పొత్తు.. ఎత్తు | Resigned from the post of mayor | Sakshi
Sakshi News home page

పొత్తు.. ఎత్తు

Published Fri, Mar 7 2014 2:20 AM | Last Updated on Sat, Mar 9 2019 4:19 PM

పొత్తు.. ఎత్తు - Sakshi

పొత్తు.. ఎత్తు

  • నేడు మేయర్ పదవికి మాజిద్ రాజీనామా
  •      కాంగ్రెస్‌తో ఒప్పందం మేరకేనని ప్రకటన
  •      ఈ నిర్ణయంపై భిన్న వ్యాఖ్యానాలు
  •      అసెంబ్లీకి పోటీ చేసేందుకని ప్రచారం
  •      పొత్తులో అధిక లబ్ధి కోసమేనని మరో వాదన
  •  సాక్షి, సిటీబ్యూరో : ఎన్నికల షెడ్యూలుతో రాజుకున్న రాజకీయ వేడి క్రమేపీ తీవ్ర మవుతోంది. ఎత్తులు.. పైఎత్తులు.. పొత్తులపై మిత్రపక్షాలు సైతం కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొంది. పొత్తుల్లో భాగంగా అధిక వాటాల కోసం, అదనపు సీట్ల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. అస్మదీయులను వదులుకోలేక నయానో, భయానో, బుజ్జగించో, ‘సామ, దాన, భేద, దండోపాయాల’ చందాన ఎట్టకేలకు తమ పంతం నెగ్గించుకోవాలనే యోచనలో ఆయా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ రాజీనామా చేయనున్నారన్న విషయం గురువారం జీహెచ్‌ఎంసీలో దావానలంలా వ్యాపించింది.
     
    జీహెచ్‌ఎంసీకి సంబంధించి కాంగ్రెస్-ఎంఐఎంల ఒప్పందంలో భాగంగా గత జనవరిలోనే మేయర్ పదవికి మాజిద్ రాజీనామా చేయాల్సి ఉన్నప్పటికీ.. చేయలేదు. ఎన్నికల షెడ్యూలు కూడా వెలువడటంతో.. జీహెచ్‌ఎంసీ పాలకమండలికి చివరి సంవత్సరమైన 2014లో కూడా మేయర్‌గా ఆయనే కొనసాగుతారని అం దరూ భావించారు. కానీ ఎన్నికల షెడ్యూలు వెలువడిన మర్నాడే తాను రాజీనామా చేయనున్నట్లు మేయర్ మాజిద్ స్వయంగా వెల్లడించారు.

    అంతకుముందు.. ఎంఐఎం అధినాయకుడు అసదుద్దీన్ ఒవైసీ.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశం కావడం.. అక్కడ పొత్తులపై చర్చల నేపథ్యంలో.. మాజిద్ రాజీనామా ప్రకటన కలకలం రేపింది. స్నేహబంధంలో భాగంగానే కాంగ్రెస్ అభ్యర్థిని మేయర్‌గా చేసేందుకు రాజీనామా చేయనున్నారని ఒకవైపు.. పొత్తులపై సఖ్యత కుదరనందున ఎంఐఎం కాంగ్రెస్ కూటమిలో భాగంగా దక్కిన మేయర్ పదవిని వదులుకుంటున్నారని మరోవైపు భిన్న ప్రచారాలు సాగాయి.
     
    ఎమ్మెల్యే పోటీ కోసం..
     
    మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో మాజిద్ హుస్సేన్‌ను నిలబెట్టేందుకే ఎంఐఎం ఆయనను మేయర్ పదవికి రాజీనామా చేయిస్తోందనే ప్రచారం కూడా జరిగింది. మాజిద్‌ను నాంపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పంపే యోచనలో ఎంఐఎం ఉన్నట్లు ఎంతోకాలంగా ప్రచారంలో ఉంది. మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అహ్మద్‌నగర్ డివిజన్ నాంపల్లి నియోజకవర్గంలో ఉండటం  అందుకు ఒక కారణం. కాగా, జూబ్లీహిల్స్ నుంచి మాజిద్‌కు టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని మరికొందరు చెబుతున్నారు.
     
    సిటీ బలంతో రాష్ట్రంలో ఎదిగేందుకు..

     
    జీహెచ్‌ఎంసీలో మేయర్ పీఠంపై ఒప్పందం తరహాలోనే రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమల్లోనూ.. మునిసిపాలిటీల్లో సైతం  సఖ్యత కోసం ఎంఐఎం చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ నుంచి పూర్తి హామీ లభించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాజీనామా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. నగరంలో తమకున్న బలాన్ని ఆసరా చేసుకున్న ఎంఐఎం.. తెలంగాణ, రాయలసీమల్లోనూ పార్టీని విస్తృతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సిటీలో తమపై ఆధారపడ్డ కాంగ్రెస్‌ను తెలంగాణ, రాయలసీమల్లో తమకు తగిన వాటా కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
     
    జీహెచ్‌ఎంసీలో వీడని స్నేహబంధం

    కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు బయట ఎలా ఉన్నా జీహెచ్‌ఎంసీలో మాత్రం సయోధ్య కొనసాగిస్తునే ఉన్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లు జైలుకు వెళ్లినప్పటికీ.. తాము కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరించుకున్నట్లు ఒవైసీ ప్రకటించినప్పటికీ.. జీహెచ్‌ఎంసీలో రెండు పార్టీల మధ్య స్నేహసంబ ంధాలే కొనసాగుతూ వస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ.. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అది ప్రస్ఫుటమైంది. బడ్జెట్ సమావేశంలోనూ రెండు పార్టీలు కలిసిమెలిసే ఉన్నాయి. ఇప్పుడు సైతం ఎంఐఎంను వదులుకునే యోచన కాంగ్రెస్‌కు లేదని తెలుస్తోంది. కాగా, ఎక్కువ సీట్లు.. మునిసిపల్ చైర్మన్లు.. నామినేటెడ్ పోస్టుల కోసం పొత్తులపైనే ఉభయులు ‘కత్తులు’ తీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ  రెండుపార్టీల పొత్తు కత్తులు ఏ రూపం దాల్చనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
     
     ఎంఐఎంకు డి ప్యూటీ మేయర్..


     ఒప్పందం మేరకు మాజిద్ రాజీనామాతో కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ అయ్యేట్లయితే.. ఎంఐఎం అభ్యర్థిని డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకుగాను ప్రస్తుత డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్(కాంగ్రెస్) రాజీనామా చేయాలి. డిప్యూటీ మేయర్ రాజీనామాను ఆమోదించే అధికారం మేయర్‌కు ఉండగా.. మేయర్ రాజీనామాను సర్వసభ్యసమావేశం ఆమోదించాలి. అందుకు  కనీసం వారం సమయం పడుతుంది. డిప్యూటీ మేయర్ రాజీనామా ఒక్క పూటలోనే అయిపోతుంది. గతంలో కార్తీకరెడ్డి తొలుత రాజీనామా చేసినప్పటికీ.. ఆమె రాజీనామా ఆమోదం పొందడానికి కేవలం ఒకరోజు ముందు మాత్రమే అప్పటి డిప్యూటీమేయర్ జాఫర్‌హుస్సేన్ రాజీనామా చేశారు. ఒప్పందమే అమలైతే.. అదే పరిస్థితి పునరావృతం కానుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement