Mohammad Majid Hussain
-
మేయర్‌ను కలిసిన ఐఐపీఏ ప్రతినిధులు
సాక్షి, సిటీబ్యూరో: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఐఐపీఏ, న్యూఢిల్లీ) ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ సుజిత్‌కుమార్ ప్రుసేథ్ నేతృత్వంలోని 9 మంది ప్రతినిధుల బృందం బుధవారం మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్‌లను కలిసింది. జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న రూ. 5కే భోజనం, పేదబస్తీ ప్రజలకు శుద్ధజ లం, ఆస్తిపన్ను, డిజిట ల్ బర్త్ సర్టిఫికెట్లు, జీవవైవిధ్య విభాగం పనులు తదితర అంశాల గురించి వీరు మేయర్, డిప్యూటీ మేయర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల గురించి పూర్తి వివరాలందజేయాలని , తాము కూడా ఆయా ప్రాంతాల్లో వీటిని అమలు చేస్తామని ప్రతినిధులు కోరారు. వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రాథమ్యాల కనుగుణంగా పనులను పూర్తిచేయవచ్చునని ప్రతినిధుల బృందం అభిప్రాయపడింది. ఇక్కడి పనితీరు చాలా బాగుందని కితాబిచ్చింది. -
బాధ్యత మరచిభారమా?
ముందు పక్కాగా ఏర్పాట్లు చేయండి ప్రజలకు అవగాహన కల్పించండి అప్పుడే కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు ‘లిట్టర్ ఫ్రీ’పై మేయర్ అభ్యంతరం నగరంలోని ఎంపిక చేసిన మార్గాలను ‘చెత్త రహిత’గా తీర్చిదిద్దాలని... నిబంధనలు ఉల్లంఘించే వారిపై శుక్రవారం నుంచి పెనాల్టీలు విధించాలని జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయంపై సాక్షాత్తూ మేయరే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరైన ఏర్పాట్లు చేయకుండా ప్రజలపై భారం మోపడం తగదని అంటున్నారు. దీన్ని స్టాండింగ్ కమిటీ ఆమోదించలేదని చెబుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం దీనికి స్టాండింగ్ కమిటీ ఆమోదం అవసరం లేదని అంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకుండా, అవసరమైనన్ని ప్రదేశాల్లో తగినన్ని డంపర్బిన్లు ఏర్పాటు చేయకుండా ప్రజలపై పెనాల్టీల భారం వేయడం తగదని మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. అన్ని లైన్లు, బైలైన్లలో అవసరమైనన్ని చెత్త రిక్షాలను అందుబాటులోకి తీసుకురాకుండా జీహెచ్ఎంసీ కఠిన నిర్ణయాలు తీసుకోవడం తగదని అన్నారు. చెత్తరహిత రహదారులు (లిట్టర్ ఫ్రీ రోడ్స్) పథకం అమలులో భాగంగా ఎంపిక చేసిన మార్గాల్లో చెత్త వేసే వారికి శుక్రవారం నుంచి పెనాల్టీలు విధించనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించిన నేపథ్యంలో మేయర్ పైవిధంగా స్పందించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉందన్నారు. జీహెచ్ఎంసీ తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాక.. చెత్త రహిత వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించాక పెనాల్టీలు విధించవచ్చునన్నారు. అవేమీ లేకుండా పెనాల్టీలు తగవన్నారు. గ్రేటర్లో 8 వేల కి.మీ.కు పైగా రహదారులు ఉండగా, కేవలం 23 కి.మీ.కే దీన్ని పరిమితం చేయడం తగదన్నారు. గ్రేటర్‌లోని అన్ని రహదారులు, ప్రాంతాలను లిట్టర్ ఫ్రీగా చేయాల్సి ఉందన్నారు. రోడ్లన్నిటిపైనా చెత్తాచెదారాలు లేకుండా చూడాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీదేనన్నారు. జీహెచ్ఎంసీ మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. బాధ్యతలు విస్మరించి, ప్రజలపై భారం మోపాలనుకోవడం తగదన్నారు. స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకోలేదు లిట్టర్ ఫ్రీ రోడ్స్‌పై స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదని మేయర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీలో ఏదైనా కార్యక్రమం అమలు చేయాలంటే విధాన నిర్ణయం తీసుకునే అధికారం స్టాండింగ్ కమిటీకే ఉందని గుర్తు చేశారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులే విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ పరోక్షంగా అధికారుల నిర్ణయాన్ని ఆక్షేపించారు. కేవలం సెంట్రల్ జోన్లోనే కాకుండా జీహెచ్ఎంసీలోని అన్ని జోన్లను, ప్రాంతాలను చెత్త రహితంగా చేయాల్సి ఉందని చెప్పారు. దీనిపై తొలుత ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కేవలం పత్రికా ప్రకటనలతో అమలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. అధికారులు స్టాండింగ్ కమిటీకి జవాబుదారీగా వ్యవహరించాలని హితవు పలికారు. వారు అమలు చేయబోయే ముందు కమిటీ ఆమోదం పొందాలని మేయర్ స్పష్టం చేశారు. ఒక వేళ అధికారులు ఈ విషయాలు పట్టించుకోకపోతే తగు చర్యల కోసం ప్రభుత్వానికి రాస్తామన్నారు. కమిషనరూ సభ్యుడే: కమిషనర్‌తో మీకు విబేధాలున్నాయా అన్న ప్రశ్నకు మేయర్ బదులిస్తూ.. కమిషనర్ తమ బృందంలోని సభ్యుడే (టీమ్ మెంబరే)నని వ్యాఖ్యానించారు. తమమధ్య ఎలాంటి విబేధాలూ లేవన్నారు. జీహెచ్ఎంసీలోని వారందరూ ఒకే కుటుంబ సభ్యులని అన్నారు. రెండేళ్లకుపైగా తాను మేయర్‌గా కొనసాగుతున్నానని, ఎవరు కమిషనర్‌గా ఉన్నా ఎలాంటి తేడాలు రాలేదని చెప్పారు. కమిషనర్ పనితీరుతో ఎలా ఉన్నారన్న ప్రశ్నకు బదులిస్తూ, ఎవరికీ తాను రేటింగ్ ఇవ్వబోనన్నారు. అది జోనల్ అధికారుల పని: కమిషనర్ లిట్టర్ ఫ్రీ కార్యక్రమం జోనల్ స్థాయి అధికారులు చేపడుతున్నదని జీహెచ్ఎంసీ కమిసనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. మేయర్ సమావేశానంతరం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ అది విధాన నిర్ణయం కాదని తెలిపారు. ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. మేయర్‌కు, తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని తెలిపారు. తన విధులు తాను నిర్వర్తిస్తున్నానని స్పష్టం చేశారు. కొన్ని మార్గాలను తొలుత పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, అక్కడి ఫలితాలను బట్టి నగరమంతా అమలు చేయాలనేదే లక్ష్యమని తెలిపారు. ఎంపిక చేసిన రోడ్లపై చెత్త లేకుండా కాంట్రాక్టు పొందిన సంస్థే పర్యవేక్షిస్తున్నందున ఆ మార్గాల్లో డంపర్బిన్లతో పని లేదన్నారు. రూ.50 లక్షలకు పైబడి రూ.2 కోట్ల వరకు నిధుల మంజూరు బాధ్యత స్టాండింగ్ కమిటీపై ఉంటుందని, చట్టపరమైన, సాధారణంగా జరిగే పనులకు ప్రత్యేకంగా ఆమోదం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. స్టాండింగ్ కమిటీ ఏవైనా ప్రతిపాదిస్తే వాటిని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకుంటామని, ఇంతవరకు తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు. అంశాల వారీగా భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనన్నారు. ఆగస్టు 1నుంచి పెనాల్టీలు విధిస్తున్నట్లు తాను ఎక్కడా పేర్కొనలేదని, లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మీ పేరిట పత్రికా ప్రకటన వెలువడిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆ అంశం గురించి తెలుసుకుంటానన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం సెంట్రల్‌జోన్‌లో ఈపాటికే అమలవుతోందని చెప్పారు. తాను కొత్తగా చేపడుతున్న పథకాలంటూ ప్రత్యేకంగా లేవని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తి చేస్తున్నానని చెప్పారు. ఇది స్పెషల్ డ్రైవ్: డాక్టర్ సత్యనారాయణ, సెంట్రల్ జోన్ కమిషనర్ లిట్టర్ ఫ్రీ పనులు గత ఫిబ్రవరి నుంచే జరుగుతున్నాయని, ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు త గిన చర్యలు తీసుకుంటున్నామని సెంట్రల్ జోన్ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ చెప్పారు. చెత్త వేసే వారికి జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు పెనాల్టీలు కొత్తగా విధిస్తున్నవి కావని, హైదరాబాద్‌ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు స్పెషల్డ్రైవ్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మరికొద్ది రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించాక చర్యలు చేపడతామన్నారు. -
వాడివేడీగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం
సబ్‌ప్లాన్ అమలు తీరుపై గుర్రు వాడివేడీగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రధాన సమస్యలను ప్రస్తావించిన సభ్యులు అభివృద్ధి పనుల్లో జాప్యంపై నిలదీత సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం వాడివేడీగా జరిగింది. పలు సమస్యలపై సభ్యులు అధికారులపై మండిపడ్డారు. నిధులున్నా పనులు చేపట్టడం లేదంటూ నిలదీశారు. నగరంలో అక్రమ కట్టడాలు పెరిగినా పట్టించుకునే వారు లేదని.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు సాగక పోయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఏ అధికారికి ఏ అధికారముందో తెలియదని, ఏ ఫైలు వచ్చినా తీవ్ర జాప్యం జరుగుతుందంటూ తూర్పారబట్టారు. ఇలా ఆద్యంతం పలు సమస్యలపై కౌన్సిల్ సమావేశం గరంగరంగా సాగింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. సబ్‌ప్లాన్‌పై గరంగరం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో జీహెచ్ఎంసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారని, బడ్జెట్లో కేటాయింపులకే పరిమితమవుతున్నారని పలువురు కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. శనివారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పైనే తొలుత చర్చ ప్రారంభించాలని అన్ని పార్టీల సభ్యులు పట్టుబట్టారు. అజెండాలోని అంశాల వారీగా చర్చను చేపడదామని సభాధ్యక్షుడు మేయర్ చెప్పినా వినిపించుకోకపోవడంతో సబ్‌ప్లాన్‌పైనే తొలుత చర్చను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ బడ్జెట్లో ఎస్సీలకు రూ.260 కోట్లు, ఎస్టీలకు రూ.94 కోట్ల కేటాయింపులు చూపినా అందులో రూపాయి కూడా ఖర్చు చేయలేదని పలువురు ఆక్షేపించారు. నగరంలో ఎన్నో మురికివాడలున్నాయని, అక్కడుంటున్న ఎస్సీ, ఎస్టీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించుకోవాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ సూచించారు. ఇది చాలా సున్నితమైన అంశమని, కచ్చితంగా అమలు చేయాలన్నారు. అధికారుల అశ్రద్ధ కారణంగా గతంలో మురికి వాడల అభివృద్ధికి అందిన దాదాపు రూ.800 కోట్ల నిధులు కూడా వినియోగించుకోలేకపోయారని గుర్తుచేశారు. ఈ అంశాన్ని లేవనెత్తిన మెట్టుగూడ కార్పొరేటర్ ఎమ్మార్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సబ్‌ప్లాన్ నిధులు తన డివిజన్లో పైసా కూడా వినియోగించలేదన్నారు. ఈ నిధులు చట్టబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఈ పథకాన్ని అమలు చేయని అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు వెంకటరమణ, కృష్ణ తదితరులు డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వివిధ పన్నుల రూపేణా కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నా.. ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేయడం లేదని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పక్ష నాయకుడు దిడ్డి రాంబాబు, టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ పక్ష నాయకుడు బంగారి ప్రకాశ్, పలువురు కార్పొరేటర్లు అధికారుల తీరును ప్రశ్నించారు. వీటిని అమలు చేసే బాధ్యత ఏ విభాగానిదో స్పష్టం చేయాలన్నారు. గత ఏడాది రూ.10 కోట్లు ఖర్చు చేశామని అధికారులు సభకు తప్పుడు సమాచారమిచ్చారంటూ వారు మండిపడ్డారు. ముస్లింలకు కూడా సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని ఎంఐఎం కార్పొరేటర్ అలీంబేగ్ కోరారు. కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పందిస్తూ, స్థానిక సంస్థలో నేరుగా దీన్ని అమలు చేసేందుకు లింక్ ఉండదని, ఇతర శాఖల నిధులు కూడా రావాల్సి ఉంటుందన్నారు. అమలుకు ఒక ప్రత్యేక విభాగ అధిపతిని నియమించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది పకడ్బందీగా అమలు చే సేందుకు కమిటీని వేసి మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జనాభా 40 శాతం కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో దీన్ని అమలు చేస్తే బాగుంటుందని కమిషనర్ సూచించగా కొందరు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు డివిజన్‌ను కాకుండా బస్తీని పరిగణనలోకి తీసుకోవాలని సభ్యులు సూచించారు. మేయర్ జోక్యం చేసుకుని ఈ అంశంపై తీర్మానం చేసి సబ్‌ప్లాన్ చర్చను ముగించారు. పండుగల సందర్భంగా నిధులివ్వండి.. రంజాన్, బోనాలు పండుగల సందర్భంగా ప్రార్థన మందిరాల వద్ద పనులు చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించినందున ప్రత్యేక నిధులు కేటాయించాలని బీజేపీ కార్పొరేటర్ ఆలె జితేందర్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినందున, నిధులున్నందున తగినన్ని కేటాయించాలని ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్ కోరారు. నామినేషన్ల పద్ధతిపై వెంటనే పనులివ్వాలని తలసాని సూచించారు. ఆయా పనుల కు జీహెచ్ఎంసీ, జలమండలి మధ్య సమన్వయం ఉండాలన్నారు. ఏ ఒక్క పనీ జరగడం లేదు.. జీహెచ్ఎంసీలో ఎవరెవరికి ఏయే అధికారాలున్నాయి.. అనే అంశంపై చర్చ సందర్భంగా కమిషనర్ జోనల్, అడిషనల్ కమిషనర్లకు అధికారాలివ్వకుండా వ్యవహరిస్తున్నారని, ప్రతిదానికీ ‘స్పీక్, డిస్కస్’ అని రాస్తుండటంతో ఏ ఒక్కపనీ జరగడం లేదని సభ్యులు ఆరోపించారు. ఏవైనా విభాగాలను తొలగించేటప్పుడు కానీ, ఇతర విధుల్లో నియమిస్తున్నప్పుడు కానీ పాలకమండలికి సమాచారమివ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీ అండ్ టీ విభాగం రద్దు, ఇతర విభాగాల వారిని పన్ను వసూళ్లకు నియమించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందుకు కమిషనర్ సోమేశ్‌కుమార్ బదులిస్తూ.. తగిన సమాచారం లేని మూడు, నాలుగు ఫైళ్లకు మాత్రమే స్పీక్, డిస్కస్ అని రాస్తున్నాం తప్ప మిగతావన్నీ ఏ రోజువి ఆ రోజే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఎక్కడా పనులు ఆగడంలేదన్నారు. గడచిన నాలుగు సంవత్సరాల పనులు, ఈ సంవత్సరం పనులను పోల్చి చూసినా వాస్తవాలు తెలుస్తాయన్నారు. పనులకు మంజూరైన నిధులు, ఖర్చు చేసిన వివరాలు నెలవారీగా చూసినా గతంలోకంటే ఈసారి 20 శాతం ఎక్కువే జరిగాయన్నారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. కమిషనర్‌గా తాను కొత్త ప్రాజెక్టులు ప్రవేశపెట్టానో లేదో ఆ అంశాన్ని లేవనెత్తిన వారు ఆత్మవిమర్శ చేసుకుంటే అవగతమవుతుందన్నారు. కొన్ని అంశాలు పాలక మండలికి తెలియజేయకపోవడం అనేది తెలియక జరిగిన పొరపాటు తప్ప కావాలని చేసింది కాదన్నారు. ఈ చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులు పలువురు వాకౌట్ చేశారు. పోస్టుల భర్తీ ఏదీ? జీహెచ్ఎంసీకి 2,600 పోస్టులు మంజూరైనా నియామకాలు జరగలేదన్న ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ నజీరుద్దీన్ ప్రశ్నకు కమిషనర్ బదులిస్తూ, వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం వేరైనందున ఈ పోస్టుల విషయాన్ని ఇటీవల సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లానని, జేఎన్టీయూ ద్వారా జీహెచ్ఎంసీయే నియామకాలు చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరినట్టు తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే సీఎం నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. రహదారుల విస్తరణలో జాప్యమెందుకు? భూసేకరణ జరగనుందున పలు రహదారుల విస్తరణ ముందుకు జరగడం లేదని పలువురు సభ్యులు ప్రస్తావించారు. ఈ అంశంపై మేయర్ మాజిద్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ మార్గంలో భూ సేకరణ పూర్తయినా, కాలేదని ఎందుకు చెప్పారంటూ పలువురు సభ్యులు నిలదీశారు. నష్టపరిహారం పొందినవారు కూడా ఆ ప్రాంతాలను ఖాళీ చేయకపోవడం తమ దృష్టికి వచ్చిందని, కోర్టు వివాదాల్లో 108 కే సులున్నాయని కమిషనర్ చెప్పారు. నెలా రెండు నెలల్లోగా వీటిలో చాలా వరకు క్లియర్ చేస్తామన్నారు. అక్రమ కట్టడాలపై.. అక్రమ కట్టడాల విషయంలో అధికారులు తగుచర్యలు తీసుకోవడం లేరని సభ్యుడు దిడ్డి రాంబాబు తదితరులు అధికారుల తీరును ఆక్షేపించారు. ఇరవై గజాల స్థలంలో ఇళ్లు కట్టుకున్నవారిపై ప్రతాపం చూపుతున్న అధికారులు పెద్ద భవంతుల అక్రమ నిర్మాణదారుల జోలికి వెళ్లడం లేదని విమర్శించారు. బిల్డింగ్ కమిటీలో ఇంజనీర్లను కూడా భాగస్వాములను చేయాలని మరో సభ్యుడు సింగిరెడ్డి కోరారు. దశల వారీగా ఇస్తున్న అనుమతులతో అక్రమాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్సీ ప్రభాకర్ చెప్పారు. ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి.. జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్లు సకాలంలో పనులు చేయనందున పలు సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు సభ దృష్టికి తెచ్చారు. పనులు చేయించుకునేందుకు వారి కాళ్లు పట్టుకోవాల్సి వస్తోందని టీడీపీ కార్పొరేటర్ సుమలతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల కబంధహస్తాల్లో చిక్కుకుందని బంగారు ప్రకాశ్ ఆరోపించారు. పనులు చేయని వారిని బ్లాక్ లిస్టులోపెట్టి కొత్తవారిని ప్రోత్సహించాలన్నారు. ఒకరికే ఎక్కువ పనులివ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని కమిషనర్ బదులిచ్చారు. పనులు త్వరితగతిన జరిగేందుకు నెలకోసారైనా కార్పొరేటర్లతో సమీక్ష సమావేశాలు జరపాలని నిర్ణయించినట్టు చెప్పారు. సమావేశంలో ఇంకా ఎమ్మెల్సీలు జాఫ్రి, వెంకటరావు, ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల శోభ.. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం సందర్భంగా ‘ఎన్నికల కళ’ కనిపించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నందున కార్పొరేషన్లో తమ జెండా ఎగుర వేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నట్టుగా ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు సందడి చేశారు. వారిలో కొందరు తమ వాణి వినిపించారు. సభలో పాల్గొన్నవారిలో ఎంపీలు బండారు దత్తాత్రేయ, సీహెచ్ మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, జి.సాయన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జాఫర్‌హుస్సేన్, మాగంటి గోపీనాథ్, కౌసర్ మొహియుద్దీన్, టి.ప్రకాశ్‌గౌడ్, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఆరెకపూడి గాంధీలున్నారు. ఆయా పార్టీల నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్లు సభకు గులాబీ కండువాలతో హాజరయ్యారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన యూసుఫ్‌గూడ కార్పొరేటర్ మురళీగౌడ్ ‘జై తెలంగాణ’ అంటూ సభలోకి వచ్చారు. సభా గౌరవం పాటించాలి: దత్తాత్రేయ సర్వసభ్య సమావేశం ఉదయం 10 గంట లకని ఆహ్వానం పంపడంతో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ నిర్ణీత వ్యవధికన్నా ముందుగానే జీహెచ్ఎంసీకీ చేరుకున్నారు. అప్పటికీ చాలామంది అధికారులు రాకపోవడాన్ని గుర్తించారు. అనంతరం స మావేశంలో ప్రసంగిస్తూ.. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశమంటే హూందాగా వ్యవహరించి సభా గౌరవాన్ని కాపాడాలని ఆయన సూచించారు. తీర్మానాలే అధికం.. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో మేయర్ మాజిద్ హుస్సేన్ తనదైన శైలిలో పలు తీర్మానాలు చేయించారు. ఆయా అంశాలపై చర్చ సందర్భంగా సభ్యుల నుంచి వెలువడిన ప్రశ్నలకు స్పందిస్తూ మేయర్ తీర్మానం చేద్దామంటూ ప్రకటించారు. ఇలా ఒకటి కాదు.. రెండుకాదు ఏకంగా ఎనిమిది తీర్మానాలు చేశారు. అన్నింటినీ సభ ఏకగ్రీవంగా తీర్మానించిందని ప్రకటించారు. సభ్యుల ప్రశ్నలకు.. అధికారుల సమాధానాలకు మధ్య రచ్చ జరగకుండా మధ్యేమార్గంగా తీర్మానాలతో సభ్యులను శాంతింపచేశారు. ఇవీ తీర్మానాలు.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేసేందుకు మేయర్ నేతృత్వంలో డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్లతో కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ తగిన మార్గదర్శకాలు రూపొందించి నిధుల వినియోగం తీరును పర్యవేక్షిస్తుంది. సబ్‌ప్లాన్‌కు అనుగుణంగా జీహెచ్ఎంసీ బడ్జెట్ నుంచి ఎస్సీలకు 16.2 శాతం (రూ.260.04 కోట్లు), ఎస్టీలకు 6.6 శాతం (రూ.94.04 కోట్లు)నిధులతో ఎస్సీ, ఎస్టీలుంటు న్న ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్పొరేటర్ల ప్రతిపాదనల మేరకు ఈ పనులు చేపట్టాలి. బోనాలు, రంజాన్ పండుగల సందర్భంగా ఆయా ప్రార్థనాలయాల్లో, వాటి పరిసరాల్లో జీహెచ్ఎంసీ నిధులతో పనులు చేసేందుకు తీర్మానం చేశారు. తమ వార్డుల్లో చేపట్టిన పనుల గురించి కార్పొరేటర్లు పాలకమండలికి తెలియజేయాలి. పనులకు వీలైనంత త్వరగా అంచనాలు రూపొందిం చాలి. ఆస్తిపన్ను వసూళ్లలో లక్ష్యాలు సాధించిన బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, వాల్యుయేషన్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లకు ప్రోత్సాహకాలు. రహదారి విస్తరణ పనులకు ఆటంకంగా మారిన నిర్మాణాల తొలగింపు. సదరు భవనాలకు సంబంధించి స్టాండింగ్ కమిటీ ద్వారా నష్టపరిహారం మంజూరైన వాటిని 15 రోజుల్లోగా తొలగించాలి. విద్యుత్ స్తం భాల తొలగింపు పనులు 15 రోజుల్లో పూర్తిచేయాలి. కోర్టు కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం కనబరచిన స్టాండింగ్ కౌన్సిళ్లపై చర్యలు లేదా బాధ్యతల నుంచి తొలగింపు. కేసుల పరి ష్కారానికి స్టాండింగ్ కమిటీ ఆమోదంతో స్పెషల్ స్టాండింగ్ కౌన్సెళ్లను తీసుకోవాలి. రెండు విడతల్లో 2,600 పోస్టుల భర్తీకి ఆర్థిక విభాగం అనుమతిస్తూ ఉత్తుర్వులు జారీ అయి ఏడాది దాటినా నియామకాలు జరగనందున, జీహెచ్ఎంసీ తరఫున నెలరోజు ల్లోగా వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషనర్‌కు సూచన. -
పొత్తుపొడుపు!
కాంగ్రెస్- ఎంఐఎంల హైడ్రామా ఆమోదం పొందని మేయర్ మాజిద్ రాజీనామా! జీహెచ్ఎంసీ సమావేశంలో నాటకీయ పరిణామాలు రాజీనామాను అంగీకరించమన్న కాంగ్రెస్, ఎంఐఎంలు అదే బాటలో టీడీపీ, బీజేపీ సాక్షి, సిటీబ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్- ఎంఐఎంలు పొత్తు పెట్టుకోనున్నాయా..? శనివారం జీహెచ్ఎంసీలో జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జీహెచ్ఎంసీ మేయర్ మహ్మద్ మాజిద్‌హుస్సేన్ ఈ నెల 7న తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాని ఆమోదం పొందేందుకు మేయర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఆద్యంతం నాటకీయ పరిణామాల నేపథ్యంలో మేయర్ రాజీనామాను సమావేశం ఆమోదించలేదు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవ్వాల్సిన సమావేశం.. చాలాసేపటి వరకు ప్రారంభం కాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మేయర్ రాజీనామాను ఆమోదించవద్దంటూ అటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కాంగ్రెస్ ముఖ్యులకు, ఇటు ఎంఐఎం అధిష్టానం నుంచి ఎంఐఎం ముఖ్యులకు ఫోన్లు వచ్చాయి. దీంతో మేయర్ చాంబర్లో మాజిద్‌హుస్సేన్(ఎంఐఎం), డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్(కాంగ్రెస్)లతోపాటు ఎంఐఎం ముఖ్యులు, కాంగ్రెస్ ముఖ్యులు దాదాపు గంటన్నరపాటు చర్చించారు. తర్జనభర్జనలు పడ్డారు. దీనికి ముందు సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి తాను ప్రసంగిస్తానని, తన హయాంలో చేసిన పనుల గురించి వివరిస్తానని మేయర్ అధికారులకు చెప్పడంతో.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కుదరదని స్పష్టం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో మాట్లాడారు. ఒకవేళ మేయర్ మాట్లాడితే అనర్హతవేటు పడుతుందని కమిషనర్ చెప్పినట్లు తెలిసింది. ఈ తతంగం జరుగుతుండగానే ఆయా అధిష్టానాల నుంచి ఫోన్లు వచ్చాయి. రెండు పార్టీల నేతల చర్చలు ముగిశాక ఎట్టకేలకు 12.05 గంటలకు మేయర్ సమావేశం హాల్లోకి వచ్చారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా సభ్యులను కోరారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు లేచి రాజీనామాను అంగీకరించమన్నారు. ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ నజీరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆమోదించలేదు కనుక తాము కూడా అంగీకరించబోమన్నారు. అంతకుముందు సభ ప్రారంభం కాగానే టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేయర్‌నుద్దేశించి మాట్లాడుతూ.. మీ రాజీనామాకు కారణాలేంటో చెప్పాలంటూ పట్టుబట్టారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్‌తో మీకున్న సంబంధాలు దెబ్బతిన్నాయా? మరేదైనా కారణం ఉందా? అసలెందుకు రాజీనామా చేస్తున్నారో తమకు తెలియాలన్నారు. ఇప్పుడు రాజీనామాను ఆమోదిస్తే.. ఎన్నికల కోడ్ ఉన్నందున మరో రెండు నెలల దాకా కొత్త మేయర్ ఎన్నిక జరగదని, ఆలోగా నగరం పరమ అధ్వానంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు మేయర్ స్పందిస్తూ తన రాజీనామా లేఖలోనే రాజీనామాకు కారణం తెలిపానని చెబుతుండగా.. టీడీపీ సభ్యులు లేచి అరవడంతో గందరగోళం నెలకొంది. ఇప్పుడు రాజీనామా ఆమోదిస్తే ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు జీహెచ్ఎంసీ బాధ్యతలు నిర్వహించేదెవరంటూ ప్రశ్నించారు. టీడీపీతో పాటు బీజేపీ ఫ్లోర్‌లీడర్ బంగారి ప్రకాశ్, ఆ పార్టీ సభ్యులు సైతం లేచి రాజీనామాకు కారణం కావాలంటూ పట్టుబట్టారు. తీవ్ర గందరగోళం మధ్యే మేయర్ తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరుతూ ప్రకటన చేశారు. ఆయన అది చదువుతుండగానే టీడీపీ, బీజేపీ పక్షాల సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఎంఐఎంలు అంగీకరించనందున తన రాజీనామాను సర్వసభ్య సమావేశం ఆమోదించలేదని ప్రకటించి సభను ముగించారు. మారిన రాజకీయం శనివారం ఉదయం వరకు మేయర్ మాజిద్ రాజీనామా ఆమోదం పొందుతుందనే అందరూ భావించారు. సభ ముగియగానే మేయర్‌తో కలిసి సభ్యులందరు గ్రూప్ ఫొటో దిగడానికి వీలుగా కుర్చీలు, తదితర ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు అరగంటలో సమావేశం ముగుస్తుందని, రాజీనామా ఆమోదానంతరం గ్రూప్ ఫొటో దిగాలని భావించారు. కానీ.. కాంగ్రెస్- ఎంఐఎంల ఆదేశాల మేరకు నిర్ణయం మార్చుకున్నారు. ఆ విషయం తెలిసిన టీడీపీ, బీజేపీలు.. అది తమ ఘనతగా చెప్పుకునేందుకు రాజీనామాను అంగీకరించబోమని వ్యాఖ్యానించాయి. మొత్తానికి తీవ్ర హైడ్రామా నడుమ మేయర్ రాజీనామా ఆమోదానికి నోచుకోకుండా వీగిపోయింది. హై డ్రామా త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కోసమే.. కాంగ్రెస్, ఎంఐఎంలు ఈ హైడ్రామా నడిపించినట్లు తెలుస్తోంది. ఎంఐఎం.. టీఆర్ఎస్తో జతకడితే, హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోనూ తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారనుందని ఆందోళన చెందిన కాంగ్రెస్ అధిష్టానం పావులు కదిపి ఎంఐఎంతో చర్చలు నెరిపినట్లు సమాచారం. కాంగ్రెస్- ఎంఐఎంలకు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మైత్రీబంధం ఉండటం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితోనే విభేదాలు తప్ప ఎంఐఎంకు కాంగ్రెస్‌తో సత్సంబంధాలే ఉన్నాయి. కిరణ్ వైఖరి వల్లే కాంగ్రెస్‌కు మద్దతును ఉపసంహరించుకున్నట్లు ఎంఐఎం కొద్దికాలం క్రితం ప్రకటించింది. అయినప్పటికీ, జీహెచ్ఎంసీలో మాత్రం రెండు పార్టీల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఒప్పందం మేరకే.. కాంగ్రెస్ అభ్యర్థికి మేయర్ పదవి దక్కడానికి వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు మాజిద్ రాజీనామా రోజున ప్రకటించారు. మాజిద్ రాజీనామా ఆమోదం పొందాక మేయర్ పదవి పొందేందు కోసం కాంగ్రెస్‌లోని పలువురు కార్పొరేటర్లు తమ ప్రయత్నాలు తాము చేసుకున్నారు. కాగా, ఎంఐఎంతో సఖ్యతను కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించడంతోపాటు నగరానికి చెందిన ఇద్దరు మంత్రులకు సైతం ఎంఐఎంతో సత్సంబంధాలే ఉన్నాయి. ఎంఐఎంతో చెడితే తమ గెలుపు కూడా కష్టమవుతుందనే తలంపుతో వారు సైతం తమవంతు పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకుంటే.. గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ సీట్లకుగాను 22 సీట్ల దాకా గెలుచుకోవచ్చునని కూడా అంచనాలు వేసినట్లు సమాచారం. వీటన్నింటి దృష్ట్యా.. మేయర్ రాజీనామాను ఆమోదించరాదని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థికి మేయర్ పదవి కట్టబెట్టాలనుకుంటే.. జూన్ తర్వాత ఆ అంశం ఆలోచించవచ్చుననే తలంపుతోనే మేయర్ రాజీనామాను అడ్డుకున్నట్లు సమాచారం. మాజిద్ పోటీపై అయోమయం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకోసమే మాజిద్ తన మేయర్ పదవికి రాజీనామా చేశారని వివిధ పార్టీలు భావించాయి. అనూహ్యంగా మాజిద్ రాజీనామాకు కౌన్సిల్ ఆమోదం లభించకపోవడంతో, ఆయన అసెంబ్లీకి పోటీచేయబోరనే ప్రచారం జరిగింది. మరోవైపు మేయర్‌ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దింపుతారని అంచనా వేసినవారు కూడా ఉన్నారు. మొత్తానికి అసెంబ్లీ/ లోక్‌సభ ఎన్నికల్లో మాజిద్ అభ్యర్థి కానున్నారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. -
హైదరాబాద్ మేయర్ రాజీనామా: మాజిద్ హుస్సేన్
అసెంబ్లీ బరిలో దిగనున్న మాజిద్ హుస్సేన్ సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ మహ్మద్ మాజిద్‌హుస్సేన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు శుక్రవారం సాయంత్రం అందజేశారు. తమ పార్టీ అధిష్టానం ఆదేశానికనుగుణంగా, క్రమశిక్షణగల సైనికునిగా రాజీనామా చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్, ఎంఐఎంల ఒప్పందం ప్రకారం ఎంఐఎంకు చెందిన మేయర్ పదవీకాలం జనవరిలోనే ముగిసింది. అప్పట్లోనే మాజిద్ రాజీనామా చేస్తారని భావించారు. అయితే, ఆయన అదనంగా రెండు నెలలు పదవిలో ఉన్నారు. సాధారణ ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత రాజీనామా చేయడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఆయన సొంత డివిజన్ అహ్మద్‌నగర్ హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉంది. నాంపల్లి నుంచే ఆయన పోటీ చేస్తారనే అంచనాలున్నాయి. కార్వాన్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలకు కూడా మాజిద్ పేరును ఎంఐఎం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క మాజిద్ తరచూ కర్నూలు జిల్లాకు వెళ్తున్నారు. అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకే ఆయన వెళ్తున్నట్లు చెబుతున్నప్పటికీ, అవసరమైతే అక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని సమాచారం. -
పొత్తు.. ఎత్తు
నేడు మేయర్ పదవికి మాజిద్ రాజీనామా కాంగ్రెస్‌తో ఒప్పందం మేరకేనని ప్రకటన ఈ నిర్ణయంపై భిన్న వ్యాఖ్యానాలు అసెంబ్లీకి పోటీ చేసేందుకని ప్రచారం పొత్తులో అధిక లబ్ధి కోసమేనని మరో వాదన సాక్షి, సిటీబ్యూరో : ఎన్నికల షెడ్యూలుతో రాజుకున్న రాజకీయ వేడి క్రమేపీ తీవ్ర మవుతోంది. ఎత్తులు.. పైఎత్తులు.. పొత్తులపై మిత్రపక్షాలు సైతం కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొంది. పొత్తుల్లో భాగంగా అధిక వాటాల కోసం, అదనపు సీట్ల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. అస్మదీయులను వదులుకోలేక నయానో, భయానో, బుజ్జగించో, ‘సామ, దాన, భేద, దండోపాయాల’ చందాన ఎట్టకేలకు తమ పంతం నెగ్గించుకోవాలనే యోచనలో ఆయా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ రాజీనామా చేయనున్నారన్న విషయం గురువారం జీహెచ్ఎంసీలో దావానలంలా వ్యాపించింది. జీహెచ్ఎంసీకి సంబంధించి కాంగ్రెస్-ఎంఐఎంల ఒప్పందంలో భాగంగా గత జనవరిలోనే మేయర్ పదవికి మాజిద్ రాజీనామా చేయాల్సి ఉన్నప్పటికీ.. చేయలేదు. ఎన్నికల షెడ్యూలు కూడా వెలువడటంతో.. జీహెచ్ఎంసీ పాలకమండలికి చివరి సంవత్సరమైన 2014లో కూడా మేయర్‌గా ఆయనే కొనసాగుతారని అం దరూ భావించారు. కానీ ఎన్నికల షెడ్యూలు వెలువడిన మర్నాడే తాను రాజీనామా చేయనున్నట్లు మేయర్ మాజిద్ స్వయంగా వెల్లడించారు. అంతకుముందు.. ఎంఐఎం అధినాయకుడు అసదుద్దీన్ ఒవైసీ.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశం కావడం.. అక్కడ పొత్తులపై చర్చల నేపథ్యంలో.. మాజిద్ రాజీనామా ప్రకటన కలకలం రేపింది. స్నేహబంధంలో భాగంగానే కాంగ్రెస్ అభ్యర్థిని మేయర్‌గా చేసేందుకు రాజీనామా చేయనున్నారని ఒకవైపు.. పొత్తులపై సఖ్యత కుదరనందున ఎంఐఎం కాంగ్రెస్ కూటమిలో భాగంగా దక్కిన మేయర్ పదవిని వదులుకుంటున్నారని మరోవైపు భిన్న ప్రచారాలు సాగాయి. ఎమ్మెల్యే పోటీ కోసం.. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో మాజిద్ హుస్సేన్‌ను నిలబెట్టేందుకే ఎంఐఎం ఆయనను మేయర్ పదవికి రాజీనామా చేయిస్తోందనే ప్రచారం కూడా జరిగింది. మాజిద్‌ను నాంపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పంపే యోచనలో ఎంఐఎం ఉన్నట్లు ఎంతోకాలంగా ప్రచారంలో ఉంది. మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అహ్మద్‌నగర్ డివిజన్ నాంపల్లి నియోజకవర్గంలో ఉండటం అందుకు ఒక కారణం. కాగా, జూబ్లీహిల్స్ నుంచి మాజిద్‌కు టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని మరికొందరు చెబుతున్నారు. సిటీ బలంతో రాష్ట్రంలో ఎదిగేందుకు.. జీహెచ్ఎంసీలో మేయర్ పీఠంపై ఒప్పందం తరహాలోనే రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమల్లోనూ.. మునిసిపాలిటీల్లో సైతం సఖ్యత కోసం ఎంఐఎం చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ నుంచి పూర్తి హామీ లభించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాజీనామా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. నగరంలో తమకున్న బలాన్ని ఆసరా చేసుకున్న ఎంఐఎం.. తెలంగాణ, రాయలసీమల్లోనూ పార్టీని విస్తృతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సిటీలో తమపై ఆధారపడ్డ కాంగ్రెస్‌ను తెలంగాణ, రాయలసీమల్లో తమకు తగిన వాటా కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో వీడని స్నేహబంధం కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు బయట ఎలా ఉన్నా జీహెచ్ఎంసీలో మాత్రం సయోధ్య కొనసాగిస్తునే ఉన్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్లు జైలుకు వెళ్లినప్పటికీ.. తాము కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరించుకున్నట్లు ఒవైసీ ప్రకటించినప్పటికీ.. జీహెచ్ఎంసీలో రెండు పార్టీల మధ్య స్నేహసంబ ంధాలే కొనసాగుతూ వస్తున్నాయి. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ.. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అది ప్రస్ఫుటమైంది. బడ్జెట్ సమావేశంలోనూ రెండు పార్టీలు కలిసిమెలిసే ఉన్నాయి. ఇప్పుడు సైతం ఎంఐఎంను వదులుకునే యోచన కాంగ్రెస్‌కు లేదని తెలుస్తోంది. కాగా, ఎక్కువ సీట్లు.. మునిసిపల్ చైర్మన్లు.. నామినేటెడ్ పోస్టుల కోసం పొత్తులపైనే ఉభయులు ‘కత్తులు’ తీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండుపార్టీల పొత్తు కత్తులు ఏ రూపం దాల్చనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఎంఐఎంకు డి ప్యూటీ మేయర్.. ఒప్పందం మేరకు మాజిద్ రాజీనామాతో కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ అయ్యేట్లయితే.. ఎంఐఎం అభ్యర్థిని డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకుగాను ప్రస్తుత డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్(కాంగ్రెస్) రాజీనామా చేయాలి. డిప్యూటీ మేయర్ రాజీనామాను ఆమోదించే అధికారం మేయర్‌కు ఉండగా.. మేయర్ రాజీనామాను సర్వసభ్యసమావేశం ఆమోదించాలి. అందుకు కనీసం వారం సమయం పడుతుంది. డిప్యూటీ మేయర్ రాజీనామా ఒక్క పూటలోనే అయిపోతుంది. గతంలో కార్తీకరెడ్డి తొలుత రాజీనామా చేసినప్పటికీ.. ఆమె రాజీనామా ఆమోదం పొందడానికి కేవలం ఒకరోజు ముందు మాత్రమే అప్పటి డిప్యూటీమేయర్ జాఫర్‌హుస్సేన్ రాజీనామా చేశారు. ఒప్పందమే అమలైతే.. అదే పరిస్థితి పునరావృతం కానుంది. -
గ్రేటర్ బడ్జెట్ రూ.4599 కోట్లు
కార్పొరేటర్ల ఫండ్ పెంపు కోర్ ఏరియా వారికి రూ. 1.50 కోట్లు.. శివార్లలోనివారికి రూ.2 కోట్లు కొత్త పథకాల్లో పేదలకు రూ. 5కే భోజనం సాక్షి, సిటీబ్యూరో: గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌కు జీహెచ్ఎంసీ ఆమోద ముద్ర వేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 4599 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మెజార్టీ అభిప్రాయానికనుగుణంగా బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు మేయర్ మహ్మద్ మాజిద్‌హుస్సేన్ ప్రకటించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపిస్తామన్నారు. సోమవారం బడ్జెట్‌పై జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష టీ డీపీ, బీజేపీలు సవరణలు కోరగా.. అధికార కూటమిలోని ఎంఐఎం, కాంగ్రెస్‌లు భేషైన బడ్జెట్‌గా అభివర్ణించాయి. ఇటీవల స్టాండింగ్ కమిటీ చేసిన సూచనల కనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందించారు. ప్రజలపై కొత్తగా ఎలాంటి పన్నుల భారం మోపకుండానే కొత్త పథకాలు.. పేదలకుపకరించే స్కీములకు ప్రాధాన్యమిచ్చినట్లు మేయర్ చెప్పారు. యూజర్ చార్జీలు/టాక్సులు లేకుండానే వరుసగా మూడో ఏడాదీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ముదావహంగా ఉందన్నారు. కాగా, ప్రస్తుత పాలకమండలికి ఇది చివరి బడ్జెట్. సమావేశంలో కమిషనర్ సోమేశ్‌కుమార్, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు. కార్పొరేటర్లకు కానుక.. డివిజన్లలో పనుల నిర్వహణకు కార్పొరేటర్ల బడ్జెట్‌ను ప్రస్తుతమున్న రూ.కోటిని పెంచారు. కోర్ ఏరియాలోని కార్పొరేటర్లకు రూ. 1.50 కోట్లు, శివారు ప్రాంతాల్లోని కార్పొరేటర్లకు రూ. 2 కోట్లు వంతున కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అందరికీ కోటిన్నరే ఇవ్వాలని భావిం చినా.. శివారు కార్పొరేటర్ల డిమాండ్‌తో వారికి రూ. 2 కోట్లు కేటాయించారు. వీటిని రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించా రు. ఎన్నికల తరుణంలో, . జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగియనున్నందున ఒకే దఫా మంజూరు చేయాలని ఆయా పార్టీలు కోరాయి. సిటీని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా గృహనిర్మాణం, పేద రిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన, క్లీన్ అండ్ గ్రీన్ అంశాలకు ప్రాధాన్యమిచ్చామన్నారు. 2014-15 బడ్జెట్ ముఖ్యాంశాలు.. స్వీపింగ్ యంత్రాలు: రూ.36 కోట్లు నిరుద్యోగ యువ త, మహిళల స్వయం ఉపాధి శిక్షణ: రూ.18 కోట్లు పాఠశాలల పరిసరాల్లో సదుపాయాల అభివృద్ధి: రూ.11 కోట్లు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని క్రీడాకారులు 500 మందికి స్పోర్ట్స్ ఫెలోషిప్స్ పేదలకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు 400 నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు రూ.20 కోట్లు రోజుకు 15 వేల మంది పేదలకు సబ్సిడీ ధరపై రూ.5కే భోజనం అందించేందుకు రూ. 11 కోట్లు 18 నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు రూ.10 కోట్లు కొత్త ఇంటి నెంబర్ల కార్యక్రమానికి రూ. 10 కోట్లు. 24 నియోజకవర్గాల్లో పేద, మధ్య తరగతి వారి కోసం ఫంక్షన్ హాళ్లకు రూ. 36 కోట్లు. వెయ్యి ప్రాంతాల్లో పబ్లిక్ యూరినల్స్/టాయ్లెట్ల ఏర్పాటుకు రూ. రూ. 25 కోట్లు పార్కుల అభివృద్ధి, కొత్త పార్కుల ఏర్పాటుకు రూ. 45 కోట్లు చెరువులు, ఖాళీ స్థలాల పరిరక్షణకు రూ.55 కోట్లు మీరాలం చెరువు అభివృద్ధికి రూ. 25 కోట్లు ఒక్కో డివిజన్‌కు రూ. 6 కోట్లు చొప్పున శివార్లలో సమగ్ర రహదారుల అభివృద్ధి పనులకు రూ. 300 కోట్లు 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్టేడియం/ స్విమ్మింగ్‌పూల్స్‌కు రూ. 50 కోట్లు సర్కిల్/వార్డు కార్యాలయ భవనాల నిర్మాణానికి, కంప్యూటరీకరణ పనులకు రూ. 57 కోట్లు నగరంలోకి ప్రవేశించే ఎనిమిది మార్గాల్లో ప్రత్యేకంగా గేట్‌వేల ఏర్పాటుకు రూ. 8.40 కోట్లు కేటాయింపు వారసత్వ టూరిజం కారిడార్ల అభివృద్ధికి, వారసత్వ పరిరక్షణకు రూ. 50 కోట్లు కొత్త ప్రాజెక్టులకు రూ. 50 కోట్లు సీసీ, బీటీ రోడ్లు, వరదనీటి కాలువలు, డ్రైనేజీ లైన్ల పనులకు రూ.149.65 కోట్లు కూకట్పల్లి ఆర్ఓబీ వద్ద సర్వీసు రోడ్డు నిర్మాణానికి రూ. 3.20 కోట్లు ఎక్స్‌ప్రెస్‌వేగా ఇన్నర్ రింగ్‌రోడ్డు అభివృద్ధి, ఇతరత్రా పనులకు రూ. 41 కోట్లు రైల్‌నిలయం, సంగీత్, ఈస్ట్‌మారేడ్‌పల్లి వద్ద డ్రెయిన్ పునరుద్ధరణకు రూ. 6.46 కోట్లు కందికల్‌గేట్ వద్ద సౌత్‌జోన్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 12.05 కోట్లు. అభివృద్ధికి అనుగుణంగా పన్నులు పెంచే పథకం (టిఫ్)పై అన్ని పార్టీల ఫ్లోర్లలీడర్లతో సమన్వయ సమావేశం నిర్వహించాక తగు నిర్ణయం తీసుకొంటామని మేయర్ ప్రకటించారు టిఫ్ మినహా స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అన్ని అంశాలను సర్వసభ్య సమావేశం ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. 2013-14 రివైజ్డ్ బడ్జెట్‌కు కూడా ఆమోదం లభించింది. బడ్జెట్ ప్రసంగంలో ‘తెలంగాణ’ బడ్జెట్ సందర్భంగా తెలంగాణ అంశాన్ని మేయర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉమ్మడి రాజధాని కానున్న హైదరాబాద్ నగరం రెండు రాష్ట్రాలకు తగిన సేవలందించాల్సి ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండు రాష్ట్రాల వారికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పెద్ద బాధ్యత జీహెచ్ఎంసీపై ఉందన్నారు. ఇందుకుగాను కేంద్రం తనవంతు నిధులివ్వాలన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా గ్రాంట్లు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మార్గమేర్పడంతో సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ కార్తీకరెడ్డి, దిడ్డి రాంబాబు తదితరులు జై తెలంగాణ నినాదాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణ ఏర్పాటులో తమ పార్టీ వాటా కూడా ఉందంటూ వజీర్ ప్రకాశ్‌గౌడ్ తదితరులు పోటీగా నినదించారు. కుర్చీదిగితే.. వాస్తవం తెలుస్తుంది మేయర్ సీటులో కూర్చుంటే అంతా బాగానే అనిపిస్తుంది. ఇక్కడ (కార్పొరేటర్) స్థానంలో ఉంటే కానీ వాస్తవం బోధపడదు. సర్కిల్‌స్థాయిలో అవసరాల కనుగుణంగా బడ్జెట్ ఉండాలి. వికలాంగులకు కేటాయింపుల్ని రూ.20 కోట్లకు పెంచాలి. - బండ కార్తీకరెడ్డి, మాజీ మేయర్ బడ్జెట్ బాగుంది పన్నుపోటు లేకుండానే భారీ బడ్జెట్‌ను రూపొందించడం బాగుంది. ఆస్తిపన్ను ద్వారా రూ. 1395 కోట్లు, టౌన్‌ప్లానింగ్ ద్వారా రూ. 84 కోట్లు ఖజానాకు చేరతాయి. రోడ్లు, వీధిదీపాలు, ఫుట్‌పాత్‌లకు రూ. 900 కోట్ల కేటాయింపు, ఫంక్షన్‌హాళ్ల ఏర్పాటు యోచన బాగున్నాయి. - రాజ్‌కుమార్, డిప్యూటీ మేయర్ అంకెలు కాదు.. అమలు చేయాలి బడ్జెట్ బ్రహ్మాండం.. నిధులున్నా కానీ, అధికారులు పనులు చేయట్లేదు. వారిపై చర్యలు తీసుకోవాలి. కార్పొరేటర్ల ఫండ్‌ను శివార్లకు రూ. 4 కోట్లు, కోర్ ప్రాంతానికి రూ.3 కోట్లకు పెంచాలి. రూ. 5 భోజన పథకాన్ని రోజూ 50 వేలమందికి అందజేయాలి. పథకం అమలుపై చిత్తశుద్ధి చూపాలి. - దిడ్డి రాంబాబు, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ అంకెల గారడీ ఏటా బడ్జెట్లో 40 శాతం కూడా ఖర్చు చేయట్లేదు. దిగువస్థాయి ప్రజల అవసరాల కనుగుణంగా లేదీ బడ్జెట్. సోలార్ పవర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే జీహెచ్ఎంసీకి విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. అంకెల గారడీ బడ్జెట్‌ను సవరించాలి. - సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ పక్ష నాయకుడు కార్పొరేటర్ల ఫండ్ ఒకేసారివ్వాలి నగర చారిత్రక ఔన్నత్యాన్ని చాటేలా స్వాగతద్వారాల ఏర్పాటు యోచన బాగుంది. కోర్ ఏరియా కార్పొరేటర్లకిచ్చే రూ. 1.50 కోట్ల ఫండ్‌ను రెండు విడతలుగా కాకుండా ఒకేసారి ఇవ్వాలి. పాతబస్తీ అభివృద్ధికి వైఎస్సార్ ప్రకటించిన ప్యాకేజీని అమలు చేయాలి. - నజీరుద్దీన్, ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ బీపీ పెరిగేలా ఉంది భారీ బడ్జెట్ చూస్తే తట్టుకోలేక ఒక్కసారిగా బీపీ పెరిగే అవకాశముంది. ఫైల్ కదలాలంటేనే ఆర్నెళ్లు పడుతోంది. పన్నులు పెంచే యోచన ఉంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. కమిషనర్ తొలుత ప్రతిపాదించిన రూ. 3850 కోట్ల బడ్జెట్‌నే ఆమోదించాలి. - బంగారి ప్రకాశ్, బీజేపీ పక్ష నాయకుడు