షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల సంక్షేమానికి సంబంధించి గతేడాది ఖర్చు కాకుండా మిగిలిపోయిన ఉప ప్రణాళిక
గతేడాది ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులపై సంక్షేమ సలహాదారు రామలక్ష్మణ్
హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల సంక్షేమానికి సంబంధించి గతేడాది ఖర్చు కాకుండా మిగిలిపోయిన ఉప ప్రణాళిక నిధులను మరుసటి ఏడాదికి బదిలీ చేయడం జరగదని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ సలహాదారు ఎ.రామలక్ష్మణ్ తెలిపారు. గ్రామజ్యోతి, తదితర కార్యక్రమాల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను మళ్లిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ... ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించరాదని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ఉద్యోగులు లేకపోవడంతో ఆయా సంక్షేమ పథకాలకు నిధుల కొరత తలెత్తుతుందన్నారు.
మంగళవారం సచివాలయంలో వివిధ సంక్షేమశాఖల అధికారులు డా.ఎం.వి.రెడ్డి, జయరాజ్, దశరథ్‌నాయక్‌లతో కలసి రామలక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కుంటుపడుతున్నాయంటూ పత్రిక ల్లో కథనాలు రావడం బాధకలిగిస్తోం దని అన్నారు. దళితులకు భూ పంపిణీ పథకాన్ని అమలుచేస్తున్నామని, ఇప్పటివరకు 1,300 మందికి 3,600 ఎకరాల మేర పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015-16కు సంబంధించి 80 శాతం రాయితీతో రుణాలు ఇవ్వనున్నట్లు, దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడుతాయన్నారు. కల్యాణలక్ష్మీ పథకం కింద ఎస్సీ అమ్మాయిల పెళ్లి కోసం రూ.105 కోట్లు, ఎస్టీ అమ్మాయిల వివాహాల కోసం రూ.62 కోట్ల మేర ఖర్చుచేశామని తెలియజేశారు.