సబ్‌ప్లాన్ నిధులు మళ్లించడమేంటి?
మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బోస్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీల సంక్షేమానికి మాత్రమే పూర్తిగా ఖర్చు పెట్టాల్సిన సబ్‌ప్లాన్ నిధులను మండల కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ గదుల ఏర్పాటుకు మళ్లించడం ఏమిటని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జరిగిన చర్చలో బోస్ మాట్లాడుతూ.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధుల్లో రూ.30.79 కోట్లను మండల కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఏర్పాటుకు ఖర్చు పెట్టారని సభ దృష్టికి తీసుకొచ్చారు.
మరో రూ.15.82 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వ కాలేజీ భవనాల నిర్మాణాలకు వినియోగించారన్నారు. 2016-17 బడ్జెట్ ప్రతిపాదనలో సబ్‌ప్లాన్ నిధుల్లో రూ.612 కోట్లు తోటపల్లి రిజార్వాయర్‌కు, మరో రూ. 2,000 కోట్లు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించారన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల ఖర్చు తీరిదేనా? అని ప్రశ్నించారు. దీనికి మంత్రి రావెల జవాబిస్తూ, సభ్యులు సాంఘిక సంక్షేమశాఖ గురించి ప్రశ్న అడిగి సబ్‌ప్లాన్ గురించి మాట్లాడుతున్నారని, దానిపై ఇంకోసారి చర్చిద్దామన్నారు.
స్కాలర్‌షిప్ చార్జీలు పెంచుతాం..: పెరిగిన ధరల నేపథ్యంలో హాస్టల్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ చార్జీలను 10-15% పెంచనున్నట్లు మంత్రి రావెల మండలిలో చెప్పారు.