టీడీపీ పాలన అవినీతిమయం | TDP Governance In The Municipality Is Corrupt | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీకి బొక్కేశారు!

Published Tue, Jul 2 2019 10:05 AM | Last Updated on Tue, Jul 2 2019 10:24 AM

TDP Governance In The Municipality Is Corrupt - Sakshi

సూళ్లూరుపేట మున్సిపల్‌ కార్యాలయం

సాక్షి, సూళ్లూరుపేట: గడిచిన ఐదేళ్లలో సూళ్లూరుపేట మున్సిపాలిటీ పాలన అవినీతిమయంగా మారింది. టీడీపీ పాలకవర్గం దెబ్బకు ఎనిమిది మంది కమిషనర్లు మారారు. అవినీతి కారణంగా వచ్చిన కమిషనర్లు వచ్చినట్టే వెళ్లిపోయారు. మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 11 వార్డులు, టీడీపీ 8 వార్డులు, కాంగ్రెస్‌  3 వార్డులు, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డును గెలుచుకున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు.

ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి చక్రం తిప్పి స్వతంత్ర అభ్యర్థిని తీసుకోవడంతో టీడీపీ కౌన్సిలర్‌ నూలేటి విజయలక్ష్మి చైర్‌పర్సన్‌గా, గరిక ఈశ్వరమ్మ వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు.  అనంతరం ఒకటో వార్డు, 17వ వార్డులకు చెందిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను చేర్చుకుని మరింత బలపడ్డారు. దీంతో కౌన్సిల్‌ సమావేశాలు దాదాపుగా రచ్చ..రచ్చగానే సాగాయి. మున్సిపాలిటీ అభివృద్ధిని పక్కనబెట్టి మంజూరైన నిధులను వచ్చినవి వచ్చినట్టుగా స్వాహా చేయడం ఎక్కువైపోయింది. పాలకవర్గానికి ఎదురు చెప్పే కమిషనర్‌లను ఇంటికి సాగనంపడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఓ కమిషనర్‌పై ఏకంగా అతని ఛాంబర్‌లోనే దాడికి పాల్పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

సూళ్లూరుపేట మేజర్‌ పంచాయతీ నుంచి గ్రేడ్‌–3 మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ఏడాదికి సుమారు రూ.5 నుంచి రూ.7కోట్ల వార్షికాదాయం కలిగిఉంది. టీడీపీ పాలకవర్గం పన్నులు విపరీతంగా పెంచేసి ప్రజలపై భారం మోపింది. పన్నుల వసూళ్లలోనూ చేతివాటం చూపారు. పాలకవర్గానికి అనుకూలంగా ఉన్న వారికి, అధికార టీడీపీ వారికి భారీగా తగ్గించి కమిషన్లు దండుకున్న సంఘటనలు ఉన్నాయి. 

కనిపించని అభివృద్ధి 
గడిచిన ఐదేళ్ల కాలంలో మున్సిపల్‌ మంత్రిగా ఉన్న నారాయణ కోట్లకు కోట్లు మంజూరు చేసినా అభివృద్ధి మాత్రం కనిపించలేదు. షార్‌ నిధులతో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను పాలకపక్షం తన ఖాతాలో వేసుకుంది. ఆర్థిక సంఘం, సబ్‌ప్లాన్‌ నిధులతో నిర్మించిన సిమెంట్‌రోడ్లు, మురుగునీటి కాలువల పనుల్లోనూ నాణ్యత లోపించింది. ఈ నిధుల్లోనూ కొంత భాగం పనులు చేయక వెనక్కి వెళ్లిపోయాయి.
 
సాధారణ నిధులు భారీగా స్వాహా 
మున్సిపాలిటీకి ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సాధారణ నిధులతో పాలకపక్షం నామమాత్రంగా పనులు చేపట్టి  కోట్లాది రూపాయల స్వాహా చేసింది. మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత సుమారు 10 మంది కమిషనర్లు మారగా మూడుసార్లు ఇన్‌చార్జి కమిషనర్లు పనిచేశారు. యాదగిరి శ్రీనివాసరావు కమిషనర్‌గా ఉన్న సమయంలో రూ.11 లక్షలు స్వాహా చేసిన మేనేజర్‌ సలోమిని సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకొన్నారు. ఆ నిధులు ఎవరు స్వాహా చేశారనే విషయం తేల్చకుండానే ఫైల్‌ మూసేశారు. సాధారణ నిధులను అత్యవసర సమయాల్లో మాత్రమే వినియోగించాల్సి ఉంగా నరేంద్రనాథ్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలో సాధారణ నిధులను ఇష్టానుసారంగా వాడేసుకుని స్వాహా చేశారని టీడీపీ పక్ష సభ్యులే అరోపిస్తుండడం విశేషం.

ఏడాదికి మున్సిపాలిటీకి సుమారు రూ.7 కోట్ల ఆదాయం లభిస్తుంది. ఇందులో జీతాలు, ఇతర అవసరాలకు కలిపితే సుమారు రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనాలు ఉన్నాయి. మిగిలిన నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఈ ఏడాది సుమారు రూ.3కోట్ల సా«ధారణ నిధులను కమిషనర్‌ నరేంద్రకుమార్‌ హయాంలో పై అధికారుల అనుమతులు లేకుండా, కౌన్సిల్‌ తీర్మానం లేకుండా ఇష్టానుసారంగా వ్యయం చేసి లెక్కలు చూపిస్తున్నారు. వాస్తవంగా సాధారణ నిధులను అత్యసర సమయాల్లో కౌన్సిల్‌ తీర్మానం మేరకు ఖర్చు చేయాలి. కానీ నామినేటెడ్‌ వర్కుల కింద గ్రావెల్‌రోడ్లు, సిమెంట్‌రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లుగా సుమారు రూ.1.50 కోట్లు  డ్రా చేసేశారు. కార్యాలయ ఖర్చుల కింద మరో రూ.25 లక్షలు డ్రా చేశారు.

వట్రపాళెంలో వీపీఆర్‌ ఇన్‌ప్రా పేరుతో రూ.25 లక్షలతో కంకరడస్ట్‌తో రోడ్లు వేసి రూ.85లక్షలుగా చూపించి కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదించుకోవాలని ప్రయత్నాలు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏటి పండగ నిర్వహణకు రూ.లక్ష ఖర్చు చేసి రూ.5లక్షలుగా చూపించారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఇచ్చిన నిధులు చాలవని, మరో రూ.లక్షలు ఆమోదించుకునే ప్రయత్నాలు చేయడం విశేషం. అలాగే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పేరుతో లక్షలాది రూపాయలు స్వాహా చేశారు.  ఇలా ఇష్టానుసారంగా కౌన్సిల్‌ ఆమోదం సైతం లేకుండానే నిధులను బొక్కేశారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ కౌన్సిల్‌ సభ్యులు కలిసి స్వాహా చేసిన సాధారణ నిధులపై విచారణ జరిపించాలని డీసెంట్‌ రాసి కమిషనర్‌కు ఇచ్చారు. కమిషనర్‌ పూర్తిస్తాయి విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెలుగు చూస్తాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement