కుప్పం బాదురులో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి తుడా: కొన్నేళ్లుగా ఓటుకు దూరంగా ఉన్న దళితులకు ఆ హక్కును కల్పించడమే లక్ష్యంగా పోరాటం చేసినట్టు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఐదు పోలింగ్ కేంద్రాల్లో దళితులను ఓటు వేయనీయకుండా టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడడంతో, దానిపై పోరాటం చేసిన చెవిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం.. రీపోలింగ్‌కు ఆదేశించడం తెలిసిందే. ఇందులో భాగంగానే చంద్రగిరి నియోజ కవర్గంలోని వెంకట్రామాపురం, ఎన్‌ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగతో పాటు కాలేపల్లి, కుప్పం బాదూరులో ఆదివారం రీపోలింగ్ నిర్వహించారు.
వెంకట్రామాపురం పోలింగ్ స్టేషన్ వద్ద పోలింగ్‌ను పరిశీలించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో దళితులు ఏళ్ల తరబడి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారన్నారు. ఎలాగైనా ఈఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో పోరాటం చేసినట్టు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మార్చి 11న జరిగిన ఎన్నికల్లో మరోసారి దళితులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారన్నారు.
ఆ వివరాలు పరిశీలించిన ఎన్నికల కమిషన్ రీపోలింగ్‌కు ఆదేశించడం దళిత గిరిజనుల విజయమన్నారు. తనకు ఓటు వేయాలని పోరాటం చేయలేదని, ఓటు హక్కు విలువ వారికి తెలియాలనే ఇంతవరకు తీసుకువచ్చానని అన్నారు. కుప్పం బాదూరు, కాలేపల్లిలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నాయని, అక్కడ కూడా రీపోలింగ్ కోసం తెలుగుదేశం నాయకులు రీపోలింగ్‌కు కోరితే అందుకు తాను ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని ఆయన గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment