'బ్రహ్మదేవుడు అడ్డుపడ్డాడా.. కేసీఆర్ కరుణించాడా'
విజయవాడ: 'ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్.. 'పట్టపగలు దొరికిన దొంగ చంద్రబాబు, ఆయనను జైలుకు వెళ్లకుండా బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు' అని అన్నారు. అంతకుముందు ఇదే విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ 'నేను జైలుకెళ్లిన తెల్లారే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది' అని హెచ్చరించారు. ఇప్పుడేమో వ్యక్తిగత స్వార్థం కోసం ఇద్దరూ కలిసిపోయారు' అంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై విమర్శలు గుప్పించారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.
విజయవాడ హనుమాన్‌పేటలోని శ్రీరామ్ హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణ మాట్లాడారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులో స్వతంత్ర విచారణ జరిగితే ఇద్దరు సీఎంలూ ఒకరి తర్వాత మరొకరు జైలుకెళ్లాల్సిన వారేనని, సీఎం చంద్రబాబు జైలుకెళ్లకుండా ‘బ్రహ్మదేవుడు అడ్డుపడ్డాడా.. కేసీఆర్ కరుణించాడా?’ అని ప్రశ్నించారు. కేసుల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం సూటిగా హెచ్చరికలు చేసిన నేపథ్యంలోనే రాజీపడుతున్నారని, పదవులు పోకుండా కాపాడుకోవడంతోపాటు జైలుకు వెళ్లకుండా ఉండేదుకే ఒకరినొకరు శంకుస్థాపనలు, యాగాలకు ఆహ్వానించుకుంటున్నారని, వీరి కలయిక వెనుక రాష్ట్రాల ప్రయోజనాలకంటే వ్యక్తిగత స్వార్థమే దాగుందని మంద కృష్ణ విమర్శించారు.
ఇక తాడోపేడో..
మాదిగల సహకారంతోనే ముఖ్యమంత్రులైన కేసీఆర్, చంద్రబాబులు ఇప్పుడు ఎమ్మార్పీఎస్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా చంద్రబాబు, అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకునేందుకు ఎమ్మార్పీఎస్ సిద్ధమవుతోందని, ఈనెల 17న ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లను, 18న ఆర్డీవో, 19న ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని మంద కృష్ణ మాదిగ తెలిపారు. అప్పటికీ తీర్మానం చేయకపోతే ఈనెల 21న విజయవాడలో ఒకరోజు దీక్ష చేపడతామన్నారు.