హైదరాబాద్ మేయర్ రాజీనామా: మాజిద్ హుస్సేన్
అసెంబ్లీ బరిలో దిగనున్న మాజిద్ హుస్సేన్
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ మహ్మద్ మాజిద్‌హుస్సేన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు శుక్రవారం సాయంత్రం అందజేశారు. తమ పార్టీ అధిష్టానం ఆదేశానికనుగుణంగా, క్రమశిక్షణగల సైనికునిగా రాజీనామా చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్, ఎంఐఎంల ఒప్పందం ప్రకారం ఎంఐఎంకు చెందిన మేయర్ పదవీకాలం జనవరిలోనే ముగిసింది.
అప్పట్లోనే మాజిద్ రాజీనామా చేస్తారని భావించారు. అయితే, ఆయన అదనంగా రెండు నెలలు పదవిలో ఉన్నారు. సాధారణ ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత రాజీనామా చేయడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఆయన సొంత డివిజన్ అహ్మద్‌నగర్ హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉంది. నాంపల్లి నుంచే ఆయన పోటీ చేస్తారనే అంచనాలున్నాయి. కార్వాన్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలకు కూడా మాజిద్ పేరును ఎంఐఎం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క మాజిద్ తరచూ కర్నూలు జిల్లాకు వెళ్తున్నారు. అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకే ఆయన వెళ్తున్నట్లు చెబుతున్నప్పటికీ, అవసరమైతే అక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని సమాచారం.