సాక్షి విలేకరిపై టీడీపీ నేత హత్యాయత్నం | TDP leader's murder attempt on sakshi reporter | Sakshi
Sakshi News home page

సాక్షి విలేకరిపై టీడీపీ నేత హత్యాయత్నం

Published Mon, Oct 16 2017 1:43 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

TDP leader's murder attempt on sakshi reporter - Sakshi

కదిరి అర్బన్‌: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ గుడిసె దేవానంద్‌ ఆదివారం అనంతపురం జిల్లా కదిరిలో ‘సాక్షి’ విలేకరి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం చేశాడు. టీడీపీ నేత దేవా నంద్‌ పట్టణానికి చెందిన నిజాం వద్ద రూ.3.50 లక్షలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగా ఆయనకు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టు దీనిపై అడ్వ కేట్‌ కమిషన్‌ను నియమించింది. ఈ విషయం ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 14న ‘ఎస్సీ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌కు అరెస్ట్‌ వారెంట్‌’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో కోపోద్రిక్తుడైన దేవానంద్‌ వార్త రాసిన శ్రీనివాసరెడ్డిని హత్య చేయాలని పథకం పన్నాడు.

వలీసాబ్‌రోడ్‌లో ఉదయమే టీ తాగేందుకు ఈ విలేకరి వస్తాడని రౌడీలను వెంట బెట్టుకొని 9 గంటల వరకు కాపు కాశాడు. అక్కడికి రాకపోయే సరికి మటన్‌ షాప్‌ వద్ద వేచి ఉన్నాడు. 9.30 గంటల ప్రాంతంలో శ్రీనివాస్‌రెడ్డి అక్కడికి వెళ్లగానే స్వయంగా దేవానందే మటన్‌ కత్తి తీసుకుని ‘ఒరేయ్‌.. నీకు ఎంత ధైర్యంరా.. నామీదే వార్త రాస్తావా?.. నిన్ను ఇక్కడే చంపితే ఎవర్రా నీకు దిక్కు..’ అంటూ దూసుకెళ్లాడు. అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. వారి సాయంతో శ్రీనివాసరెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌ చేరుకుని దేవానంద్‌పై ఫిర్యాదు చేశాడు. అతని వల్ల తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నారు. వెంటనే పోలీసులు దేవానంద్‌పై కేసు నమోదు చేశారు. అయితే విలేకరి తనను కులం పేరుతో దూషించాడంటూ దేవానంద్‌ ఇచ్చిన ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఎటువంటి విచారణ చేయకుండానే విలేకరిపై కేసు నమోదు చేశారు. పైగా నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంటున్న దేవానంద్‌ స్టేషన్‌కు వచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం విశేషం. 

జర్నలిస్ట్‌ల రాస్తారోకో
సాక్షి విలేకరి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నా నికి నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కదిరిలో ఆదివారం జర్నలిస్ట్‌లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 205 జాతీయ రహదారిపై 2 గంటల పాటు రాస్తారోకో చేశారు. దాడికి పాల్పడిన దేవానంద్‌ను తక్షణం అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement