సంగారెడ్డి జోన్: దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోవడంలేదని దళిత, గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. అందుకు నిరసనగా ఆదివారం జిల్లా కేంద్రంలో మోడీ గో బ్యాక్ అంటూ నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.శనివారం స్థానిక ఐబీ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం మాట్లాడుతూ గుజరాత్ మొదలు దేశంలోని వివిధ ప్రాంతాలలో దళితులపై దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు.
దాడులను నియంత్రించ లేని ప్రధాని జిల్లాలో పర్యటించ వద్దన్నారు. వారి పర్యటనను నిరసిస్తూ ఉదయం పది గంటలకు జిల్లా పరిషత్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపడుతున్నామన్నారు. సమావేశంలో ప్రజా సంఘాల నేతలు అనంతయ్య, అశోక్ కుమార్, లక్ష్మయ్య, మల్లయ్య, దాస్, పుల్‌సింగ్, కెంపుల రాజు, శ్రీనివాస్, వినోద్‌కుమార్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.