సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ
ఒకటి నుంచి నిరుద్యోగ యువతకు శిక్షణ
Published Wed, Jul 20 2016 7:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ
మచిలీపట్నం( చిలకలపూడి ) :
నిరుద్యోగ ఎస్సీ యువతకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి వివిధ అంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. శిక్షణలో ఎక్కువమంది నిరుద్యోగులు ఉపయోగించుకొనేలా వారికి అవగాహన కల్పించాలని ఆయన చర్చి ఫాదర్లను కోరారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో చర్చి ఫాదర్లతో సమావేశం నిర్వహించారు. ఈడీ మాట్లాడుతూ నిరుద్యోగ ఎస్సీ యువతీ, యువకులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఐదు నుంచి పదో తరగతి చదివిన ఎస్సీ యువకులకు వెల్డింగ్, ప్లంబింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, హౌస్ వైరింగ్ తదితర అంశాలల్లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్మీడియట్ చదివిన యువకులకు రెస్టారెంట్లలో హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో శిక్షణ అందిస్తామన్నారు.
సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసినవారికి కాంట్రాక్టర్ ఎంటర్‌పెన్యుర్ డెవలప్‌మెంట్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ అంశంలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ మూడు అంశాలపై అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. వివరాల కోసం ఈ నెల 27న విజయవాడ లయోలా కళాశాలలో జరిగే యువసమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కువ మంది నిరుద్యోగ ఎస్సీ యువతీ, యువకులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చర్చి ఫాదర్లను కోరారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లావణ్య, సీనియర్ అసిస్టెంట్ దుర్గారావు, హోలీ బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ఫౌండర్ వి.జాన్‌భాస్కరరావు, చర్చి ఫాదర్లు పాల్గొన్నారు.
Advertisement