
సాక్షి, విజయవాడ: మంగళవారం విజయవాడలో రెండో రోజు ‘మనపాలన- మీ సూచన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా ఎమ్మెల్యేలు వసంత్ కృష్ణప్రసాద్, మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్నినాని మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలన్ని ప్రజలకి సక్రమంగా అందుతున్నాయి. చక్కటి పాలన అందిస్తున్నారని ప్రజలంతా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై మేథోమధనం చేస్తున్నాం. రైతు భరోసా, రైతులకు 9 గంటల విద్యుత్, జనతా బజార్ల ఏర్పాటు, ధరల స్థిరీకరణ నిధి, కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై చర్చించి సీఎం జగన్ మోహన్ రెడ్డి నివేదిక అందిస్తాం. కృష్ణా జిల్లా రైతు సంఘాల ప్రతినిధులు, లబ్థిదారులతో చర్చించి ప్రభుత్వ పనితీరును మెరుగుపరుచుకుంటాం అని తెలిపారు. (చంద్రబాబుపై హైకోర్టులో పిల్..)
మరోవైపు కరోనా కష్టాల్లోనూ సంక్షేమ పథకాలని కొనసాగిస్తున్న ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం కింద ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా ఆరు మంది నిరుద్యోగులకు వాహనాలు అందజేశారు. లబ్ధిదారులకు మంత్రి పేర్ని నాని పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్నినాని పిలుపునిచ్చారు. బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని స్వశక్తితో అభివృద్ధి చెందాలని నాని ఈ సందర్బంగా లబ్ధిదారులను కోరారు. (శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా.. )