ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
సాక్షి, హైదరాబాద్: దళితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నాయ ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యం కల్పించిన హక్కులను పొందకుండా చేస్తున్నాయ ని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణతోనే దళితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీజేయూ ఆధ్వ ర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ‘ఉమ్మడి రిజర్వేషన్ల విధానం విఫలమైంది. దళితుల్లో అభివృద్ధి చెందిన కులాలే రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్నాయి.
అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ చేయాలి. పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. అందులో భాగంగా ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణ చేశారు. అదే క్రమంలో ఎస్సీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకోమంటే కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోంది. అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కానీ ప్రశ్నించే హక్కును ప్రభుత్వం హరిస్తోంది. నిలదీసే వ్యక్తిని అక్రమంగా జైల్లో పెడుతోంది. నన్ను ఒకే నెలలో రెండుసార్లు అరెస్టు చేశారు. నేను చేసిన నేరమేంటో ప్రభుత్వం చెప్పాలి’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దళితుడిని కావడంతోనే జైల్లో పెట్టారు..
తెలంగాణ ఉద్యమంలో భాగంగా ‘మిలియన్ మార్చ్’ జరిగిన సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కోదండరాంలపై పదుల సంఖ్యలో కేసులు నమోదైనప్పటికీ ఒక్కరినీ జైల్లో పెట్టలేదని మంద కృష్ణ అన్నారు. కానీ తాను దళితుడు కావడంతో నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టారన్నారు. ‘సుప్రీం కొలీజియం తీరును జస్టిస్ కర్ణన్ తప్పుబడితే ఆయనను జైల్లో పెట్టాలని ఓ జడ్జి తీర్పునిచ్చారు. కానీ అదే కొలీజియం తప్పులు చేస్తోందని, పక్షపాతంగా వ్యవహరిస్తోందని సుప్రీం జడ్జీలు గొంతెత్తి మీడియా ముందుకొచ్చారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వారితో సంప్రదింపులు చేస్తోంది.
ఒక దళితుడు ప్రశ్నిస్తే నేరం... అగ్రవర్ణాలు, సంపన్నులు ప్రశ్నిస్తే సంప్రదింపులు చేస్తారా’ అంటూ మండిపడ్డారు. దళితులపై అణచివేతకు ఇంతకంటే పెద్ద ఉదంతం అవసరం లేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, పరుష పదజాలం వాడితే కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా అరెస్టు చేయాలని నిర్ణయించడం దారుణమని అన్నారు. తాము అధికారంలోకి వస్తే వందరోజుల్లో వర్గీకరణ చేస్తామని బీజేపీ చెప్పిందని.., మరి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఇంకా వందరోజులు కాలేదా? అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక బృందాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాలని అన్నారు. వర్గీకరణపై సోమవారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment