వాడివేడీగా జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం | GHMC General Meeting | Sakshi
Sakshi News home page

వాడివేడీగా జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం

Published Sun, Jun 22 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

వాడివేడీగా జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం

వాడివేడీగా జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం

  •      సబ్‌ప్లాన్ అమలు తీరుపై గుర్రు
  •      వాడివేడీగా జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం
  •      ప్రధాన సమస్యలను ప్రస్తావించిన సభ్యులు
  •      అభివృద్ధి పనుల్లో జాప్యంపై నిలదీత
  • సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం వాడివేడీగా జరిగింది. పలు సమస్యలపై సభ్యులు అధికారులపై మండిపడ్డారు. నిధులున్నా పనులు చేపట్టడం లేదంటూ నిలదీశారు. నగరంలో అక్రమ కట్టడాలు పెరిగినా పట్టించుకునే వారు లేదని.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు సాగక పోయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఏ అధికారికి ఏ అధికారముందో తెలియదని, ఏ ఫైలు వచ్చినా తీవ్ర జాప్యం జరుగుతుందంటూ తూర్పారబట్టారు. ఇలా ఆద్యంతం పలు సమస్యలపై కౌన్సిల్ సమావేశం గరంగరంగా సాగింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది.
     
    సబ్‌ప్లాన్‌పై గరంగరం

    ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో జీహెచ్‌ఎంసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారని, బడ్జెట్‌లో కేటాయింపులకే పరిమితమవుతున్నారని పలువురు కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. శనివారం జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పైనే తొలుత చర్చ ప్రారంభించాలని అన్ని పార్టీల సభ్యులు పట్టుబట్టారు. అజెండాలోని అంశాల వారీగా చర్చను చేపడదామని సభాధ్యక్షుడు మేయర్ చెప్పినా వినిపించుకోకపోవడంతో సబ్‌ప్లాన్‌పైనే తొలుత చర్చను ప్రారంభించారు.

    జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో ఎస్సీలకు రూ.260 కోట్లు, ఎస్టీలకు రూ.94 కోట్ల కేటాయింపులు చూపినా అందులో రూపాయి కూడా ఖర్చు చేయలేదని పలువురు ఆక్షేపించారు. నగరంలో ఎన్నో మురికివాడలున్నాయని, అక్కడుంటున్న ఎస్సీ, ఎస్టీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించుకోవాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ సూచించారు. ఇది చాలా సున్నితమైన అంశమని, కచ్చితంగా అమలు చేయాలన్నారు.

    అధికారుల అశ్రద్ధ కారణంగా గతంలో మురికి వాడల అభివృద్ధికి అందిన దాదాపు రూ.800 కోట్ల నిధులు కూడా వినియోగించుకోలేకపోయారని గుర్తుచేశారు. ఈ అంశాన్ని లేవనెత్తిన మెట్టుగూడ కార్పొరేటర్ ఎమ్మార్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సబ్‌ప్లాన్ నిధులు తన డివిజన్‌లో పైసా కూడా వినియోగించలేదన్నారు. ఈ నిధులు చట్టబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు.

    ఈ పథకాన్ని అమలు చేయని అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు వెంకటరమణ, కృష్ణ తదితరులు డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వివిధ పన్నుల రూపేణా కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నా.. ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేయడం లేదని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ పక్ష నాయకుడు దిడ్డి రాంబాబు, టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ పక్ష నాయకుడు బంగారి ప్రకాశ్, పలువురు కార్పొరేటర్లు అధికారుల తీరును ప్రశ్నించారు. వీటిని అమలు చేసే బాధ్యత ఏ విభాగానిదో స్పష్టం చేయాలన్నారు.

    గత ఏడాది రూ.10 కోట్లు ఖర్చు చేశామని అధికారులు సభకు తప్పుడు సమాచారమిచ్చారంటూ వారు మండిపడ్డారు. ముస్లింలకు కూడా సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని ఎంఐఎం కార్పొరేటర్ అలీంబేగ్ కోరారు. కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పందిస్తూ, స్థానిక సంస్థలో నేరుగా దీన్ని అమలు చేసేందుకు లింక్ ఉండదని, ఇతర శాఖల నిధులు కూడా రావాల్సి ఉంటుందన్నారు. అమలుకు ఒక ప్రత్యేక విభాగ అధిపతిని నియమించాల్సి ఉందన్నారు.

    ఈ ఏడాది పకడ్బందీగా అమలు చే సేందుకు కమిటీని వేసి మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జనాభా 40 శాతం కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో దీన్ని అమలు చేస్తే బాగుంటుందని కమిషనర్ సూచించగా కొందరు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు డివిజన్‌ను కాకుండా బస్తీని పరిగణనలోకి తీసుకోవాలని సభ్యులు సూచించారు. మేయర్ జోక్యం చేసుకుని ఈ అంశంపై తీర్మానం చేసి సబ్‌ప్లాన్ చర్చను ముగించారు.

    పండుగల సందర్భంగా నిధులివ్వండి..

    రంజాన్, బోనాలు పండుగల సందర్భంగా ప్రార్థన మందిరాల వద్ద పనులు చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించినందున ప్రత్యేక నిధులు కేటాయించాలని బీజేపీ కార్పొరేటర్ ఆలె జితేందర్ డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినందున, నిధులున్నందున తగినన్ని కేటాయించాలని ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్ కోరారు. నామినేషన్ల పద్ధతిపై వెంటనే పనులివ్వాలని తలసాని సూచించారు. ఆయా పనుల కు జీహెచ్‌ఎంసీ, జలమండలి మధ్య సమన్వయం ఉండాలన్నారు.

    ఏ ఒక్క పనీ జరగడం లేదు..

    జీహెచ్‌ఎంసీలో ఎవరెవరికి ఏయే అధికారాలున్నాయి.. అనే అంశంపై చర్చ సందర్భంగా కమిషనర్ జోనల్, అడిషనల్ కమిషనర్లకు అధికారాలివ్వకుండా వ్యవహరిస్తున్నారని, ప్రతిదానికీ ‘స్పీక్, డిస్కస్’ అని రాస్తుండటంతో ఏ ఒక్కపనీ జరగడం లేదని సభ్యులు ఆరోపించారు. ఏవైనా విభాగాలను తొలగించేటప్పుడు కానీ, ఇతర విధుల్లో నియమిస్తున్నప్పుడు కానీ పాలకమండలికి సమాచారమివ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

    టీ అండ్ టీ విభాగం రద్దు,  ఇతర విభాగాల వారిని పన్ను వసూళ్లకు నియమించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందుకు కమిషనర్ సోమేశ్‌కుమార్ బదులిస్తూ..  తగిన సమాచారం లేని మూడు, నాలుగు ఫైళ్లకు మాత్రమే స్పీక్, డిస్కస్ అని రాస్తున్నాం తప్ప మిగతావన్నీ ఏ రోజువి ఆ రోజే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఎక్కడా పనులు ఆగడంలేదన్నారు. గడచిన నాలుగు సంవత్సరాల పనులు, ఈ సంవత్సరం పనులను పోల్చి చూసినా వాస్తవాలు తెలుస్తాయన్నారు. పనులకు మంజూరైన నిధులు, ఖర్చు చేసిన వివరాలు నెలవారీగా చూసినా గతంలోకంటే ఈసారి 20 శాతం ఎక్కువే జరిగాయన్నారు.

    జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. కమిషనర్‌గా తాను కొత్త ప్రాజెక్టులు ప్రవేశపెట్టానో లేదో ఆ అంశాన్ని లేవనెత్తిన వారు ఆత్మవిమర్శ చేసుకుంటే అవగతమవుతుందన్నారు. కొన్ని అంశాలు పాలక మండలికి తెలియజేయకపోవడం అనేది తెలియక జరిగిన పొరపాటు తప్ప కావాలని చేసింది కాదన్నారు. ఈ చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులు పలువురు వాకౌట్ చేశారు.
     
    పోస్టుల భర్తీ ఏదీ?
     
    జీహెచ్‌ఎంసీకి 2,600 పోస్టులు మంజూరైనా నియామకాలు జరగలేదన్న ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ నజీరుద్దీన్ ప్రశ్నకు కమిషనర్ బదులిస్తూ, వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం వేరైనందున ఈ పోస్టుల విషయాన్ని ఇటీవల సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లానని, జేఎన్‌టీయూ ద్వారా జీహెచ్‌ఎంసీయే నియామకాలు చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరినట్టు తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే సీఎం నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు.
     
    రహదారుల విస్తరణలో జాప్యమెందుకు?
     
    భూసేకరణ జరగనుందున పలు రహదారుల విస్తరణ ముందుకు జరగడం లేదని పలువురు సభ్యులు ప్రస్తావించారు. ఈ అంశంపై మేయర్ మాజిద్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఆర్‌పీఎఫ్ మార్గంలో భూ సేకరణ పూర్తయినా, కాలేదని ఎందుకు చెప్పారంటూ పలువురు సభ్యులు నిలదీశారు. నష్టపరిహారం పొందినవారు కూడా ఆ ప్రాంతాలను ఖాళీ చేయకపోవడం తమ దృష్టికి వచ్చిందని, కోర్టు వివాదాల్లో 108 కే సులున్నాయని కమిషనర్ చెప్పారు. నెలా రెండు నెలల్లోగా వీటిలో చాలా వరకు క్లియర్ చేస్తామన్నారు.
     
    అక్రమ కట్టడాలపై..

    అక్రమ కట్టడాల విషయంలో అధికారులు తగుచర్యలు తీసుకోవడం లేరని సభ్యుడు దిడ్డి రాంబాబు తదితరులు అధికారుల తీరును ఆక్షేపించారు. ఇరవై గజాల స్థలంలో ఇళ్లు కట్టుకున్నవారిపై ప్రతాపం చూపుతున్న అధికారులు పెద్ద భవంతుల అక్రమ నిర్మాణదారుల జోలికి వెళ్లడం లేదని విమర్శించారు. బిల్డింగ్ కమిటీలో ఇంజనీర్లను కూడా భాగస్వాములను చేయాలని మరో సభ్యుడు సింగిరెడ్డి కోరారు. దశల వారీగా ఇస్తున్న అనుమతులతో అక్రమాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్సీ ప్రభాకర్ చెప్పారు.
     
    ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి..

     
    జీహెచ్‌ఎంసీలోని కాంట్రాక్టర్లు సకాలంలో పనులు  చేయనందున పలు సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు సభ దృష్టికి తెచ్చారు. పనులు చేయించుకునేందుకు వారి కాళ్లు పట్టుకోవాల్సి వస్తోందని టీడీపీ కార్పొరేటర్ సుమలతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ల కబంధహస్తాల్లో చిక్కుకుందని బంగారు ప్రకాశ్ ఆరోపించారు. పనులు చేయని వారిని బ్లాక్ లిస్టులోపెట్టి కొత్తవారిని ప్రోత్సహించాలన్నారు. ఒకరికే ఎక్కువ పనులివ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని కమిషనర్ బదులిచ్చారు. పనులు త్వరితగతిన జరిగేందుకు నెలకోసారైనా కార్పొరేటర్లతో సమీక్ష సమావేశాలు జరపాలని నిర్ణయించినట్టు చెప్పారు. సమావేశంలో ఇంకా ఎమ్మెల్సీలు జాఫ్రి, వెంకటరావు, ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు.
     
    ఎన్నికల శోభ..

    జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం సందర్భంగా ‘ఎన్నికల కళ’ కనిపించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్‌అఫీషియో సభ్యుల హోదాలో సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. త్వరలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నందున కార్పొరేషన్‌లో తమ జెండా ఎగుర వేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నట్టుగా ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు సందడి చేశారు.

    వారిలో కొందరు తమ వాణి వినిపించారు. సభలో పాల్గొన్నవారిలో ఎంపీలు బండారు దత్తాత్రేయ, సీహెచ్ మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, జి.సాయన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జాఫర్‌హుస్సేన్, మాగంటి గోపీనాథ్, కౌసర్ మొహియుద్దీన్, టి.ప్రకాశ్‌గౌడ్, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఆరెకపూడి గాంధీలున్నారు. ఆయా పార్టీల నుంచి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్లు సభకు గులాబీ కండువాలతో హాజరయ్యారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన యూసుఫ్‌గూడ కార్పొరేటర్ మురళీగౌడ్ ‘జై తెలంగాణ’ అంటూ సభలోకి వచ్చారు.

    సభా గౌరవం పాటించాలి: దత్తాత్రేయ

    సర్వసభ్య సమావేశం ఉదయం 10 గంట లకని ఆహ్వానం పంపడంతో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ నిర్ణీత వ్యవధికన్నా ముందుగానే జీహెచ్‌ఎంసీకీ చేరుకున్నారు. అప్పటికీ చాలామంది అధికారులు రాకపోవడాన్ని గుర్తించారు. అనంతరం స మావేశంలో ప్రసంగిస్తూ.. జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశమంటే హూందాగా వ్యవహరించి సభా గౌరవాన్ని కాపాడాలని ఆయన సూచించారు.
     
    తీర్మానాలే అధికం..

    సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో మేయర్ మాజిద్ హుస్సేన్ తనదైన శైలిలో పలు తీర్మానాలు చేయించారు. ఆయా అంశాలపై చర్చ సందర్భంగా సభ్యుల నుంచి వెలువడిన ప్రశ్నలకు స్పందిస్తూ మేయర్ తీర్మానం చేద్దామంటూ ప్రకటించారు. ఇలా ఒకటి కాదు.. రెండుకాదు ఏకంగా ఎనిమిది తీర్మానాలు చేశారు. అన్నింటినీ సభ ఏకగ్రీవంగా తీర్మానించిందని ప్రకటించారు. సభ్యుల ప్రశ్నలకు.. అధికారుల సమాధానాలకు మధ్య రచ్చ జరగకుండా మధ్యేమార్గంగా తీర్మానాలతో సభ్యులను శాంతింపచేశారు.
     
    ఇవీ తీర్మానాలు..
    2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేసేందుకు మేయర్ నేతృత్వంలో డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్లతో కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ తగిన మార్గదర్శకాలు రూపొందించి నిధుల వినియోగం తీరును పర్యవేక్షిస్తుంది.
     
    సబ్‌ప్లాన్‌కు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ బడ్జెట్ నుంచి ఎస్సీలకు 16.2 శాతం (రూ.260.04 కోట్లు), ఎస్టీలకు 6.6 శాతం (రూ.94.04 కోట్లు)నిధులతో ఎస్సీ, ఎస్టీలుంటు న్న ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్పొరేటర్ల ప్రతిపాదనల మేరకు ఈ పనులు చేపట్టాలి.
         
    బోనాలు, రంజాన్ పండుగల సందర్భంగా ఆయా ప్రార్థనాలయాల్లో, వాటి పరిసరాల్లో జీహెచ్‌ఎంసీ నిధులతో పనులు చేసేందుకు తీర్మానం చేశారు. తమ వార్డుల్లో చేపట్టిన పనుల గురించి కార్పొరేటర్లు పాలకమండలికి తెలియజేయాలి. పనులకు వీలైనంత  త్వరగా అంచనాలు రూపొందిం చాలి.
         
    ఆస్తిపన్ను వసూళ్లలో లక్ష్యాలు సాధించిన బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, వాల్యుయేషన్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లకు ప్రోత్సాహకాలు.
         
    రహదారి విస్తరణ పనులకు ఆటంకంగా మారిన నిర్మాణాల తొలగింపు. సదరు భవనాలకు సంబంధించి స్టాండింగ్ కమిటీ ద్వారా నష్టపరిహారం మంజూరైన వాటిని 15 రోజుల్లోగా తొలగించాలి. విద్యుత్ స్తం భాల తొలగింపు పనులు 15 రోజుల్లో పూర్తిచేయాలి.
         
    కోర్టు కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం కనబరచిన స్టాండింగ్ కౌన్సిళ్లపై చర్యలు లేదా బాధ్యతల నుంచి  తొలగింపు. కేసుల పరి ష్కారానికి స్టాండింగ్ కమిటీ ఆమోదంతో స్పెషల్ స్టాండింగ్ కౌన్సెళ్లను తీసుకోవాలి.
         
    రెండు విడతల్లో 2,600 పోస్టుల భర్తీకి ఆర్థిక విభాగం అనుమతిస్తూ ఉత్తుర్వులు జారీ అయి ఏడాది దాటినా నియామకాలు జరగనందున, జీహెచ్‌ఎంసీ తరఫున నెలరోజు ల్లోగా వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషనర్‌కు సూచన.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement