రాహుల్, మోదీపైనే మాదిగల ఉద్యమం
నల్లగొండ టౌన్ : కాంగ్రెస్, బీజేపీతోనే పోరాడి ఎస్సీ వర్గీకరణను సాధించుకుంటామని దాని కోసం రాహుల్‌గాంధీ, ప్రధాని నరేంద్రమోదీ పైనే మాదిగల ఉద్యమం కొనసాగుతుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో మాదిగ యూత్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా కమిటీలను పూర్తి చేసుకుని దసరా నాటికి హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో లక్ష మంది మాదిగలతో సభను నిర్వహిస్తామని తెలిపారు.
రాజ్యాంగబద్ధంగా ఏ ఒక్కరూ ప్రాణాలు పొగొట్టుకోకుండా, ఆస్తి నష్టం జరగకుండా, మాదిగల హక్కులను మలిదశ వర్గీకరణ ఉద్యమం విజ్ఞావంతుల ఉద్యమంగా ఉండాలని దీనిలో విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. 20 ఏళ్లుగా జరిగిన ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమం ద్వారా మందకృష్ణ మాదిగ కోట్లాది రూపాయలను దండుకుని మాదిగలను మభ్యపెట్టారని ఆరోపించారు.
ఏబీసీడీ వర్గీకరణ సాధనలో మాదిగలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సాధనలో మాదిగల పాత్ర కీలకమని తెలిపారు. మందకృష్ణ మాదిగ ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోదీతో జతకట్టి నేడు దొంగ జపం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి మాదిగ కుటుంబాలను పరామర్శిస్తున్నారని, కానీ ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సభలో ఏపూరి సోమన్న పాడిన పాటలు ఆహుతులను అకట్టుకున్నాయి. యూత్ జేఏసీ చైర్మన్ పెరిక కరణ్ జయరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు రామదాసు, అంజిబాబు, గ్యార వెంకటేశం, సురేష్‌కుమార్, డాక్టర్ ఏర్పుల యాదగిరి, ఏపూరి సోమన్న, మేడి రమేష్, బిక్షపతి, వీరబాబు, సుదర్శన్, గోవిందరావు, తండు నర్సింహ, విక్రమ్, వినాయకరావు, మాతంగి అమర్, విజయ్, ఏర్పుల శ్రవణ్‌కుమార్, కత్తుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు