పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న సర్పంచ్ ప్రత్తిపాటి మరియరాణి
సాక్షి, ప్రత్తిపాడు (గుంటూరు): కులం పేరుతో తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఓ దళిత మహిళా సర్పంచ్ శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కథనం ప్రకారం.. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా గొట్టిపాడు సర్పంచ్‌గా టీడీపీ బలపరిచిన ఆది ఆంధ్రా కాలనీకి చెందిన ప్రత్తిపాటి మరియరాణి గెలుపొందారు. ఉప సర్పంచ్‌గా టీడీపీకి చెందిన ముఖుంద శివరంజనిని పంచాయతీ సభ్యులు ఎన్నుకున్నారు. నాటినుంచి సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇప్పటికే అనేకమార్లు పంచాయతీ కార్యాలయంలోనే వివాదాలు, వాగ్వాదాలు జరిగాయి.
సర్పంచ్‌గా మరియరాణి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఉపసర్పంచ్ భర్త నిమ్మగడ్డ శ్రీకాంత్ ఆమెను కులం పేరుతో దుర్భాషలాడుతున్నాడు. ఇటీవల ఖాళీ చెక్కులపై సంతకాలు చేయాలంటూ శ్రీకాంత్, పంచాయతీ ఇన్‌చార్జి సెక్రటరీ రామ్మూర్తి కలిసి మరియరాణిపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆమె సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో దుర్భాషలాడుతూ చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఇకపై పంచాయతీకి వెళ్లనని శ్రీకాంత్ ఒప్పుకుని క్షమాపణ చెప్పాడు.
చదవండి: (విమ్స్‌లో ముక్కు ద్వారా వేసే కరోనా టీకా ట్రయల్స్)
ఆ తర్వాత కూడా మళ్లీ ‘నాతోనే క్షమాపణ చెప్పిస్తావా?, ...దానివి నీకెందుకు సర్పంచ్ కుర్చీ. మేం ఎలా చెబితే అలా చేయాలి లేకుంటే చంపేస్తాం’ అంటూ శ్రీకాంత్ బెదిరింపులకు దిగాడు. వేధింపులు తాళలేని మరియరాణి శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. శ్రీకాంత్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్ రామ్మూర్తి నుంచి తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment