అరకొర వైద్యసేవలే గతి.. | PARVATHIPURAM sub-plan shortage of medical staff | Sakshi
Sakshi News home page

అరకొర వైద్యసేవలే గతి..

Published Sun, Mar 22 2015 3:05 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

PARVATHIPURAM sub-plan shortage of medical staff

 పార్వతీపురం :పార్వతీపురం సబ్-ప్లాన్ మండలాల్లో వైద్య సిబ్బంది సరిపడా లేకపోవడంతో గిరిజనులకు అరకొర వైద్యసేవలే అందుతున్నాయి. ప్రస్తుతం వేసవిలో రోగాలు విజృంభిస్తున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. పీహెచ్‌సీల్లో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేరని, ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా అధికారులు, పాలకులకు తెలియజేసినా ఫలితం లేకపోయిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి సిబ్బందికి కూడా వాహనాలు, క్వార్టర్‌‌స లేవు. దీంతో వారు కూడా మైదాన ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు సంచి వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోంది.
 
  పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, మక్కువ, పాచిపెంట, సాలూరు, తదితర మండలాల్లో 20 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీలు, ఎనిమిది 24 గంటల ప్రసూతి కేంద్రాలు, 119 సబ్-సెంటర్లున్నాయి. వీటిలో దాదాపు 616 మంది వైద్యాధికారులు, వివిధ రకాల సిబ్బంది ఉండాల్సి ఉంది. అయితే ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు, సిబ్బంది 275 మంది ఉండగా, 205 మంది వైద్యాధికారులు, సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇంకా  136 పోస్టులు ఖాళీలున్నాయి. ఇందులో ప్రధానంగా చినమేరంగి సబ్ సెంటర్‌కు ఒక సివిల్ సర్జన్  స్పెషలి్‌స్ట్ పోస్టు మంజూరు కాగా అవి ఖాళీగానే ఉన్నాయి. భద్రగిరిలో రెండు డిప్యూటీ సివిల్‌సర్జన్లు, తాడికొండ, భద్రగిరిలో చెరో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ కాలేదు. కురుపాం, చినమేరంగిలలో చెరో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
 
  ఇక ఐటీడీఏ పరిధిలో 24 సూపర్‌వైజర్ పోస్టులు, కురుపాం, సాలూరులో మూడు  రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు, చినమేరంగిలో ఒక హెడ్ నర్సు, స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ కాలేదు. భద్రగిరిలో ఒక డీపీఎంఓ పోస్టు ఉండాల్సి ఉండగా అది నేటికీ భర్తీ కాలేదు. 8 హెచ్‌వీలు 37 మంది ఏఎన్‌ఎమ్‌లు, ఐదుగురు సెకెండ్ ఏఎన్‌ఎమ్‌లు, 21మంది ఎంపీహెచ్‌ఏ (మేల్)లు, 11ఏపీఎంఓలు ఖాళీలున్నాయి. డోకిశీల, మొండెంఖల్, కురుపాంలలో నాలుగు ఫార్మాసిస్ట్‌లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్‌లు-3, డార్క్‌రూమ్ అసిస్టెంట్లు-3 పోస్టులు భర్తీకి నోచుకోలేదు. ఇటీవల డీఎంహెచ్‌ఓ కొంతమంది మైదాన ప్రాంతానికి చెందిన వైద్యాధికారులు, సిబ్బందిని గిరిజన ప్రాంతాలకు డిప్యుటేషన్‌పై వేశామని ప్రకటించారు.
 
 అయితే వారు కూడా సక్రమంగా రావడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయా పీహెచ్‌సీలకు అంబులెన్స్‌లు, ఆస్పత్రులకు ప్రహరీలు, వైద్యాధికారులకు, సిబ్బందికి క్వార్టర్లు లేక నానాయాతన పడుతున్నారు. వీటితో పాటు ఇన్వెర్టర్లు, ఫ్రిజ్‌ల సదుపాయం  లేక మందులు నిల్వ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయి వైద్యసిబ్బందిని నియమించాలని గిరిజనులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement