
మాట్లాడుతున్న డాక్టర్ కృష్ణయ్య
సాక్షి, మహబూబ్‌నగర్: కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని మాదిగ మేధావుల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణయ్య అన్నారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకెపోగు రాములు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇందుకు మాదిగ యువకులు, మేధావులు, ఉద్యోగులు డిసెంబర్‌లో నిర్వహించతలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చి ఎస్సీ వర్గీకరణ అవశ్యకతను కేంద్రానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేలా తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. అనంతరం ఎంఈఎఫ్ మహబూబ్‌నగర్, హన్వాడ మండలాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. అనంతరం కృష్ణయ్యను శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. నాయకులు గాలి యాదయ్య, సువార్తమ్మ, పి.బాలయ్య, పి.కొండయ్య, బోయపల్లి ఆంజనేయులు, నర్సిములు, తిరుపతయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.