Sub-Plan
-
ఎస్సీలకు సాయంలో రాష్ట్రం మేటి
సాక్షి, అమరావతి: మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే అట్టడుగు వర్గాలకు ఎంత మేలు జరుగుతుందో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన నిరూపిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఉన్నతికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ వర్గాల సాధికారతకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక అమలు, దాని ద్వారా ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి మూడు నెలల్లోనే మరే రాష్ట్రం అమలు చేయని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ ఉప ప్రణాళికను అమలు చేసిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల మంజూరు, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో, పట్టణ గృహ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనపరిచిందని ఆ శాఖ విడుదల చేసిన నివేదికలో ప్రశంసించింది. 2023–24 తొలి తైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) వివిధ రాష్ట్రాల పథకాల లక్ష్యాలు, అమలు తీరును నివేదిక వివరించింది. లక్ష్యాల్లో 90 శాతంపైగా అమలు చేసిన రాష్ట్రాలు చాలా మంచి పనితీరు కనబరిచినట్లు, 80 నుంచి 90 శాతం అమలు చేసిన రాష్ట్రాలు మంచి పనితీరు కనపరిచినట్లు, 80 శాతం లోపు అమలు చేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేదని నివేదిక వర్గీకరించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏపీతో సహా 16 రాష్ల్రాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 14,54,481 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందగా, వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 14,43,619 కుటుంబాలకు సహాయం అందినట్లు నివేదిక స్పష్టం చేసింది. మిగతా ఏ రాష్ట్రంలోనూ కనీసం 10 వేల మందికి కూడా ఎస్సీ కుటుంబాలకు సాయం అందించలేదని ఆ నివేదికను పరిశీలిస్తే అర్ధమవుతుంది. దేశంలోని రాష్ట్రాలన్నీ కలిపి 14,39,152 మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించగా అందులో సగం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,15,872 మంది ఎస్సీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల ద్వారా సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. గృహ నిర్మాణంలో, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలోనూ ప్రథమ స్థానం పేదల గృహాల నిర్మాణంలో, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ రాష్ట్రమే ముందుందని ఆ నివేదిక పేర్కొంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కింద పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా మొత్తం 1.01 లక్షల గృహాల నిర్మాణం జరగ్గా, వాటిలో ఒక్క ఆంద్రఫ్రదేశ్‌లోనే 66,206 గృహాల నిర్మాణం చేసి రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో లక్ష్యానికి మించి రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నట్లు చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం. తొలి త్రైమాసికంలో 6,213 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా, 19,085 కనెక్షన్లు ఇచి్చనట్లు నివేదిక వెల్లడించింది. అంటే లక్ష్యానికి మించి 307 శాతం అధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచి్చనట్లు వివరించింది. అలాగే రాష్ట్రంలో ఐసీడీఎస్‌లు, అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు నివేదిక ప్రశంసించింది. -
రూ.6,929 కోట్లతో గిరిజనాభివృద్ధి
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో రూ.6,929 కోట్ల వ్యయంతో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. సీఎం వైఎస్ జగన్ గతేడాది కంటే.. ఈ ఏడాది ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.784 కోట్లు అధికంగా కేటాయించారని వివరించారు. ఈ నిధులను సద్వినియోగం చేస్తూ.. గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సబ్‌ప్లాన్ నిధుల వినియోగాన్ని సమీక్షించారు. అన్ని రంగాల్లోనూ గిరిజనులు అభివృద్ధి సాధించాలన్నదే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకే గతేడాది కంటే ఈ ఏడాది అధిక నిధులను కేటాయించారని చెప్పారు. 2022–23లో ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.6,144.90 కోట్లు మంజూరు చేయగా.. ఈ ఏడాది రూ.6,929.09 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఈ నిధులను పూర్తిగా గిరిజన సంక్షేమానికే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిధుల సద్వినియోగంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. గిరిజన గూడేలకు రహదారులు, తాగునీటి సరఫరా, విద్యా సంస్థల్లో సౌకర్యాలను మెరుగుçపరచాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ జె.వెంకటమురళి, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, జీసీసీ ఎండీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. జీసీసీ సేవల విస్తృతానికి కొత్త వెబ్సైట్ గిరిజనులు, వినియోగదారులు, ఉద్యోగులకు అవసరమైన శీఘ్ర సేవలు, సమగ్ర సమాచారాన్ని అందించడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నూతన వెబ్సైట్ దోహదపడుతుందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీసీసీ నూతన వెబ్‌సైట్‌ను రాజన్నదొర ప్రారంభించారు. సీఎం జగన్ సారథ్యంలో నాలుగేళ్లలో గిరిజన సాధికారత సాధనలో జీసీసీ అనూహ్యమైన, మంచి ఫలాలను గిరిజనులకు అందించిందని వివరించారు. గిరిజనులకు డీఆర్ డిపోల ద్వారా రేషన్ సరుకుల సరఫరా, పెట్రోల్ బంకుల ఏర్పాటు, వివిధ రాష్ట్రాల్లో రిటైల్ ఔట్లెట్ల ద్వారా ఉత్పత్తుల విక్రయాలు, వన్‌ధన్ వికాస కేంద్రాల ఏర్పాటు, అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తూ సత్ఫలితాలు సాధిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. గిరిజన సంక్షేమ శాఖ నేతృత్వంలో జీసీసీ చేస్తున్న కార్యక్రమాలను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింతగా విస్తరించేందుకు ఈ వెబ్సైట్ విశేషంగా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీసీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జీసీసీ అందిస్తున్న సేవలు, ఖర్చు చేస్తున్న నిధులు, ప్రణాళికలు, ఫలితాలు వంటి వివరాలు అన్నీ గణాంకాలతో సహా నూతన వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. జీసీసీ సహజ ఉత్పత్తుల విక్రయానికి ఆన్లైన్ షాపింగ్‌తో పాటు సోషల్ మీడియా వేదికలను ఈ నూతన వెబ్‌సైట్‌తో అనుసంధానించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జీసీసీ ప్రధాన కార్యాలయం సహా ప్రాంతీయ కార్యాలయాలు, ఉద్యోగుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచడంతో పాటు, పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యల్లో భాగంగా జీసీసీ సిబ్బంది బదిలీలు, ఉత్తర్వుల వివరాలతో పాటు టెండర్లు, నోటీసులు, ప్రకటనలు సమగ్రంగా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దాండే, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.మురళి, జీసీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ చీఫ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సబ్‌ప్లాన్ నిధులు మళ్లించడమేంటి?
మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బోస్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీల సంక్షేమానికి మాత్రమే పూర్తిగా ఖర్చు పెట్టాల్సిన సబ్‌ప్లాన్ నిధులను మండల కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ గదుల ఏర్పాటుకు మళ్లించడం ఏమిటని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జరిగిన చర్చలో బోస్ మాట్లాడుతూ.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధుల్లో రూ.30.79 కోట్లను మండల కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఏర్పాటుకు ఖర్చు పెట్టారని సభ దృష్టికి తీసుకొచ్చారు. మరో రూ.15.82 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వ కాలేజీ భవనాల నిర్మాణాలకు వినియోగించారన్నారు. 2016-17 బడ్జెట్ ప్రతిపాదనలో సబ్‌ప్లాన్ నిధుల్లో రూ.612 కోట్లు తోటపల్లి రిజార్వాయర్‌కు, మరో రూ. 2,000 కోట్లు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించారన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల ఖర్చు తీరిదేనా? అని ప్రశ్నించారు. దీనికి మంత్రి రావెల జవాబిస్తూ, సభ్యులు సాంఘిక సంక్షేమశాఖ గురించి ప్రశ్న అడిగి సబ్‌ప్లాన్ గురించి మాట్లాడుతున్నారని, దానిపై ఇంకోసారి చర్చిద్దామన్నారు. స్కాలర్షిప్ చార్జీలు పెంచుతాం..: పెరిగిన ధరల నేపథ్యంలో హాస్టల్ విద్యార్థులకు స్కాలర్షిప్ చార్జీలను 10-15% పెంచనున్నట్లు మంత్రి రావెల మండలిలో చెప్పారు. -
అరకొర వైద్యసేవలే గతి..
పార్వతీపురం :పార్వతీపురం సబ్-ప్లాన్ మండలాల్లో వైద్య సిబ్బంది సరిపడా లేకపోవడంతో గిరిజనులకు అరకొర వైద్యసేవలే అందుతున్నాయి. ప్రస్తుతం వేసవిలో రోగాలు విజృంభిస్తున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. పీహెచ్‌సీల్లో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేరని, ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా అధికారులు, పాలకులకు తెలియజేసినా ఫలితం లేకపోయిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి సిబ్బందికి కూడా వాహనాలు, క్వార్టర్స లేవు. దీంతో వారు కూడా మైదాన ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు సంచి వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోంది. పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, మక్కువ, పాచిపెంట, సాలూరు, తదితర మండలాల్లో 20 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీలు, ఎనిమిది 24 గంటల ప్రసూతి కేంద్రాలు, 119 సబ్-సెంటర్లున్నాయి. వీటిలో దాదాపు 616 మంది వైద్యాధికారులు, వివిధ రకాల సిబ్బంది ఉండాల్సి ఉంది. అయితే ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు, సిబ్బంది 275 మంది ఉండగా, 205 మంది వైద్యాధికారులు, సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇంకా 136 పోస్టులు ఖాళీలున్నాయి. ఇందులో ప్రధానంగా చినమేరంగి సబ్ సెంటర్‌కు ఒక సివిల్ సర్జన్ స్పెషలి్స్ట్ పోస్టు మంజూరు కాగా అవి ఖాళీగానే ఉన్నాయి. భద్రగిరిలో రెండు డిప్యూటీ సివిల్సర్జన్లు, తాడికొండ, భద్రగిరిలో చెరో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ కాలేదు. కురుపాం, చినమేరంగిలలో చెరో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఐటీడీఏ పరిధిలో 24 సూపర్వైజర్ పోస్టులు, కురుపాం, సాలూరులో మూడు రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు, చినమేరంగిలో ఒక హెడ్ నర్సు, స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ కాలేదు. భద్రగిరిలో ఒక డీపీఎంఓ పోస్టు ఉండాల్సి ఉండగా అది నేటికీ భర్తీ కాలేదు. 8 హెచ్‌వీలు 37 మంది ఏఎన్ఎమ్లు, ఐదుగురు సెకెండ్ ఏఎన్ఎమ్లు, 21మంది ఎంపీహెచ్ఏ (మేల్)లు, 11ఏపీఎంఓలు ఖాళీలున్నాయి. డోకిశీల, మొండెంఖల్, కురుపాంలలో నాలుగు ఫార్మాసిస్ట్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు-3, డార్క్‌రూమ్ అసిస్టెంట్లు-3 పోస్టులు భర్తీకి నోచుకోలేదు. ఇటీవల డీఎంహెచ్ఓ కొంతమంది మైదాన ప్రాంతానికి చెందిన వైద్యాధికారులు, సిబ్బందిని గిరిజన ప్రాంతాలకు డిప్యుటేషన్‌పై వేశామని ప్రకటించారు. అయితే వారు కూడా సక్రమంగా రావడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయా పీహెచ్‌సీలకు అంబులెన్స్‌లు, ఆస్పత్రులకు ప్రహరీలు, వైద్యాధికారులకు, సిబ్బందికి క్వార్టర్లు లేక నానాయాతన పడుతున్నారు. వీటితో పాటు ఇన్వెర్టర్లు, ఫ్రిజ్‌ల సదుపాయం లేక మందులు నిల్వ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయి వైద్యసిబ్బందిని నియమించాలని గిరిజనులు కోరుతున్నారు. -
ఎస్సీ ఉప కులాల ఉన్నతికి తోడ్పడాలి
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల ఫలాలు సరిగా అందక అభివృద్ధి విషయంలో వెనుకబడిన షెడ్యూల్ కులాల్లోని ఉప కులాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలను ఇవ్వాలని రాష్ర్ట షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సూచించింది. షెడ్యూల్ కులాల్లో సమస్థాయిని సాధించేందుకు అల్పసంఖ్యాక, నిర్లక్ష్యానికి గురవుతున్న ఉప కులాలకు ఈ ప్యాకేజీలను అందించాలని సిఫార్సు చేసింది. షెడ్యూల్ కులాల సబ్‌ప్లాన్ కింద వచ్చే నిధులను ఎస్సీ జనాభా అనుగుణంగా నేరుగా ఎస్సీ అభివృద్ధి శాఖకే కేటాయిస్తే ఆయా పథకాల ద్వారా వ్యక్తిగతంగా ఎస్సీ కుటుంబాలకు, ఆయా జనావాసాలకు (హాబిటేషన్) నేరుగా అందించడంతో పాటు, ప్రణాళికలను రూపొందించుకునేందుకు అవకాశం ఉం టుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన సిఫార్సులు, సూచనలు,సలహాలతో రాష్ట్ర ప్రభుత్వానికి షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఒక నివేదికను సమర్పించింది. సంక్షేమరంగానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీకి కూడా ఈ శాఖ అధికారులు పలు సూచనలు, శాఖ పనితీరును మెరుగుపరిచేందు కు సలహాలను లిఖితపూర్వకంగా అందజేశారు. ఎస్సీల అత్యాచారాల విచారణకు జిల్లాకో పోలీస్‌స్టేషన్... ఎస్సీలపై అత్యాచారాలు, దాడులకు సంబంధించిన కేసుల కోసం జిల్లాకు ఒక పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని, బాధితులకు సహాయసహకారాలు అందించేందుకు లీగల్‌సెల్‌ను ఏర్పాటుచేయాలని సూచించింది. ట్రెజరీ కంట్రోల్ లేకుండా అత్యాచారాలు, దాడులకు గురైన బాధితులకు నగదు, న్యాయపరమైన సహాయం అందించేలా ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేసింది. ఎస్సీ యువత, విద్యార్థుల కోసం జిల్లాకు ఒక స్టడీ సర్కిల్‌ను, ఎస్సీ సబ్‌ప్లాన్ అమలును పర్యవేక్షించేందుకు శాఖాధిపతి కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. కమ్యూనిటీ హాళ్లను నాలెడ్జ్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని తన నివేదికలో పేర్కొంది. ఈ శాఖ సిఫార్సుల్లో ముఖ్యమైనవి.. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంలో భాగంగా అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో టాయ్లెట్లు, బాత్రూమ్లు, నిరంతరాయ నీటి సదుపాయం కల్పించాలి. హాస్టళ్లలో ఉంటున్న వారికి కాస్మోటిక్ చార్జీలను పెంచాలి హాస్టళ్ల నిర్వహణకు నిధుల కేటాయింపు సమీకృత సంక్షేమ వసతి గృహాల కాంప్లెక్స్‌లను దశలవారీగా నిర్మించాలి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఇంకా అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ (డెరైక్ట్ రిక్రూట్మెంట్) పోస్టులు భర్తీచేయాలి అన్ని కాలేజీ హాస్టళ్లకు నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టుల (ఔట్ సోర్సింగ్ అనుమతితో) మంజూరు చేయాలి. -
‘సబ్‌ప్లాన్’ నిధులు వెనక్కి!
40 శాతం ఎస్సీ, ఎస్టీ జనాభా ఉండాలనే నిబంధన ఫలితం రద్దయిన రూ.30లక్షల రహదారుల పనులు లబోదిబోమంటున్న ఆరు పంచాయతీలు డీలాపడుతున్న సర్పంచులు కూచిపూడి : గ్రామాల్లో 40 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీలుంటేనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వినియోగించాలంటూ ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆంక్షలపై పలువురు సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్లాను కింద విడుదల చేసిన నిధులను... 40 శాతం మంది ఆయా సామాజిక వర్గాలు లేరనే సాకుతో రద్దు చేయడం దారుణమని సంబంధిత సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మండలంలోని 9గ్రామాలకు సిమెంటు రహదారుల కోసం రూ.45లక్షలు (ఒక్కక్క పంచాయతీకి రూ.5లక్షల చొప్పున) కేటాయించారు. తాజాగా ఇంజినీరింగ్ అధికారులు జారీచేసిన ఉత్తర్వుల (మౌఖికం)తో మండలంలోని కూచిపూడి, పెదపూడి, పాలంకిపాడు, మొవ్వపాలెం, అవురుపూడి, యద్ధనపూడి గ్రామాలకు రూ.5లక్షల చొప్పున మంజూరయిన రూ.30లక్షలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని పంచాయతీ రాజ్ ఏఈ పీ చంద్రశేఖర్ ఆయా పంచాయతీలకు వెల్లడించటంతో వారందరూ హతాశులయ్యారు. ఈ నిధులతో రహదారులు వేయించేందుకు పంచాయతీ తీర్మానాలు చేసి సభల ఆమోదం పొంది అంచనాలు వేయించారు. ఆఖరి నిముషంలో ఈ కబురు అందడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే విషయాన్ని మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన జెడ్పీడెప్యూటీ సీఈవో ఎం కృష్ణమోమన్ దృష్టికి ఆయా సర్పంచుల తరపున మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఏనుగుమోహనరావు తెలిపినా ఫలితం లేకుండాపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు విధులు నిర్వహించడం మినహా తామేమీ చేయలేమని చేసినట్లు తెలిసింది. అయితే బార్లపూడి, కొండవరం, గూడపాడు గ్రామాలలో నిబంధనల ప్రకారం 40 శాతంపైగా దళితులుండటంతో ఆ పంచాయతీలకు మంజూరయిన నిధులతో సీసీ రోడ్లు వేసే అవకాశముందని పీఆర్ ఏఈ స్పష్టం చేశారు. రద్దయిన ఆ ఆరింటి స్థానంలో ప్రస్తుతం మొవ్వ, భట్లపెనుమర్రు, చినముత్తేవి, పెదముత్తేవి గ్రామాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లువేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రద్దయిన తమ గ్రామ రహదారుల నిధులను పునరుద్ధరించి చేయూత ఇవ్వాలని సర్పంచులు కందుల జయరాం (కూచిపూడి), తాతా రజని (పెదపూడి), యద్ధనపూడి రాఘశేఖర్ (యద్ధనపూడి), ఏనుగు మోహనరావు (అవురుపూడి), యార్లగడ్డ సునీత (పాలంకిపాడు), ఊసా సుబ్బమ్మ (మొవ్వపాలెం) కోరుతున్నారు. -
వాడివేడీగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం
సబ్‌ప్లాన్ అమలు తీరుపై గుర్రు వాడివేడీగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రధాన సమస్యలను ప్రస్తావించిన సభ్యులు అభివృద్ధి పనుల్లో జాప్యంపై నిలదీత సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం వాడివేడీగా జరిగింది. పలు సమస్యలపై సభ్యులు అధికారులపై మండిపడ్డారు. నిధులున్నా పనులు చేపట్టడం లేదంటూ నిలదీశారు. నగరంలో అక్రమ కట్టడాలు పెరిగినా పట్టించుకునే వారు లేదని.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు సాగక పోయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఏ అధికారికి ఏ అధికారముందో తెలియదని, ఏ ఫైలు వచ్చినా తీవ్ర జాప్యం జరుగుతుందంటూ తూర్పారబట్టారు. ఇలా ఆద్యంతం పలు సమస్యలపై కౌన్సిల్ సమావేశం గరంగరంగా సాగింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. సబ్‌ప్లాన్‌పై గరంగరం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో జీహెచ్ఎంసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారని, బడ్జెట్లో కేటాయింపులకే పరిమితమవుతున్నారని పలువురు కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. శనివారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పైనే తొలుత చర్చ ప్రారంభించాలని అన్ని పార్టీల సభ్యులు పట్టుబట్టారు. అజెండాలోని అంశాల వారీగా చర్చను చేపడదామని సభాధ్యక్షుడు మేయర్ చెప్పినా వినిపించుకోకపోవడంతో సబ్‌ప్లాన్‌పైనే తొలుత చర్చను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ బడ్జెట్లో ఎస్సీలకు రూ.260 కోట్లు, ఎస్టీలకు రూ.94 కోట్ల కేటాయింపులు చూపినా అందులో రూపాయి కూడా ఖర్చు చేయలేదని పలువురు ఆక్షేపించారు. నగరంలో ఎన్నో మురికివాడలున్నాయని, అక్కడుంటున్న ఎస్సీ, ఎస్టీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించుకోవాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ సూచించారు. ఇది చాలా సున్నితమైన అంశమని, కచ్చితంగా అమలు చేయాలన్నారు. అధికారుల అశ్రద్ధ కారణంగా గతంలో మురికి వాడల అభివృద్ధికి అందిన దాదాపు రూ.800 కోట్ల నిధులు కూడా వినియోగించుకోలేకపోయారని గుర్తుచేశారు. ఈ అంశాన్ని లేవనెత్తిన మెట్టుగూడ కార్పొరేటర్ ఎమ్మార్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సబ్‌ప్లాన్ నిధులు తన డివిజన్లో పైసా కూడా వినియోగించలేదన్నారు. ఈ నిధులు చట్టబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఈ పథకాన్ని అమలు చేయని అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు వెంకటరమణ, కృష్ణ తదితరులు డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వివిధ పన్నుల రూపేణా కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నా.. ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేయడం లేదని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పక్ష నాయకుడు దిడ్డి రాంబాబు, టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ పక్ష నాయకుడు బంగారి ప్రకాశ్, పలువురు కార్పొరేటర్లు అధికారుల తీరును ప్రశ్నించారు. వీటిని అమలు చేసే బాధ్యత ఏ విభాగానిదో స్పష్టం చేయాలన్నారు. గత ఏడాది రూ.10 కోట్లు ఖర్చు చేశామని అధికారులు సభకు తప్పుడు సమాచారమిచ్చారంటూ వారు మండిపడ్డారు. ముస్లింలకు కూడా సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని ఎంఐఎం కార్పొరేటర్ అలీంబేగ్ కోరారు. కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పందిస్తూ, స్థానిక సంస్థలో నేరుగా దీన్ని అమలు చేసేందుకు లింక్ ఉండదని, ఇతర శాఖల నిధులు కూడా రావాల్సి ఉంటుందన్నారు. అమలుకు ఒక ప్రత్యేక విభాగ అధిపతిని నియమించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది పకడ్బందీగా అమలు చే సేందుకు కమిటీని వేసి మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జనాభా 40 శాతం కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో దీన్ని అమలు చేస్తే బాగుంటుందని కమిషనర్ సూచించగా కొందరు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు డివిజన్‌ను కాకుండా బస్తీని పరిగణనలోకి తీసుకోవాలని సభ్యులు సూచించారు. మేయర్ జోక్యం చేసుకుని ఈ అంశంపై తీర్మానం చేసి సబ్‌ప్లాన్ చర్చను ముగించారు. పండుగల సందర్భంగా నిధులివ్వండి.. రంజాన్, బోనాలు పండుగల సందర్భంగా ప్రార్థన మందిరాల వద్ద పనులు చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించినందున ప్రత్యేక నిధులు కేటాయించాలని బీజేపీ కార్పొరేటర్ ఆలె జితేందర్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినందున, నిధులున్నందున తగినన్ని కేటాయించాలని ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్ కోరారు. నామినేషన్ల పద్ధతిపై వెంటనే పనులివ్వాలని తలసాని సూచించారు. ఆయా పనుల కు జీహెచ్ఎంసీ, జలమండలి మధ్య సమన్వయం ఉండాలన్నారు. ఏ ఒక్క పనీ జరగడం లేదు.. జీహెచ్ఎంసీలో ఎవరెవరికి ఏయే అధికారాలున్నాయి.. అనే అంశంపై చర్చ సందర్భంగా కమిషనర్ జోనల్, అడిషనల్ కమిషనర్లకు అధికారాలివ్వకుండా వ్యవహరిస్తున్నారని, ప్రతిదానికీ ‘స్పీక్, డిస్కస్’ అని రాస్తుండటంతో ఏ ఒక్కపనీ జరగడం లేదని సభ్యులు ఆరోపించారు. ఏవైనా విభాగాలను తొలగించేటప్పుడు కానీ, ఇతర విధుల్లో నియమిస్తున్నప్పుడు కానీ పాలకమండలికి సమాచారమివ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీ అండ్ టీ విభాగం రద్దు, ఇతర విభాగాల వారిని పన్ను వసూళ్లకు నియమించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందుకు కమిషనర్ సోమేశ్‌కుమార్ బదులిస్తూ.. తగిన సమాచారం లేని మూడు, నాలుగు ఫైళ్లకు మాత్రమే స్పీక్, డిస్కస్ అని రాస్తున్నాం తప్ప మిగతావన్నీ ఏ రోజువి ఆ రోజే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఎక్కడా పనులు ఆగడంలేదన్నారు. గడచిన నాలుగు సంవత్సరాల పనులు, ఈ సంవత్సరం పనులను పోల్చి చూసినా వాస్తవాలు తెలుస్తాయన్నారు. పనులకు మంజూరైన నిధులు, ఖర్చు చేసిన వివరాలు నెలవారీగా చూసినా గతంలోకంటే ఈసారి 20 శాతం ఎక్కువే జరిగాయన్నారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. కమిషనర్‌గా తాను కొత్త ప్రాజెక్టులు ప్రవేశపెట్టానో లేదో ఆ అంశాన్ని లేవనెత్తిన వారు ఆత్మవిమర్శ చేసుకుంటే అవగతమవుతుందన్నారు. కొన్ని అంశాలు పాలక మండలికి తెలియజేయకపోవడం అనేది తెలియక జరిగిన పొరపాటు తప్ప కావాలని చేసింది కాదన్నారు. ఈ చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులు పలువురు వాకౌట్ చేశారు. పోస్టుల భర్తీ ఏదీ? జీహెచ్ఎంసీకి 2,600 పోస్టులు మంజూరైనా నియామకాలు జరగలేదన్న ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ నజీరుద్దీన్ ప్రశ్నకు కమిషనర్ బదులిస్తూ, వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం వేరైనందున ఈ పోస్టుల విషయాన్ని ఇటీవల సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లానని, జేఎన్టీయూ ద్వారా జీహెచ్ఎంసీయే నియామకాలు చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరినట్టు తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే సీఎం నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. రహదారుల విస్తరణలో జాప్యమెందుకు? భూసేకరణ జరగనుందున పలు రహదారుల విస్తరణ ముందుకు జరగడం లేదని పలువురు సభ్యులు ప్రస్తావించారు. ఈ అంశంపై మేయర్ మాజిద్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ మార్గంలో భూ సేకరణ పూర్తయినా, కాలేదని ఎందుకు చెప్పారంటూ పలువురు సభ్యులు నిలదీశారు. నష్టపరిహారం పొందినవారు కూడా ఆ ప్రాంతాలను ఖాళీ చేయకపోవడం తమ దృష్టికి వచ్చిందని, కోర్టు వివాదాల్లో 108 కే సులున్నాయని కమిషనర్ చెప్పారు. నెలా రెండు నెలల్లోగా వీటిలో చాలా వరకు క్లియర్ చేస్తామన్నారు. అక్రమ కట్టడాలపై.. అక్రమ కట్టడాల విషయంలో అధికారులు తగుచర్యలు తీసుకోవడం లేరని సభ్యుడు దిడ్డి రాంబాబు తదితరులు అధికారుల తీరును ఆక్షేపించారు. ఇరవై గజాల స్థలంలో ఇళ్లు కట్టుకున్నవారిపై ప్రతాపం చూపుతున్న అధికారులు పెద్ద భవంతుల అక్రమ నిర్మాణదారుల జోలికి వెళ్లడం లేదని విమర్శించారు. బిల్డింగ్ కమిటీలో ఇంజనీర్లను కూడా భాగస్వాములను చేయాలని మరో సభ్యుడు సింగిరెడ్డి కోరారు. దశల వారీగా ఇస్తున్న అనుమతులతో అక్రమాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్సీ ప్రభాకర్ చెప్పారు. ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి.. జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్లు సకాలంలో పనులు చేయనందున పలు సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు సభ దృష్టికి తెచ్చారు. పనులు చేయించుకునేందుకు వారి కాళ్లు పట్టుకోవాల్సి వస్తోందని టీడీపీ కార్పొరేటర్ సుమలతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల కబంధహస్తాల్లో చిక్కుకుందని బంగారు ప్రకాశ్ ఆరోపించారు. పనులు చేయని వారిని బ్లాక్ లిస్టులోపెట్టి కొత్తవారిని ప్రోత్సహించాలన్నారు. ఒకరికే ఎక్కువ పనులివ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని కమిషనర్ బదులిచ్చారు. పనులు త్వరితగతిన జరిగేందుకు నెలకోసారైనా కార్పొరేటర్లతో సమీక్ష సమావేశాలు జరపాలని నిర్ణయించినట్టు చెప్పారు. సమావేశంలో ఇంకా ఎమ్మెల్సీలు జాఫ్రి, వెంకటరావు, ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల శోభ.. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం సందర్భంగా ‘ఎన్నికల కళ’ కనిపించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నందున కార్పొరేషన్లో తమ జెండా ఎగుర వేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నట్టుగా ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు సందడి చేశారు. వారిలో కొందరు తమ వాణి వినిపించారు. సభలో పాల్గొన్నవారిలో ఎంపీలు బండారు దత్తాత్రేయ, సీహెచ్ మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, జి.సాయన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జాఫర్‌హుస్సేన్, మాగంటి గోపీనాథ్, కౌసర్ మొహియుద్దీన్, టి.ప్రకాశ్‌గౌడ్, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఆరెకపూడి గాంధీలున్నారు. ఆయా పార్టీల నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్లు సభకు గులాబీ కండువాలతో హాజరయ్యారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన యూసుఫ్‌గూడ కార్పొరేటర్ మురళీగౌడ్ ‘జై తెలంగాణ’ అంటూ సభలోకి వచ్చారు. సభా గౌరవం పాటించాలి: దత్తాత్రేయ సర్వసభ్య సమావేశం ఉదయం 10 గంట లకని ఆహ్వానం పంపడంతో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ నిర్ణీత వ్యవధికన్నా ముందుగానే జీహెచ్ఎంసీకీ చేరుకున్నారు. అప్పటికీ చాలామంది అధికారులు రాకపోవడాన్ని గుర్తించారు. అనంతరం స మావేశంలో ప్రసంగిస్తూ.. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశమంటే హూందాగా వ్యవహరించి సభా గౌరవాన్ని కాపాడాలని ఆయన సూచించారు. తీర్మానాలే అధికం.. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో మేయర్ మాజిద్ హుస్సేన్ తనదైన శైలిలో పలు తీర్మానాలు చేయించారు. ఆయా అంశాలపై చర్చ సందర్భంగా సభ్యుల నుంచి వెలువడిన ప్రశ్నలకు స్పందిస్తూ మేయర్ తీర్మానం చేద్దామంటూ ప్రకటించారు. ఇలా ఒకటి కాదు.. రెండుకాదు ఏకంగా ఎనిమిది తీర్మానాలు చేశారు. అన్నింటినీ సభ ఏకగ్రీవంగా తీర్మానించిందని ప్రకటించారు. సభ్యుల ప్రశ్నలకు.. అధికారుల సమాధానాలకు మధ్య రచ్చ జరగకుండా మధ్యేమార్గంగా తీర్మానాలతో సభ్యులను శాంతింపచేశారు. ఇవీ తీర్మానాలు.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేసేందుకు మేయర్ నేతృత్వంలో డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్లతో కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ తగిన మార్గదర్శకాలు రూపొందించి నిధుల వినియోగం తీరును పర్యవేక్షిస్తుంది. సబ్‌ప్లాన్‌కు అనుగుణంగా జీహెచ్ఎంసీ బడ్జెట్ నుంచి ఎస్సీలకు 16.2 శాతం (రూ.260.04 కోట్లు), ఎస్టీలకు 6.6 శాతం (రూ.94.04 కోట్లు)నిధులతో ఎస్సీ, ఎస్టీలుంటు న్న ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్పొరేటర్ల ప్రతిపాదనల మేరకు ఈ పనులు చేపట్టాలి. బోనాలు, రంజాన్ పండుగల సందర్భంగా ఆయా ప్రార్థనాలయాల్లో, వాటి పరిసరాల్లో జీహెచ్ఎంసీ నిధులతో పనులు చేసేందుకు తీర్మానం చేశారు. తమ వార్డుల్లో చేపట్టిన పనుల గురించి కార్పొరేటర్లు పాలకమండలికి తెలియజేయాలి. పనులకు వీలైనంత త్వరగా అంచనాలు రూపొందిం చాలి. ఆస్తిపన్ను వసూళ్లలో లక్ష్యాలు సాధించిన బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, వాల్యుయేషన్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లకు ప్రోత్సాహకాలు. రహదారి విస్తరణ పనులకు ఆటంకంగా మారిన నిర్మాణాల తొలగింపు. సదరు భవనాలకు సంబంధించి స్టాండింగ్ కమిటీ ద్వారా నష్టపరిహారం మంజూరైన వాటిని 15 రోజుల్లోగా తొలగించాలి. విద్యుత్ స్తం భాల తొలగింపు పనులు 15 రోజుల్లో పూర్తిచేయాలి. కోర్టు కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం కనబరచిన స్టాండింగ్ కౌన్సిళ్లపై చర్యలు లేదా బాధ్యతల నుంచి తొలగింపు. కేసుల పరి ష్కారానికి స్టాండింగ్ కమిటీ ఆమోదంతో స్పెషల్ స్టాండింగ్ కౌన్సెళ్లను తీసుకోవాలి. రెండు విడతల్లో 2,600 పోస్టుల భర్తీకి ఆర్థిక విభాగం అనుమతిస్తూ ఉత్తుర్వులు జారీ అయి ఏడాది దాటినా నియామకాలు జరగనందున, జీహెచ్ఎంసీ తరఫున నెలరోజు ల్లోగా వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషనర్‌కు సూచన. -
సబ్‌ప్లాన్‌పై నీలినీడలు
అట్టహాసంగా చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది అమలులోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా.. ఇప్పటి వరకు ఎటువంటి నియమ, నిబంధనలు రూపొందించలేదు. సాధారణ నిధులు రూపాయి కూడా విడుదల చేయలేదు. సబ్‌ప్లాన్ నిధులు వస్తాయని భావించిన వివిధ ప్రభుత్వ శాఖలు ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించలేదు. ఫలితంగా జిల్లాలో ఆయా ఆవాసాల్లో మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఈ చట్టాన్ని ఏ విధంగా అమలు చేస్తుందోనన్న అనుమానాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం గత ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ను రూపొందించిం ది. సరైన విధి విధానాలు లేకుండానే గతేడాది జనవరి 24న ఈ చట్టానికి ఆమోద ముద్ర వేసింది. రూ. కోట్లు ఖర్చు పెట్టి జిల్లాలో దీనిపై ప్రచారం చేసింది. ఈ చట్టం వచ్చి సుమారు 16 నెలలు కావస్తోంది. రాష్ట్ర స్థాయిలో 26 శాఖలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు కాగితాల్లో ప్రకటించిన ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఇప్పటికీ పైసా విదల్చలేదు. సోషల్ వె ల్ఫేర్‌కు రూ.2170.28 కోట్లు, గ్రామీణాభివద్ధికి రూ.వెయ్యి కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.1050 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కు రూ.600 కోట్లు, హౌసింగ్‌కు రూ.600 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.350 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.200 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.100 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూ.453 కోట్లు, ఫ్యామిలీ వెల్ఫేర్‌కు రూ.311 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి రూ.198 కోట్లు, విద్యుత్‌కు రూ.100 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.210 కోట్లు, ప్లానింగ్‌కు రూ.120 కోట్లు ఇలా 26 శాఖలకు మొత్తంగా 7927.45 కోట్లు మంజూరు చేసింది. సబ్‌ప్లాన్ వచ్చిన 9 నెలలు తరువాత చట్టం అమలు, నిధుల కేటాయింపులు, వాటిని ఏ విధంగా ఖర్చు చేయాలి వంటి విషయాల పర్యవేక్షణకు నవంబర్‌లో జిల్లా స్థాయి మోనిటరింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా ఐటీడీఏ పీవో, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను సభ్యులుగా చేర్చింది. చట్టం అమలుకు సంబంధించిన విధి విధానాలను ఇప్పటికీ పూర్తి స్థాయిలో రూపొందించలేదు. సౌకర్యాలు కొరవడిన ఎస్సీ, ఎస్టీ ఆవాసాలు జిల్లాలో దాదాపుగా 175 ఎస్సీ, 3696 ఎస్టీ గ్రామాలు ఉన్నాయి. వీటిలో 693 కాలనీలకు రోడ్డు సదుపాయం లేదు. 390 ఆవాసాలు విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్నాయి. ఏజెన్సీలో 245 ఎస్టీ కాలనీలకు డ్రైనేజీ సదుపాయం లేక అధ్వానంగా ఉన్నాయి. 47 గ్రామాలకు తాగు నీటి సదుపాయం లేదు. ఇలా అనేక ఎస్సీ, ఎస్టీ హేబిటేషన్లు సదుపాయాలకు దూరంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సబ్‌ప్లాన్ ద్వారా నిధుల కేటాయిం పులు జరిగితే ఈ గ్రామాలు అభివద్ధికి నోచుకుంటాయని ఎ స్సీ, ఎస్టీలు సంబరపడ్డారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ని ధులు కేటాయించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, పనులు ఒక్కటి కూడా ముం దుకు సాగలేదు. చట్టం రాకముందు సాధారణ నిధులలో కొం తైనా వీరి సంక్షేమానికి వినియోగించేవారు. ఈ సబ్‌ప్లాన్ అమలులోకి వచ్చిన తరువాత దీని కింద కేటాయింపులు జరగకపోవడం, సాధారణ నిధులను వీరి అభివద్ధికి వినియోగించకపోవడంతో ఎస్సీ, ఎస్టీల పరిస్థితి దయనీయంగా మారింది. -
సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు మార్గదర్శకాలు రూ పొందించి నిధులు వెంటనే విడుదల చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) జిల్లా ఉపాధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి, కొం డమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేయాలని, జీఓ 101ను సవరించాలని సోమవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టం వచ్చి ఏడాది పూర్తయినా దానిలో లోపాలను సవరించి మార్గదర్శకాలు రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం 2013-14 సంవత్సరానికి *13,910 కోట్లు ఖర్చుచేయాల్సి ఉన్నా వేల కోట్లు విడుదల చేసి *3 వేల కోట్లు మాత్రమే వెచ్చించారని విమర్శించారు. దళిత, గిరిజనుల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించడం సిగ్గుచేటని అన్నారు. అర్హులైన వారందరికీ రుణాలు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు కొండేటి శ్రీను, కోట గోపి, గాదె నర్సింహ, ఎస్. స్వామి, నాగేశ్వర్రావు, జిట్ట నగేష్, దార భిక్షం, ఈసం నగేష్, మల్లయ్య, విజయ్‌కుమార్, వెంకయ్య పాల్గొన్నారు. -
మార్చిలోగా సబ్‌ప్లాన్ పనులు : ఆర్డీ
నూజివీడు, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే పనులను మార్చిలోగా పూర్తిచేయాలని రాజమండ్రి మున్సిపల్ ప్రాంతీయ సంచాలకులు(ఆర్డీ) సొంగా రవీంద్రబాబు పేర్కొన్నారు. నూజివీడు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన మున్సిపాలిటీల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలకు మంజూరైన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ ఏరియాల్లోనే ఖర్చుచేయాలన్నారు. నిబంధనలను ఏమాత్రం అతిక్రమించినా చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. ఒక ఏరియాలో 40శాతం తక్కువ కాకుండా ఎస్సీ, ఎస్టీలుంటేనే ఆ ప్రాంతంలో ఈ నిధులను ఖర్చుచేయాలన్నారు. అంతేగానీ నాలుగైదు గృహాలను చూపించి సబ్‌ప్లాన్ నిధులు ఖర్చుచేయడానికి వీలులేదని తెలిపారు. జిల్లాలో ఆస్తిపన్ను వసూలులో మచిలీపట్నం మున్సిపాలిటీ వెనుకబడి ఉందని, పన్ను వసూలును ముమ్మరం చేయాలని సూచించారు.అలాగే మున్సిపాలిటీల్లో అమలుచేస్తున్న ‘చెత్తపై కొత్త సమరం’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. పారిశుధ్య కార్మికులు ఇంటింటి కీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారా, లేదా అని కమిషనర్లు పరిశీలించాలని సూచించారు. తడిచెత్తను, పొడిచెత్తను వేరువేరుగా ఉంచేలా ప్రజలను చైతన్యం చేయాలని చెప్పారు. అడ్వాన్సులింకా పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలు వాటి వసూలుపై దృష్టి సారించి బకాయిలు లేకుండా చూడాలని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ. 2.40కోట్ల ఆస్తిపన్ను బకాయిలున్నాయన్నారు. వీటిలో గతేడాది బకాయి రూ.1.40కోట్లు కాగా, ఈ ఏడాది బకాయి రూ.1కోటి ఉందన్నారు. అలాగే బడ్జెట్ తయారీ, అప్రూవల్ విషయంలో మున్సిపల్ కమిషనర్లు నిర్లక్ష్యంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో తిరువూరు మున్సిపాలిటీ మినహా, మరే మున్సిపాలిటీ ఇంతవరకు బడ్జెట్‌ను స్పెషల్ఆఫీసర్తో అప్రూవల్ ఎందుకు చేయించలేదని నిలదీశారు. 15వతేదీకల్లా బడ్జెట్ అప్రూవల్‌ను పూర్తిచేయాలన్నారు. అలాగే కోర్టు కేసులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని, ముఖ్యమైన కోర్టుకేసుల విషయమై ప్రతి శుక్రవారం ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. నూజివీడు, తిరువూరు, నందిగామ, ఉయ్యూరు, గుడివాడ, పెడన, జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
సబ్‌ప్లాన్ నిధులు సద్వినియోగం చేయాలి
గుంటూరు,న్యూస్‌లైన్: సబ్‌ప్లాన్,ఉపాధి హామీ నిధులను సక్రమంగా వినియోగించుకుని దళిత, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డి.డి హనుమంతు కోరారు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో స్థానిక సోషల్ వెల్ఫేర్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం ఁపంచాయతీ పాలనపై ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సురూ. జరిగింది. ఈ సదస్సులో హనుమంతు మాట్లాడుతూ సామాజిక భద్రత పింఛన్లు అందించేందుకు సర్పంచ్‌లు గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో అర్హులైన వారందరికి సామాజిక భద్రత పింఛన్లు అందించేందుకు సర్పంచ్‌లు తోడ్పడాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి పులిపాక రాణి మాట్లాడుతూ దళితులను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరగకుండా చూడాలని సూచించారు. అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వినయకుమార్ మాట్లాడుతూ దళిత బహుజన సర్పంచ్‌లు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించాలని కోరారు. అంటరానితనం, అత్యాచారాలు, కులవివక్షతలేని గ్రామాలను నిర్మించేందుకు సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. ప్రతి మైనర్ పంచాయతీ సర్పంచ్‌కు రూ.15 వేలు, మేజర్ పంచాయతీ సర్పంచ్‌కు రూ.20వేలు గౌరవవేతనం ఇవ్వాలని కోరుతూ సదస్సు తీర్మానించింది. అనంతరం జిల్లాలోని రిజర్వుడు పంచాయతీల నుంచి ఎన్నికైన 95మంది సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి అల్లడి దేవకుమార్, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేళం భాగ్యారావు, జిల్లా అధ్యక్షుడు మల్లెల చిన్నప్ప, ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటి సభ్యులు మేడిద బాబురావు, బి.కోటేశ్వరరావు, సత్తెనపల్లి మార్కెట్‌యార్డు చైర్మన్ వేదాద్రి, ఫార్మా అసోసియేషన్ అధ్యక్షుడు డేగల ప్రభాకరరావు, దళిత బహుజన మహిళా సమాఖ్య నాయకులు సింగవరపు జ్యోతి, పల్లె జ్యోతి, పాగళ్ల ప్రకాశ్, భూపతి సునీల్‌కుమార్, వెలిచర్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాలను సోమవారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకొని అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందాలంటే క్షేత్రస్థాయిలో ప్రచారం అవసరమన్నారు. జలయజ్ఞం, సబ్‌ప్లాన్, బంగారుత ల్లి, వడ్డీలేని రుణాలు, గృహాలు, పింఛన్లు తదితర పథకాలపై జిల్లా వ్యా ప్తంగా ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకతపై కళాబృందాల ద్వారా అవగాహన కల్పించాలని డీపీఆర్వో గోవిందరాజులుకు సూచించారు. మొదటి విడతగా జిల్లాకు వచ్చిన 5 వాహనాల ద్వారా చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో జనవరి 12 వరకూ ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్వతీపురం డివిజనల్ పీఆర్ఓ డి.రమేష్, ఏపీఆర్ఓ ఎస్.జానకమ్మ తదితరులు ఉన్నారు.