
చంద్రబాబూ.. ఇదేనా సామాజిక న్యాయం?
ఎంఈఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బండారు శంకర్
అనంతపురం న్యూటౌన్ : రాష్ట్రంలోని దళితుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు చైర్మన్లగా మాల మహానాడుకు చెందిన జూపూడి ప్రభాకర రావు, కారెం శివాజీలను ఏకపక్షంగా నియమించడం పట్ల మాదిగ ఉద్యోగుల సమాఖ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రికి రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంఈఎఫ్ (మాదిగ ఉద్యోగుల సమాఖ్య) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతోందని, టీడీపీలో ఒక్క కులానికే ప్రాధాన్యతినిస్తూ మాదిగలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన జూపూడి వంటి వారికి పదువులివ్వడమే కాకుండా, ఎన్నికలల్లో సహకరించిన మాదిగలను జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు. కావాలని ఎవరిని రెచ్చగొట్టడం మంచిపద్దతి కాదని సూచించారు. ఇప్పటికైనా మాదిగల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్ నాయకులు గంగాధర్, అమరనాథ్, గిరి, గోవిందు, ప్రభాకర్ పాల్గొన్నారు.