండికేట్‌ బ్యాంకు వద్ద సోమవారం పలువురు ఖాతా దారులు, ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బినామీ వ్యక్తుల పేర్ల మీద దాదాపు రూ. 2 కోట్ల రుణాలు మంజూరు చేశారని ఆరోపించారు. గతంలో పనిచేసిన బ్యాంక్‌ మేనేజర్‌ ఎం.శ్రీనివాస్, ఫీల్డ్‌ ఆఫీసర్‌ దిలీప్‌లు ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకులో గతంలో పనిచేసిన మేనేజర్, ఫీల్డ్‌ ఆఫీసర్‌లు, మండల కేంద్రంలోని మీసేవలో పనిచేసే ఒడ్డేపల్లికి చెందిన ఒక వ్యక్తి ముగ్గురు కలిసి ఈ కుంభకోనానికి పాల్పడినట్లు వారు ఆరోపించారు. మీసేవలో పనిచేసే వ్యక్తి నకిలీ భూ పహాణీలు సృష్టించగా వాటిసహాయంతో బ్యాంకు మేనేజర్, ఫీల్డ్‌ ఆఫీసర్లు లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసి, బినామీ వ్యక్తుల పేర కాజేశారని వాపోయారు.

సోమవారం ప్రస్తుతం బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న బ్రాంచ్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ను జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ రజిత, ఎంపీపీ కోడెంగల శ్రీనివాస్, ఎడపల్లి మాజీ సర్పంచ్‌ ఎల్లయ్యయాదవ్, టీఆర్‌ఎస్‌ మైనారిటీ విభాగం జిల్లా కార్యదర్శులు అబ్దుల్‌ వాహెబ్‌బారీ, ఎస్సై రామునాయుడు, మల్కారెడ్డిలతో పాలు పలువురు రైతులు, ప్రశ్నించగా బినామీ పేర్లమీద రుణాలు మంజూరైన మాట వాస్తవమేనని తెలిపారు. ఈ విషయమై గతంలో విచారణ చేపట్టారని ఈ సందర్భంగా గతంలో పనిచేసిన బ్రాంచ్‌ మేనేజర్‌ మట్ట శ్రీనివాస్, పీల్డ్‌ ఆఫీసర్‌ దిలీప్‌లను ఇక్కడి నుంచి బదిలీచేసినట్లు ఆయన వివరించారు. ఎంత మేర నిధులు దుర్వినియోగమైన విషయం తనకు తెలియదన్నారు.

సబ్సిడీ విషయం నాకు చెప్పలేదు
నేను మైనారిటీ కార్పొరేషన్‌ లోన్‌ తీసుకుంటే నాకు రూ. 50 వేల సబ్సిడీ వచ్చింది. గతంలో పనిచేసిన బ్యాంకు మేనేజర్‌ నాకు ఇచ్చిన లక్ష రూపాయల రుణానికి ఏడాదిగా వడ్డీ కట్టించుకున్నాడు. సబ్సిడీ వచ్చిన విషయాన్ని నాకు చెప్పకుండా నాతో వడ్డీ కట్టించుకొని నాకు నష్టం చేశాడు.
– ఆసీస్, ఏఆర్‌పీ, క్యాంపు

పాత లోన్‌ చెల్లించమంటున్నారు
మా గ్రూప్‌ సభ్యురాలి పేరుమీద గతంలో పనిచేసిన బ్యాంకు మేనేజర్‌ లక్షా 92 వేల రూపాయల వ్యవసాయ రుణం మంజూరైంది. ఆమెకు వ్యవసాయ భూమి లేకపోయినా రుణం మంజూరైనట్లు బ్యాంకులో ఉంది. ప్రస్తుతం మా గ్రూప్‌కు రుణం ఇవ్వాలని బ్యాంకు వెళ్తే విజయ అనే మహిళ రుణం తీసుకుందని, అది చెల్లిస్తేనే మిగతా వారికి రుణం మంజూరు చేస్తామని చెబుతున్నారు.
– లత, భవాని గ్రూప్‌ సభ్యులు, ఏఆర్పీ క్యాంప్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement