దళితులపై దాడులను నిరసిస్తూ పాదయాత్ర
అమలాపురం టౌన్ :
దళితులపై జరగుతున్న దాడులను నిరసిస్తూ అమలాపురం నుంచి కాకినాడ ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వరకూ మూడు రోజుల పాటు సాగే దళితుల పాదయాత్ర ఆదివారం స్థానిక గడియారం స్తంభం సెంటరు నుంచి ప్రారంభమైంది. మాల, మాదిగ, రెల్లి, ఉపకులాల గిరిజన అభివృద్ధి సంఘం అధ్యక్షుడు బొర్రా విజయకుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర బయలుదేరింది. దళితులందరినీ ఒకే తాటిపైకి తేవాలన్న లక్ష్యంతో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. సూదాపాలెం ఘటనలో బాధితులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ముమ్మిడివరం గేటు, నల్లవంతెన, ఎన్టీఆర్ మార్గ్, ఎర్రవంతెన, కిమ్స్ ఆçస్పత్రి మీదుగా 216 జాతీయ రహదారిపై కాకినాడ వైపు యాత్ర సాగింది. యాత్రలో న్యాయవాది యార్లగడ్డ రవీంద్ర, పీసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండ్రు బుల్లియ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి యు.గనిరాజు, రైతు ఫెడరేషన్ అధ్యక్షుడు మణిసింగ్, జంగా రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.