నూజివీడు, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే పనులను మార్చిలోగా పూర్తిచేయాలని రాజమండ్రి మున్సిపల్ ప్రాంతీయ సంచాలకులు(ఆర్డీ) సొంగా రవీంద్రబాబు పేర్కొన్నారు. నూజివీడు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన మున్సిపాలిటీల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలకు మంజూరైన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ ఏరియాల్లోనే ఖర్చుచేయాలన్నారు.
నిబంధనలను ఏమాత్రం అతిక్రమించినా చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. ఒక ఏరియాలో 40శాతం తక్కువ కాకుండా ఎస్సీ, ఎస్టీలుంటేనే ఆ ప్రాంతంలో ఈ నిధులను ఖర్చుచేయాలన్నారు. అంతేగానీ నాలుగైదు గృహాలను చూపించి సబ్‌ప్లాన్ నిధులు ఖర్చుచేయడానికి వీలులేదని తెలిపారు. జిల్లాలో ఆస్తిపన్ను వసూలులో మచిలీపట్నం మున్సిపాలిటీ వెనుకబడి ఉందని, పన్ను వసూలును ముమ్మరం చేయాలని సూచించారు.అలాగే మున్సిపాలిటీల్లో అమలుచేస్తున్న ‘చెత్తపై కొత్త సమరం’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.
పారిశుధ్య కార్మికులు ఇంటింటి కీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారా, లేదా అని కమిషనర్లు పరిశీలించాలని సూచించారు. తడిచెత్తను, పొడిచెత్తను వేరువేరుగా ఉంచేలా ప్రజలను చైతన్యం చేయాలని చెప్పారు. అడ్వాన్సులింకా పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలు వాటి వసూలుపై దృష్టి సారించి బకాయిలు లేకుండా చూడాలని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ. 2.40కోట్ల ఆస్తిపన్ను బకాయిలున్నాయన్నారు. వీటిలో గతేడాది బకాయి రూ.1.40కోట్లు కాగా, ఈ ఏడాది బకాయి రూ.1కోటి ఉందన్నారు.
అలాగే బడ్జెట్ తయారీ, అప్రూవల్ విషయంలో మున్సిపల్ కమిషనర్లు నిర్లక్ష్యంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో తిరువూరు మున్సిపాలిటీ మినహా, మరే మున్సిపాలిటీ ఇంతవరకు బడ్జెట్‌ను స్పెషల్‌ఆఫీసర్‌తో అప్రూవల్ ఎందుకు చేయించలేదని నిలదీశారు. 15వతేదీకల్లా బడ్జెట్ అప్రూవల్‌ను పూర్తిచేయాలన్నారు. అలాగే కోర్టు కేసులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని, ముఖ్యమైన కోర్టుకేసుల విషయమై ప్రతి శుక్రవారం ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. నూజివీడు, తిరువూరు, నందిగామ, ఉయ్యూరు, గుడివాడ, పెడన, జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
మార్చిలోగా సబ్‌ప్లాన్ పనులు : ఆర్డీ
Published Thu, Jan 9 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement