రాజ్యాంగద్రోహం! | schedule cast welfare minimised with constitution | Sakshi
Sakshi News home page

రాజ్యాంగద్రోహం!

Published Thu, Sep 22 2016 1:42 AM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM

రాజ్యాంగద్రోహం! - Sakshi

రాజ్యాంగద్రోహం!

సమయం చిక్కినప్పుడల్లా దళిత సంక్షేమం గురించి స్వోత్కర్షలు పోయే నేతల పరువు తీసే గణాంకాలివి. గత మూడున్నర దశాబ్దాల్లో ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన రూ. 2.80 లక్షల కోట్లు ఖర్చు కాలేదని ‘ఇండియా స్పెండ్’ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ఈ ఏడాది మొదట్లో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ఈ సంగతిని ఎత్తి చూపింది. అంతకు చాన్నాళ్ల ముందే పార్లమెంటరీ స్థాయీ సంఘం వంటివి కూడా హెచ్చరించాయి. అయితే పాలకుల్లోగానీ, అధికార యంత్రాంగంలోగానీ వీసమెత్తయినా మార్పు రాలేదు. కేంద్రం తరహాలో తాము కూడా ఉప ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం మొదలెడతామని ఈమధ్య కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతినబూనాయి. అందుకు సంబంధించి చట్టాలు తీసుకురావడం మొదలుపెట్టాయి. ప్రకటనలు మోతెక్కి పోయాయి.

కానీ అలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నిమ్న వర్గాల విషయంలో శ్రద్ధ చూపలేకపోయాయని తాజా గణాంకాలు వివరిస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభు త్వాలైతే అసలు లెక్కలు చెప్పడానికే సిగ్గుపడుతున్నాయి. రేపు మాపంటూ మొహం చాటేస్తున్నాయి. బడ్జెట్లలో ఘనంగా కేటాయింపులు చేయడం... ఏ శాఖకు నిధుల కొరత ఎదురైనా వాటిని మళ్లించడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది. అలా కాని పక్షంలో ఆ నిధులు మురిగిపోవడం రివాజు. కేటాయింపులు పెరిగిన కొద్దీ వేరే శాఖలకు ఎగిరిపోయే నిధుల మొత్తం ఎక్కువ కావడం లేదా మురిగిపోయే నిధుల శాతం పెరగడం తప్ప ప్రయోజనం శూన్యం. ప్రణాళికా సంఘం ఉన్నా, దాని స్థానంలో నీతిఆయోగ్ వచ్చినా పరిస్థితి పెద్దగా మారింది లేదు.
 
మన రాజ్యాంగం నిమ్న వర్గాల సంక్షేమానికి, వారి ఆర్ధికాభివృద్ధికి ఎంతో ప్రాముఖ్యాన్నిచ్చింది. ఆ వర్గాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దేశం అభి వృద్ధి సాధించగలదని భావించింది. అందుకోసం ప్రభుత్వాలు ఎలా వ్యవహరిం చాలో, ఏమేం చర్యలు తీసుకోవాలో వివిధ అధికరణలు చెబుతున్నాయి. కానీ అధికార పీఠాలపై ఉండేవారు వాటిని బేఖాతరు చేస్తూ ఇష్టానుసారం ప్రవర్తిస్తు న్నారు. అధికార గణం వారికి డిటో. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నిధులు కొల్ల గొట్టడం, వాటిని ఖర్చు చేయకపోవడంలాంటివి పదే పదే పునరావృతం కావడంలో వింతేముంది? చిత్రమేమంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా మాత్రం నిరుడు డిసెంబర్‌లో ఒక గోష్టి సందర్భంగా రాష్ట్రాల్లో పేద రికం గణనీయంగా తగ్గిందని ప్రకటించారు.

అందులో ఎంతో కొంత నిజం ఉంద నుకున్నా దానికి ప్రభుత్వాల వైపుగా జరిగిన కృషి స్వల్పమేనని ఇప్పుడు ‘ఇండియా స్పెండ్’ విడుదల చేసిన గణాంకాలు చూస్తే అర్ధమవుతాయి. పేదరికం నుంచి బయటపడటం కోసం ఆ వర్గాల వైపు నుంచి సాగిన కృషికి ప్రభుత్వాలు బాసటగా నిలిచి ఉంటే పరిస్థితి మరెంత మెరుగ్గా ఉండేదో తెలుస్తుంది. మన దేశంలోని వ్యవసాయ బడ్జెట్ మొత్తం కంటే ఎనిమిది రెట్లు అధికంగా నిమ్న వర్గాల నిధులు మురిగిపోవడమో, దారి మళ్లడమో జరిగిందని తెలిసినప్పుడు మనస్సు చివుక్కు మంటుంది. కేంద్రంలో 1974-75లో గిరిజనుల కోసం ఉప ప్రణాళిక రూపొం దించడం మొదలైంది. 1979-80లో ఎస్సీ వర్గాలకు కూడా ఇదే తరహాలో ఉప ప్రణాళికల రూపకల్పన ప్రారంభమైంది. ఆ వర్గాల జనాభా దామాషా ప్రాతిపది కన ఈ ఉప ప్రణాళికలుండాలన్నది లక్ష్యం. లక్షిత వర్గాలకు మాత్రమే ఆ నిధులు ఖర్చు కావాలన్నది ఆశయం. దేశంలో ఎస్సీ వర్గాలు 16.6 శాతం ఉంటే... ఎస్టీల జనాభా 8.6 శాతం. అయితే నిరుపేద వర్గాల్లో మాత్రం వీరి శాతం అత్యధికం.

ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించడమే తప్ప ఆచరణ మాత్రం అరకొరగానే ఉంటు న్నది. ప్రతి మంత్రిత్వ శాఖ తాము ఖర్చు చేసే నిధుల్లో  నిమ్నవర్గాలవారి జనాభా దామాషా ప్రాతిపదికన కేటాయించాలని మార్గదర్శకాలు చెబుతున్నా... నిధులు మురిగిపోవడం మాటే ఉండకూడదని అంటున్నా పట్టించుకుంటున్నవారేరి? పాల కుల పర్యవేక్షణ కొరవడటమే ఇందుకు కారణమని అంతా అనుకుంటారు. కానీ అది అర్ధ సత్యమే. వారలా పట్టనట్టు ఉండిపోవడంలో పాలకుల ప్రయోజనం కూడా ఉంటుంది. వాటిని ఖర్చు చేయకుండా వదిలేసినా ఎవరూ ప్రశ్నించకపోతే మరో ఖాతాకు మళ్లించి పబ్బం గడుపుకోవచ్చునని పాలకులు భావిస్తున్నారు. ఏ గిరిజన పల్లెకు వెళ్లినా గుడిసెలు కనబడతాయి. బడి, విద్యుత్, మరుగుదొడ్డి వంటివి అరుదుగా ఉంటాయి. తిండి, బట్ట సరిగాలేనివారు, రోగాలతో ఇబ్బం దులు పడుతున్నవారు కనిపిస్తారు. సరైన రహదారులే ఉండవు. ఇన్ని లక్షల కోట్లు సక్రమంగా ఖర్చు చేయగలిగి ఉంటే ఇంత దయనీయమైన స్థితి వచ్చేదా?
 
వేయి కళ్లుండే ప్రభుత్వాలు నిమ్నవర్గాల విషయంలో, వారి సమస్యల పరి ష్కారంలో కబోదుల్లా వ్యవహరిస్తున్నాయి. 2012-13లో 26 రాష్ట్రాలు రూ. 80,310 కోట్లు ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించి అందులో కేవలం రూ. 61,480 కోట్లు మాత్రమే ఖర్చుచేశాయి. సబ్‌ప్లాన్ చట్టం అమల్లోకొచ్చాక కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013-14లో కేటాయించిన రూ. 8,584 కోట్లలో రూ. 2,595 కోట్లు మిగిలిపోయాయి. ఆ తర్వాతైనా ఏపీ, తెలంగాణల్లో పెద్దగా మారిం దేమీ లేదు. 2016-17లో ఏపీలో వివిధ ప్రధాన పథకాల కోసం కేటాయించిన రూ. 550.01 కోట్లలో ఎస్సీ ఉప ప్రణాళికకు రూ. 91.3 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ. 47.3 కోట్లు అందాలి.

కానీ స్మార్ట్ సిటీ (రూ. 29.26 కోట్లు), మురికివాడల్లో అభి వృద్ధి కార్యక్రమాలు (రూ. 11.7 కోట్లు), గ్రామీణ పారిశుద్ధ్యం (రూ.120.9 కోట్లు) వగైరా పథకాల్లో నయాపైస కూడా ఖర్చు చేయలేదని దళిత బహుజన రీసోర్స్ సెంటర్ (డీబీఆర్‌సీ) మొన్న మార్చిలో వెల్లడించింది. పైగా కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని కూడా ఆరోపించింది. తెలంగాణలోనూ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని, ఆ రాష్ట్రం 2014-15లో నిమ్నవర్గాలకు కేటాయించిన నిధుల్లో 61.26 శాతం ఖర్చు చేయలేదని ‘ఇండియా స్పెండ్’ అంటున్నది. ఈ పరి స్థితి మారాలి. నిమ్నవర్గాల నిధుల్ని దారి మళ్లించడమైనా, మురిగిపోయేలా చేయ డమైనా రాజ్యాంగ ద్రోహంగా పరిగణించాలి. అందుకు కారకులైనవారిని బోనె క్కించాలి. అప్పుడు మాత్రమే నిజమైన సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement