సబ్‌ప్లాన్‌పై నీలినీడలు
అట్టహాసంగా చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది అమలులోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా.. ఇప్పటి వరకు ఎటువంటి నియమ, నిబంధనలు రూపొందించలేదు. సాధారణ నిధులు రూపాయి కూడా విడుదల చేయలేదు. సబ్‌ప్లాన్ నిధులు వస్తాయని భావించిన వివిధ ప్రభుత్వ శాఖలు ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించలేదు. ఫలితంగా జిల్లాలో ఆయా ఆవాసాల్లో మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఈ చట్టాన్ని ఏ విధంగా అమలు చేస్తుందోనన్న అనుమానాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం గత ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ను రూపొందించిం ది. సరైన విధి విధానాలు లేకుండానే గతేడాది జనవరి 24న ఈ చట్టానికి ఆమోద ముద్ర వేసింది. రూ. కోట్లు ఖర్చు పెట్టి జిల్లాలో దీనిపై ప్రచారం చేసింది. ఈ చట్టం వచ్చి సుమారు 16 నెలలు కావస్తోంది. రాష్ట్ర స్థాయిలో 26 శాఖలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు కాగితాల్లో ప్రకటించిన ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఇప్పటికీ పైసా విదల్చలేదు.
సోషల్ వె ల్ఫేర్‌కు రూ.2170.28 కోట్లు, గ్రామీణాభివద్ధికి రూ.వెయ్యి కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.1050 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌కు రూ.600 కోట్లు, హౌసింగ్‌కు రూ.600 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.350 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.200 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.100 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూ.453 కోట్లు, ఫ్యామిలీ వెల్ఫేర్‌కు రూ.311 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి రూ.198 కోట్లు, విద్యుత్‌కు రూ.100 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.210 కోట్లు, ప్లానింగ్‌కు రూ.120 కోట్లు ఇలా 26 శాఖలకు మొత్తంగా 7927.45 కోట్లు మంజూరు చేసింది.
సబ్‌ప్లాన్ వచ్చిన 9 నెలలు తరువాత చట్టం అమలు, నిధుల కేటాయింపులు, వాటిని ఏ విధంగా ఖర్చు చేయాలి వంటి విషయాల పర్యవేక్షణకు నవంబర్‌లో జిల్లా స్థాయి మోనిటరింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా ఐటీడీఏ పీవో, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను సభ్యులుగా చేర్చింది. చట్టం అమలుకు సంబంధించిన విధి విధానాలను ఇప్పటికీ పూర్తి స్థాయిలో రూపొందించలేదు.
సౌకర్యాలు కొరవడిన ఎస్సీ, ఎస్టీ ఆవాసాలు
జిల్లాలో దాదాపుగా 175 ఎస్సీ, 3696 ఎస్టీ గ్రామాలు ఉన్నాయి. వీటిలో 693 కాలనీలకు రోడ్డు సదుపాయం లేదు. 390 ఆవాసాలు విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్నాయి. ఏజెన్సీలో 245 ఎస్టీ కాలనీలకు డ్రైనేజీ సదుపాయం లేక అధ్వానంగా ఉన్నాయి. 47 గ్రామాలకు తాగు నీటి సదుపాయం లేదు. ఇలా అనేక ఎస్సీ, ఎస్టీ హేబిటేషన్లు సదుపాయాలకు దూరంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సబ్‌ప్లాన్ ద్వారా నిధుల కేటాయిం పులు జరిగితే ఈ గ్రామాలు అభివద్ధికి నోచుకుంటాయని ఎ స్సీ, ఎస్టీలు సంబరపడ్డారు.
కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ని ధులు కేటాయించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, పనులు ఒక్కటి కూడా ముం దుకు సాగలేదు. చట్టం రాకముందు సాధారణ నిధులలో కొం తైనా వీరి సంక్షేమానికి వినియోగించేవారు. ఈ సబ్‌ప్లాన్ అమలులోకి వచ్చిన తరువాత దీని కింద కేటాయింపులు జరగకపోవడం, సాధారణ నిధులను వీరి అభివద్ధికి వినియోగించకపోవడంతో ఎస్సీ, ఎస్టీల పరిస్థితి దయనీయంగా మారింది.