గ్రేటర్ బడ్జెట్ రూ.4599 కోట్లు
- కార్పొరేటర్ల ఫండ్ పెంపు
- కోర్ ఏరియా వారికి
- రూ. 1.50 కోట్లు.. శివార్లలోనివారికి రూ.2 కోట్లు
- కొత్త పథకాల్లో పేదలకు రూ. 5కే భోజనం
సాక్షి, సిటీబ్యూరో: గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌కు జీహెచ్‌ఎంసీ ఆమోద ముద్ర వేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 4599 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మెజార్టీ అభిప్రాయానికనుగుణంగా బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు మేయర్ మహ్మద్ మాజిద్‌హుస్సేన్ ప్రకటించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపిస్తామన్నారు. సోమవారం బడ్జెట్‌పై జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష టీ డీపీ, బీజేపీలు సవరణలు కోరగా.. అధికార కూటమిలోని ఎంఐఎం, కాంగ్రెస్‌లు భేషైన బడ్జెట్‌గా అభివర్ణించాయి.
ఇటీవల స్టాండింగ్ కమిటీ చేసిన సూచనల కనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందించారు. ప్రజలపై కొత్తగా ఎలాంటి పన్నుల భారం మోపకుండానే కొత్త పథకాలు.. పేదలకుపకరించే స్కీములకు ప్రాధాన్యమిచ్చినట్లు మేయర్ చెప్పారు. యూజర్ చార్జీలు/టాక్సులు లేకుండానే వరుసగా మూడో ఏడాదీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ముదావహంగా ఉందన్నారు. కాగా, ప్రస్తుత పాలకమండలికి ఇది చివరి బడ్జెట్. సమావేశంలో కమిషనర్ సోమేశ్‌కుమార్, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు.
కార్పొరేటర్లకు కానుక..
డివిజన్లలో పనుల నిర్వహణకు కార్పొరేటర్ల బడ్జెట్‌ను ప్రస్తుతమున్న రూ.కోటిని పెంచారు. కోర్ ఏరియాలోని కార్పొరేటర్లకు రూ. 1.50 కోట్లు, శివారు ప్రాంతాల్లోని కార్పొరేటర్లకు రూ. 2 కోట్లు వంతున కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అందరికీ కోటిన్నరే ఇవ్వాలని భావిం చినా.. శివారు కార్పొరేటర్ల డిమాండ్‌తో వారికి రూ. 2 కోట్లు కేటాయించారు. వీటిని రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించా రు. ఎన్నికల తరుణంలో, . జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగియనున్నందున ఒకే దఫా మంజూరు చేయాలని ఆయా పార్టీలు కోరాయి. సిటీని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా గృహనిర్మాణం, పేద రిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన, క్లీన్ అండ్ గ్రీన్ అంశాలకు ప్రాధాన్యమిచ్చామన్నారు.
2014-15 బడ్జెట్ ముఖ్యాంశాలు..
స్వీపింగ్ యంత్రాలు: రూ.36 కోట్లు
నిరుద్యోగ యువ త, మహిళల స్వయం ఉపాధి శిక్షణ: రూ.18 కోట్లు
పాఠశాలల పరిసరాల్లో సదుపాయాల అభివృద్ధి: రూ.11 కోట్లు
జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని క్రీడాకారులు 500 మందికి స్పోర్ట్స్ ఫెలోషిప్స్
పేదలకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు 400 నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు రూ.20 కోట్లు
రోజుకు 15 వేల మంది పేదలకు సబ్సిడీ ధరపై రూ.5కే భోజనం అందించేందుకు రూ. 11 కోట్లు
18 నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు రూ.10 కోట్లు
కొత్త ఇంటి నెంబర్ల కార్యక్రమానికి రూ. 10 కోట్లు.
24 నియోజకవర్గాల్లో పేద, మధ్య తరగతి వారి కోసం ఫంక్షన్ హాళ్లకు రూ. 36 కోట్లు.
వెయ్యి ప్రాంతాల్లో పబ్లిక్ యూరినల్స్/టాయ్‌లెట్ల ఏర్పాటుకు రూ. రూ. 25 కోట్లు
పార్కుల అభివృద్ధి, కొత్త పార్కుల ఏర్పాటుకు రూ. 45 కోట్లు
చెరువులు, ఖాళీ స్థలాల పరిరక్షణకు రూ.55 కోట్లు
మీరాలం చెరువు అభివృద్ధికి రూ. 25 కోట్లు
ఒక్కో డివిజన్‌కు రూ. 6 కోట్లు చొప్పున శివార్లలో సమగ్ర రహదారుల అభివృద్ధి పనులకు రూ. 300 కోట్లు
24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్టేడియం/ స్విమ్మింగ్‌పూల్స్‌కు రూ. 50 కోట్లు
సర్కిల్/వార్డు కార్యాలయ భవనాల నిర్మాణానికి, కంప్యూటరీకరణ పనులకు రూ. 57 కోట్లు
నగరంలోకి ప్రవేశించే ఎనిమిది మార్గాల్లో ప్రత్యేకంగా గేట్‌వేల ఏర్పాటుకు రూ. 8.40 కోట్లు కేటాయింపు
వారసత్వ టూరిజం కారిడార్ల అభివృద్ధికి, వారసత్వ పరిరక్షణకు రూ. 50 కోట్లు
కొత్త ప్రాజెక్టులకు రూ. 50 కోట్లు
సీసీ, బీటీ రోడ్లు, వరదనీటి కాలువలు, డ్రైనేజీ లైన్ల పనులకు రూ.149.65 కోట్లు
కూకట్‌పల్లి ఆర్‌ఓబీ వద్ద సర్వీసు రోడ్డు నిర్మాణానికి రూ. 3.20 కోట్లు
ఎక్స్‌ప్రెస్‌వేగా ఇన్నర్ రింగ్‌రోడ్డు అభివృద్ధి, ఇతరత్రా పనులకు రూ. 41 కోట్లు
రైల్‌నిలయం, సంగీత్, ఈస్ట్‌మారేడ్‌పల్లి వద్ద డ్రెయిన్ పునరుద్ధరణకు రూ. 6.46 కోట్లు
కందికల్‌గేట్ వద్ద సౌత్‌జోన్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 12.05 కోట్లు.
అభివృద్ధికి అనుగుణంగా పన్నులు పెంచే పథకం (టిఫ్)పై అన్ని పార్టీల ఫ్లోర్లలీడర్లతో సమన్వయ సమావేశం నిర్వహించాక తగు నిర్ణయం తీసుకొంటామని మేయర్ ప్రకటించారు
టిఫ్ మినహా స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అన్ని అంశాలను సర్వసభ్య సమావేశం ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. 2013-14 రివైజ్డ్ బడ్జెట్‌కు కూడా ఆమోదం లభించింది.
బడ్జెట్ ప్రసంగంలో ‘తెలంగాణ’
బడ్జెట్ సందర్భంగా తెలంగాణ అంశాన్ని మేయర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉమ్మడి రాజధాని కానున్న హైదరాబాద్ నగరం రెండు రాష్ట్రాలకు తగిన సేవలందించాల్సి ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండు రాష్ట్రాల వారికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పెద్ద బాధ్యత జీహెచ్‌ఎంసీపై ఉందన్నారు. ఇందుకుగాను కేంద్రం తనవంతు నిధులివ్వాలన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా గ్రాంట్లు ఇవ్వాలన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు మార్గమేర్పడంతో సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ కార్తీకరెడ్డి, దిడ్డి రాంబాబు తదితరులు జై తెలంగాణ నినాదాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణ ఏర్పాటులో తమ పార్టీ వాటా కూడా ఉందంటూ వజీర్ ప్రకాశ్‌గౌడ్ తదితరులు పోటీగా నినదించారు.
కుర్చీదిగితే.. వాస్తవం తెలుస్తుంది
మేయర్ సీటులో కూర్చుంటే అంతా బాగానే అనిపిస్తుంది. ఇక్కడ (కార్పొరేటర్) స్థానంలో ఉంటే కానీ వాస్తవం బోధపడదు. సర్కిల్‌స్థాయిలో అవసరాల కనుగుణంగా బడ్జెట్ ఉండాలి. వికలాంగులకు కేటాయింపుల్ని రూ.20 కోట్లకు పెంచాలి.
- బండ కార్తీకరెడ్డి, మాజీ మేయర్
బడ్జెట్ బాగుంది
పన్నుపోటు లేకుండానే భారీ బడ్జెట్‌ను రూపొందించడం బాగుంది. ఆస్తిపన్ను ద్వారా రూ. 1395 కోట్లు, టౌన్‌ప్లానింగ్ ద్వారా రూ. 84 కోట్లు ఖజానాకు చేరతాయి. రోడ్లు, వీధిదీపాలు, ఫుట్‌పాత్‌లకు రూ. 900 కోట్ల కేటాయింపు, ఫంక్షన్‌హాళ్ల ఏర్పాటు యోచన బాగున్నాయి.
- రాజ్‌కుమార్, డిప్యూటీ మేయర్
అంకెలు కాదు.. అమలు చేయాలి
బడ్జెట్ బ్రహ్మాండం.. నిధులున్నా కానీ, అధికారులు పనులు చేయట్లేదు. వారిపై చర్యలు తీసుకోవాలి. కార్పొరేటర్ల ఫండ్‌ను శివార్లకు రూ. 4 కోట్లు, కోర్ ప్రాంతానికి రూ.3 కోట్లకు పెంచాలి. రూ. 5 భోజన పథకాన్ని రోజూ 50 వేలమందికి అందజేయాలి. పథకం అమలుపై చిత్తశుద్ధి చూపాలి.
- దిడ్డి రాంబాబు, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్
అంకెల గారడీ
ఏటా బడ్జెట్‌లో 40 శాతం కూడా ఖర్చు చేయట్లేదు. దిగువస్థాయి ప్రజల అవసరాల కనుగుణంగా లేదీ బడ్జెట్. సోలార్ పవర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే జీహెచ్‌ఎంసీకి విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. అంకెల గారడీ బడ్జెట్‌ను సవరించాలి.
- సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ పక్ష నాయకుడు
కార్పొరేటర్ల ఫండ్ ఒకేసారివ్వాలి
నగర చారిత్రక ఔన్నత్యాన్ని చాటేలా స్వాగతద్వారాల ఏర్పాటు యోచన బాగుంది. కోర్ ఏరియా కార్పొరేటర్లకిచ్చే రూ. 1.50 కోట్ల ఫండ్‌ను రెండు విడతలుగా కాకుండా ఒకేసారి ఇవ్వాలి. పాతబస్తీ అభివృద్ధికి వైఎస్సార్ ప్రకటించిన ప్యాకేజీని అమలు చేయాలి.
- నజీరుద్దీన్, ఎంఐఎం ఫ్లోర్‌లీడర్
బీపీ పెరిగేలా ఉంది
భారీ బడ్జెట్ చూస్తే తట్టుకోలేక ఒక్కసారిగా బీపీ పెరిగే అవకాశముంది. ఫైల్ కదలాలంటేనే ఆర్నెళ్లు పడుతోంది. పన్నులు పెంచే యోచన ఉంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. కమిషనర్ తొలుత ప్రతిపాదించిన రూ. 3850 కోట్ల బడ్జెట్‌నే ఆమోదించాలి.
- బంగారి ప్రకాశ్, బీజేపీ పక్ష నాయకుడు