- 40 శాతం ఎస్సీ, ఎస్టీ జనాభా ఉండాలనే నిబంధన ఫలితం
- రద్దయిన రూ.30లక్షల రహదారుల పనులు
- లబోదిబోమంటున్న ఆరు పంచాయతీలు
- డీలాపడుతున్న సర్పంచులు
కూచిపూడి : గ్రామాల్లో 40 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీలుంటేనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వినియోగించాలంటూ ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆంక్షలపై పలువురు సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్లాను కింద విడుదల చేసిన నిధులను... 40 శాతం మంది ఆయా సామాజిక వర్గాలు లేరనే సాకుతో రద్దు చేయడం దారుణమని సంబంధిత సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా మండలంలోని 9గ్రామాలకు సిమెంటు రహదారుల కోసం రూ.45లక్షలు (ఒక్కక్క పంచాయతీకి రూ.5లక్షల చొప్పున) కేటాయించారు.
తాజాగా ఇంజినీరింగ్ అధికారులు జారీచేసిన ఉత్తర్వుల (మౌఖికం)తో మండలంలోని కూచిపూడి, పెదపూడి, పాలంకిపాడు, మొవ్వపాలెం, అవురుపూడి, యద్ధనపూడి గ్రామాలకు రూ.5లక్షల చొప్పున మంజూరయిన రూ.30లక్షలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని పంచాయతీ రాజ్ ఏఈ పీ చంద్రశేఖర్ ఆయా పంచాయతీలకు వెల్లడించటంతో వారందరూ హతాశులయ్యారు.
ఈ నిధులతో రహదారులు వేయించేందుకు పంచాయతీ తీర్మానాలు చేసి సభల ఆమోదం పొంది అంచనాలు వేయించారు. ఆఖరి నిముషంలో ఈ కబురు అందడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే విషయాన్ని మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన జెడ్పీడెప్యూటీ సీఈవో ఎం కృష్ణమోమన్ దృష్టికి ఆయా సర్పంచుల తరపున మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఏనుగుమోహనరావు తెలిపినా ఫలితం లేకుండాపోయింది.
ప్రభుత్వ నిబంధనల మేరకు విధులు నిర్వహించడం మినహా తామేమీ చేయలేమని చేసినట్లు తెలిసింది. అయితే బార్లపూడి, కొండవరం, గూడపాడు గ్రామాలలో నిబంధనల ప్రకారం 40 శాతంపైగా దళితులుండటంతో ఆ పంచాయతీలకు మంజూరయిన నిధులతో సీసీ రోడ్లు వేసే అవకాశముందని పీఆర్ ఏఈ స్పష్టం చేశారు. రద్దయిన ఆ ఆరింటి స్థానంలో ప్రస్తుతం మొవ్వ, భట్లపెనుమర్రు, చినముత్తేవి, పెదముత్తేవి గ్రామాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ రోడ్లువేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రద్దయిన తమ గ్రామ రహదారుల నిధులను పునరుద్ధరించి చేయూత ఇవ్వాలని సర్పంచులు కందుల జయరాం (కూచిపూడి), తాతా రజని (పెదపూడి), యద్ధనపూడి రాఘశేఖర్ (యద్ధనపూడి), ఏనుగు మోహనరావు (అవురుపూడి), యార్లగడ్డ సునీత (పాలంకిపాడు), ఊసా సుబ్బమ్మ (మొవ్వపాలెం) కోరుతున్నారు.