
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఎక్కడ చదివినా వారి ఫీజులను సర్కారే భరించనుంది. ప్రస్తుతం ఉన్నత, సాంకేతిక విద్య అభ్యసించే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అందుబాటులో ఉంది. కానీ ఇది కేవలం రాష్ట్ర పరిధిలోని విద్యా సంస్థల వరకే పరిమితం. సెట్ (కామన్ ఎంట్రన్స్ టెస్ట్) రాసిన తర్వాత కన్వీనర్ కోటాలో వచ్చే సీట్లకు మాత్రమే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తోంది. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కొందరు ఇతర రాష్ట్రాల్లోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నా.. ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల అందులో చేరలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజులను భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ పథకం 2017–18 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చినా.. కేటగిరీల వారీగా విద్యాసంస్థలు, వర్సిటీల పేర్లను పేర్కొంటూ ఎస్సీ అభివృద్ధి శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం తాజాగా ఆమోదించింది.
ఏటా 4 వేల మందికి లబ్ధి
ఇతర రాష్ట్రాల్లో ఉన్నత చదువులపై తెలంగాణ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ సీట్లలో రాష్ట్ర విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మరోవైపు సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సైతం పలు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ.. ప్రఖ్యాత వర్సిటీలు, విద్యా సంస్థల్లో సీట్లు సంపాదిస్తున్నారు. గతేడాది సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి ఏకంగా 260 మంది విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీ, అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ, ట్రిపుల్‌ఐటీ, నిట్ తదితర విద్యా సంస్థల్లో సీట్లు దక్కించుకున్నారు.
విద్యాశాఖ గణాంకాల ప్రకారం పొరుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్న వారి సంఖ్య 20 వేల పైమాటే. వీరిలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దాదాపు 4 వేల మంది ఉంటారని అంచనా. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 230 విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తిస్తుందని, దీనిపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకుడు పి.కరుణాకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment