భారతి మృతదేహానికి నివాళులర్పిస్తున్న మందకృష్ణ మాదిగ, అంజన్‌కుమార్ యాదవ్
హైదరాబాద్: ఎమ్మార్పీస్ నాయకురాలు భారతి మృతికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ సోమవారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిలో నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన తోపులాటలో మృతి చెందిన భారతి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భారతి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు మంగళవారం ఎమ్మార్పీఎస్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు ఉస్మానియా ఆస్పత్రికి తరలివచ్చారు. భారతక్కా అమర్ రహే అంటూ నినాదాలతో ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ ప్రాంగణం మార్మోగింది. ఉస్మానియా ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని ఊరేగింపుగా ఆమె నివాసానికి తీసుకొచ్చారు.
పలువురి నివాళి
పలు ప్రజా సంఘాలు నాయకులు, ప్రజాగాయకుడు గద్దర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, నరేందర్ యాదవ్, ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ, రాగడి సత్యం, తిప్పారపు లక్ష్మణ్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ మహిళ సమాఖ్య, ఎంజేఎఫ్‌తో పాటు ఎమ్మార్పీఎస్ వివిధ విభాగాల నాయకులు భారతికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ..వర్గీకరణ ఆలస్యం చేయడం వల్లే మాదిగల ప్రాణాలు పోతున్నాయని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. జాతి కోసం ప్రాణాలర్పించిన భారతి త్యాగం వృథా కాకుండా పోరాడతామన్నారు.
కేంద్రాన్ని ఒప్పించాలి
అసెంబ్లీ నడుస్తుండటంతో తాము హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపినిచ్చామని మందకృష్ణ చెప్పారు. ఏపీలో ఈ నెల 10 నుంచి జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వర్గీకరణ ఉద్యమాన్ని నిర్వీ ర్యం చేసేందుకు 3 ఏళ్లుగా సీఎం కేసీఆర్ ఎన్నోకుట్రలు చేశారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి వర్గీకరణపై మోదీని ఒప్పించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు కేంద్రం ఒప్పుకోకపోతే టీ ఆర్‌ఎస్‌తోపాటు వివిధ పార్టీలన్నీ వర్గీకరణ ఉద్యమానికి కలసి రావాలని కోరారు. వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎడబెల్లి యాదయ్య, మహేందర్, అరుణ్ మాదిగ, సీమాశంకర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment