బెంగళూరు : షెడ్యూలు కులాలు, తరగతుల సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయించిన మేరకే నిధులు విడుదల చేశామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపినట్లు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చేసిన ఆరోపణలు సత్యదూరమని కొట్టిపారేశారు.
పశుసంవర్ధకశాఖకు నూతనంగా కేటాయించిన సంచార పశు చికిత్స వాహనాలను క్యాంపు కార్యాలయంలో సీఎం మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు జనాభాకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని చట్టం చేసిన రాష్ట్రాల్లో కర్ణాటక రెండోదన్నారు. ఈ చట్టం వచ్చే ఆర్థిక ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. 2013-14 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం గత ప్రభుత్వం రూ.8,600 కోట్లు కేటాయించిందన్నారు. అయితే నూతన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.15,300 కోట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ నిధులు 80 శాతం ఎక్కువని వివరించారు. కాగా, ఈ మొత్తం నిధుల్లో ఎస్సీలకు 17.95 శాతం, ఎస్టీలకు 7.5 శాతం కేటాయిస్తామన్నారు.
పశువైద్యుల నియామకం : మంత్రి జయచంద్ర
లోక్‌సభ ఎన్నికల తర్వాత పశువైద్యుల నియామక ప్రక్రియను చేపడతామని కార్యక్రమంలో పాల్గొన్న పశుసంవర్ధకశాఖ మంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. శాఖలో 911 పోస్టులు ఖాళీ ఉన్నాయని, వీటిలో 250 స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దశల వారిగా మిగిలిన వాటిని భర్తీ చేస్తామని చెప్పారు. దాదాపు 200 పశు చికిత్స సంచార వాహనాలను పశుసంవర్ధక శాఖకు అందించనున్నట్లు పేర్కొన్నారు. తొలి విడతగా 35 వాహనాలను అందించినట్లు తెలిపారు.