scheduled
-
అడ్మిట్ కార్డులు రెడీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకూ జరిగే జేఈఈ మెయిన్స్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తొలి సెషన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్టీఏ వెల్లడించింది. గత ఏడాది ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది హాజరయ్యారు. ఈసారి కూడా దాదాపుగా అంతే సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది ఆన్లైన్ విధానంలో జేఈఈ మెయిన్స్ రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పట్టణాల్లో పరీక్ష ఉంటుంది. 22, 23, 24 తేదీల్లో పేపర్–1 (బీఈ, బీటెక్‌లో ప్రవేశానికి) ఉంటుంది. 28, 29, 30 తేదీల్లో పేపర్–2 (బీఆర్క్, ప్లానింగ్‌లో ప్రవేశానికి) ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ ఒక షిఫ్ట్, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకూ మరో షిఫ్ట్ ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చని తెలిపింది. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని స్పష్టం చేసింది. పెరగనున్న సీట్లు దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఈసారి బీటెక్ సీట్లు పెరిగే వీలుంది. కొత్త కోర్సులు, ఆన్లైన్ విధానం అందుబాటులోకి తేనుండటంతో కనీసం 5 వేల సీట్లు పెరుగుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. దేశంలోని 31 ఎన్ఐటీల్లో ప్రస్తుతం 24 వేల సీట్లున్నాయి. ట్రిపుల్ ఐటీల్లో 8,500 సీట్లు ఉన్నాయి. ఎన్‌ఐటీల్లోని 50% సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో చేరాలంటే మెయిన్స్ కీలకం. ఇక మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ సంఖ్య 2.5 లక్షలుగా ఉంటుంది. జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో సీట్లు పెరుగుతున్న నేపథ్యంలో రెండో దఫా పరీక్షకు ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈసారి చాయిస్ ఎత్తివేత బీఆర్క్‌కు ఏటా 50 వేలకు మించి దరఖాస్తులు రావడం లేదు. కరోనా సమయం నుంచి సెక్షన్ ‘బీ’లో చాయిస్ ఇస్తున్నారు. కానీ ఈసారి చాయిస్ ఉండదు. ఈ సెక్షన్లో ఐదు ప్రశ్నలే ఇస్తారు. సెక్షన్ ఏ, బీలో మైనస్ మార్కులు ఉంటాయని ఎన్టీఏ తెలిపింది. ఇద్దరు అంతకన్నా ఎక్కువ మందికి సమాన స్కోర్ వస్తే తక్కువ మైనస్ మార్కులు వచి్చన వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తారు.అడ్మిట్ కార్డులు కీలకం విద్యార్థులకు ఎన్టీఏ కొన్ని సూచనలు చేసింది. జామెట్రీ బాక్స్, పెన్సిల్ బాక్స్, హ్యాండ్‌బ్యాగ్, పర్సు, పేపర్, పుస్తకాలు, మొబైల్, మైక్రోఫోన్, ఇయర్‌ఫోన్స్, కెమెరా, ఎల్రక్టానిక్ వస్తువులు, వాచీలు, స్కేల్, ఆల్గారిథమ్ బుక్, మెటల్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష పూర్తయ్యాక ఇన్వి జిలేటర్ నుంచి అనుమతి వచ్చే వరకూ గదిలోనే ఉండాలి. కీలకమైన అడ్మిట్ కార్డులో మూడు పేజీలుంటాయి. సెంటర్ వివరాలు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్, ముఖ్యమైన సూచనలు, ఇతర వివరాలు మూడో పేజీలో ఉంటాయి. -
‘జేఈఈ మెయిన్’కు వెళ్దాం ఇలా..
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2025 మొదటి సెషన్ పరీక్షలు ఈ నెల 22 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ నెల 22, 23, 24, 28, 29వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్–1(బీఈ, బీటెక్) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈ నెల 30న మధ్యాహ్నం పేపర్–2 బీఆర్క్ పరీక్ష జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో ఈ ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఏ ఊరిలో పరీక్ష కేంద్రం ఉందనే సమాచారంతో సిటీ ఇంటిమేషన్ వివరాలను సైట్లో ఉంచిన ఎన్టీఏ.. ఆయా తేదీల వారీగా జరిగే పరీక్షలకు మూడు రోజుల ముందుగా అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఈ నెల 22, 23వ తేదీల్లో జరగనున్న పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం విడుదల చేసింది. – గుంటూరు ఎడ్యుకేషన్2 గంటల ముందుగా పరీక్ష కేంద్రానికి..⇒ జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు పొందిన విద్యార్థులు అందులో ఎన్టీఏ పొందుపర్చిన నియమ, నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. ⇒ ఉదయం పేపర్–1 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్ట్‌లో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 6.00 వరకు జరగనుంది. ఉదయం పరీక్షకు 7.00 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంటకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ప్రకటించిన ఎన్టీఏ.. పరీక్ష సమయానికి అరగంట ముందు వరకు విద్యార్థులను అనుమతించిన తర్వాత ప్రధాన గేట్లను మూసివేయనున్నట్లు స్పష్టం చేసింది.⇒ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నీట్ తరహాలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ఎన్టీఏ.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వ్రస్తాలను ధరించి రావాలని, కాళ్లకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులు ధరించాలని నిబంధనలు విధించింది. ⇒ ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్‌కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించాల్సి ఉంది. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫొటోనే అతికించాల్సి ఉండగా.. పక్కన మరో బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. పక్కన ఉన్న మూడో బాక్సులో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాక ఇని్వజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి.⇒ విద్యార్థి తమ వెంట అడ్మిట్‌కార్డుతో పాటు అటెండెన్స్ షీట్‌పై అతికించేందుకు మరో పాస్‌పోర్ట్ సైజు ఫోటోను తెచ్చుకోవాలి. ప్రతి విద్యార్థి నుంచి బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనున్నారు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్‌తో పాటు బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధార్, పాన్ తదితర ఒరిజినల్ కార్డును విధిగా తీసుకెళ్లాలి. -
సగం సమయం కూడా పని చెయ్యలేదు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ సమయంలో సగం కూడా పని చెయ్యలేదు. అయినప్పటికీ రికార్టు స్థాయిలో 23 బిల్లులు పాసయ్యాయి. మణిపూర్‌లో జాతుల ఘర్షణ ఈ సారి ఉభయసభల్ని కుదిపేసింది. లోక్‌సభ కార్యకలాపాలు 43% జరిగితే, రాజ్యసభ 55% సమయం కార్యకలాపాలు కొనసాగించింది. పాలసీ రీసెర్చ్ స్టడీస్ (పీఆర్ఎస్) అందించిన డేటా ప్రకారం లోక్‌సభ 17 రోజులు సమావేశమైంది. అవిశ్వాస తీర్మానంపై 20 గంటల సేపు చర్చ జరిగింది. ఈ చర్చలో 60 మంది సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లుల్లో ఢిల్లీలో పాలనాధికార బిల్లు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు, అటవీ సంరక్షణ సవరణ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు ప్రధానమైనవి. ఈసారి సభలో ప్రవేశ పెట్టిన బిల్లుల్లో 56% కేవలం ఎనిమిది రోజుల్లో పార్లమెంటు ఆమోదాన్ని పొందాయి. మరో 17% బిల్లుల్ని కమిటీల పరిశీలనకు పంపారు. -
బ్యాంకింగ్ ప్రైవేటీకరణ ఆగదు.. ప్రైవేటులోకి మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికాబద్ధంగా అనుకున్న ప్రకారం ముందుకు సాగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ‘‘బ్యాంకు ప్రైవేటీకరణ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంది. దానిలో ఎటువంటి మార్పు లేదు’’ అని ఆమె అన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె ఇక్కడ ఒక మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐడీబీఐ బ్యాంక్ కాకుండా, 2021-22 సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 ఫిబ్రవరిలో చెప్పారు. ప్రస్తుతానికి, ఈ విషయంలో కొంచెం పురోగతి కనిపించింది. తాజా నివేదికల ప్రకారం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను 2021 ఏప్రిల్ లో ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినందున, ప్రైవేటీకరించనున్న ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల తాజా జాబితాను సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
టీఎస్పీఎస్సీ పరీక్షల రీషెడ్యూల్ అనివార్యమే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న పరీక్షల తేదీలు మారక తప్పేలా లేదు. ఈనెల 5న నిర్వహించిన ఏఈ పరీక్ష రద్దు కాగా.. ఈనెల 12, 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు రద్దయ్యాయి. ఇదే సమయంలో వచ్చే నెలలో జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పరీక్షల నిర్వహణపైనా అనుమానాలు నెలకొన్నాయి. కొత్తగా ప్రశ్నపత్రాలు తయారు చేసి పరీక్ష నిర్వహించేందుకు మరింత సమయం పట్టనుంది. ఈ క్రమంలో పరీక్ష తేదీల్లో మార్పులు తప్పవని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం మాత్రం ఇప్పటికీ వెలువడలేదు. -
ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. తదుపరి ఉపరాష్ట్రపతి ఆగస్టు 6న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారని తెలిపారు. రాజ్యసభ ఎక్స్–అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఉపరాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభల్లో కలిపి 788 మంది సభ్యులున్నారని ఈసీ వెల్లడించింది. వీరిలో 233 మంది రాజ్యసభ సభ్యులు, 12 మంది రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు కాగా, 543 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు జూలై 5న నోటిఫికేషన్ జారీ చేస్తారు. జూలై 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 20న నామినేషన్లు పరిశీలిస్తారు. జూలై 22 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికను కేవలం పార్లమెంట్ ప్రాంగణంలోనే నిర్వహిస్తారు. పార్లమెంట్ ఉభయ సభల్లో పార్టీల బలాబలాలను బట్టి చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే అభ్యర్థి సునాయాసంగా గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు 115 నామినేషన్లు ఈ నెల 18న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికకు ఇప్పటిదాకా 115 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 28 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసిందని రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. గురువారం నామినేషన్లను పరిశీలిస్తారు. ప్రధాన అభ్యర్థులతోపాటు పలువురు సామాన్యులు కూడా నామినేషన్లు వేశారు. -
షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశంలో షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రద్దును పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ రద్దు అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు. -
2018 డీఎస్సీలో భర్తీ కాని ఖాళీల నియామకాలకు షెడ్యూల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2018 డీఎస్సీలో కోర్టు కేసులు, వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన రూపొందించిన జాబితాలోని అభ్యర్థులతో భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా రాష్ట్ర ఐటీసెల్ సమాచారం పంపాలన్నారు. షెడ్యూల్ తేదీలు ఇలా.. ప్రొవిజినల్ జాబితా వెల్లడి: ఈనెల 20 తుది జాబితా ఖరారు: 21 ఎస్ఎంఎస్ సమాచారం: 22 ధ్రువపత్రాల అప్లోడ్: 23, 24 ధ్రువపత్రాల పరిశీలన: 24 నుంచి 28 వరకు ఖాళీల ప్రదర్శన: 29 కౌన్సెలింగ్, నియామక ఉత్తర్వులు: 30, 31 చదవండి: ‘విద్య అందుబాటు’లో ఏపీ టాప్ -
ఏప్రిల్ 20 నుంచి ఓటర్ల సవరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితాల సవరణకు ఎన్నికల కమిషన్ షెడ్యూలు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న 36 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు ఈ అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. కొత్త ఓట్లతో పాటు ప్రస్తుత ఓట్ల జాబితాల్లో పేరు లేని వారందరూ ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాల్లో తప్పులుంటే సరి చేసుకోవాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాల సవరణకు ఇంటింటి సర్వే చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో మే ఒకటో తేదీ నుంచి జూన్ 15 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. -
సిద్దిపేటలో మోగిన ఎన్నికల నగారా
♦ విడుదలైన షెడ్యూల్ ♦ నేడు నోటిఫికేషన్ జారీ ♦ నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ♦ ఏప్రిల్ 6న పోలింగ్, 11న కౌంటింగ్ ♦ వివరాలు వెల్లడించిన కలెక్టర్ రోనాల్డ్ రాస్ సంగారెడ్డి జోన్/ సిద్దిపేట బృందం: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు ఎట్టకేలకు నగారా మోగింది. న్యాయపరమైన అడ్డం కులు తొలగిపోవడంతో ఎన్నికల నిర్వహణకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 6న ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది. నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్లో కలెక్టర్ రోనాల్డ్ రాస్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. ఈ ఎన్నికలకు మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. సోమవారం నుంచి 23వ తేదీ వరకు ఉదయం 11 నుంచి వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా... మొత్తం 34 వార్డులకు గాను ఆయా వార్డులు పలు వర్గాలకు రిజర్వు అయ్యాయి. ఇందులో ఎస్టీ (జనరల్)కు 22వ వార్డు, ఎస్సీ (మహిళ)కు 6వ వార్డు, ఎస్సీ (జనరల్)కు 11వ వార్డు కేటాయించారు. బీసీ (మహిళ)కు 25, 27, 28, 31, 34 వార్డులు, బీసీ (జనరల్)కు 1, 7, 24, 26, 32, 33వ వార్డులు, మహిళ (జనరల్)కు 2, 3, 4, 5, 9, 15, 18, 19, 21, 23, 29వ వార్డులు రిజర్వు అయ్యాయి. కాగా 8, 10, 12, 13, 14, 16, 17, 20, 30వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా కేటాయించారు. మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తామరు. ఈనెల 24న పరిశీలన ఉంటుంది. 25వ తేదీనమధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. ఏప్రిల్ 6న పోలింగ్ జరుగుతుంది. 11వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. నామినేషన్లకు ప్రత్యేక కౌంటర్లు... నామినేషన్ల దాఖలుకు పట్టణంలోని 34 వార్డులకు గాను 34 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒకటి నుంచి 15వ వార్డు వరకు మున్సిపల్ కార్యాలయంలో, 16, 17వ వార్డులకు రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో, 18 నుంచి 34వ వార్డు వరకు పాత ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. 84 పోలింగ్ కేంద్రాలు.. మున్సిపల్ పరిధిలో 88,982 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకు 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించనున్నారు. రీపోలింగ్ జరపాల్సి వస్తే ఏప్రిల్ 9న నిర్వహిస్తారు. కెమెరాలతో నిఘా... పోలింగ్ ప్రక్రియ వెబ్ కెమెరా నిఘాలో కొనసాగనుంది. పట్టణంలోని 43 భవనాల్లో వీడియోగ్రఫీని ఏర్పాటు చేసి 84 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కెమెరాలను అందుబాటులోకి తేనున్నారు. ఎన్నికల నిర్వహణలో 505 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. 8మంది జోనల్, 8మంది రూట్ అధికారులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 22 అత్యంత సున్నిత, 35 సున్నితమైన కేంద్రాలను గుర్తించారు. ఆయా కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీరికి రెండుసార్లు శిక్షణ ఇవ్వనున్నారు. వార్డుకో అసిస్టెంట్ ఎన్నికల అధికారి పట్టణంలోని 34 వార్డులకు గాను ప్రతి వార్డుకు ఒక అసిస్టెంట్ ఎన్నికల అధికారి నియమించారు. అభ్యర్థులు తమ నామినేషన్లను వారికి అంద జేయాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ కేవలం సిద్దిపేట మున్సిపల్ పరిధికి మాత్రమే వర్తించనుంది. హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు ఆయా వార్డుల నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులకు సమగ్ర సమచారాన్ని అందించడానికి మూడు కేంద్రాల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. మొదటగా నామినేషన్లను పూరించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థులకు ఈ హెల్ప్‌డెస్కులు సమగ్ర సమాచారాన్ని అందించనున్నాయి. ముఖ్యంగా నామినేషన్ వేసే వారు తమ వెంట ఇద్దరిని మాత్రమే కేంద్రంలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. -
గ్రేటర్ వరంగల్ ఎన్నికలు మార్చి 6న!
ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట మునిసిపాలిటీలకు కూడా.. ♦ నేడు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ల జారీ ♦ 15 రోజుల్లోనే ఎన్నికల నిర్వహణ సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 6న గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు పురపాలికల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లను ఆదివారమే ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మార్చి తొలి వారంలో రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈ ఎన్నికలు ముగియనున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఎన్నికలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తే మార్చి 6న పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. పై మూడు పురపాలికల్లోని డివిజన్లు, వార్డులకు రిజర్వేషన్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి. సిద్దిపేటకు తొలగని న్యాయ చిక్కులు మంత్రి టి.హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట పట్టణానికి సైతం ఇదే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చివరి క్షణంలో విఫలమయ్యాయి. సిద్దిపేటలో ఆరు శివారు గ్రామ పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో కొంత కాలంగా ఈ మునిసిపాలిటీ ఎన్నికలపై స్టే అమల్లో ఉంది. స్టే తొలగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు వేచిచూస్తే ఎన్నికలను బడ్జెట్ సమావేశాల కంటే ముందు నిర్వహించలేమని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయ చిక్కులు తొలగిన తర్వాత సిద్దిపేటతో పాటు దుబ్బాక, కొల్లాపూర్, మేడ్చెల్ మునిసిపాలిటీలకు మరో విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. -
ఆ నిధులు అంతే...!
గతేడాది ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులపై సంక్షేమ సలహాదారు రామలక్ష్మణ్ హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల సంక్షేమానికి సంబంధించి గతేడాది ఖర్చు కాకుండా మిగిలిపోయిన ఉప ప్రణాళిక నిధులను మరుసటి ఏడాదికి బదిలీ చేయడం జరగదని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ సలహాదారు ఎ.రామలక్ష్మణ్ తెలిపారు. గ్రామజ్యోతి, తదితర కార్యక్రమాల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను మళ్లిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ... ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించరాదని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ఉద్యోగులు లేకపోవడంతో ఆయా సంక్షేమ పథకాలకు నిధుల కొరత తలెత్తుతుందన్నారు. మంగళవారం సచివాలయంలో వివిధ సంక్షేమశాఖల అధికారులు డా.ఎం.వి.రెడ్డి, జయరాజ్, దశరథ్నాయక్లతో కలసి రామలక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కుంటుపడుతున్నాయంటూ పత్రిక ల్లో కథనాలు రావడం బాధకలిగిస్తోం దని అన్నారు. దళితులకు భూ పంపిణీ పథకాన్ని అమలుచేస్తున్నామని, ఇప్పటివరకు 1,300 మందికి 3,600 ఎకరాల మేర పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015-16కు సంబంధించి 80 శాతం రాయితీతో రుణాలు ఇవ్వనున్నట్లు, దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడుతాయన్నారు. కల్యాణలక్ష్మీ పథకం కింద ఎస్సీ అమ్మాయిల పెళ్లి కోసం రూ.105 కోట్లు, ఎస్టీ అమ్మాయిల వివాహాల కోసం రూ.62 కోట్ల మేర ఖర్చుచేశామని తెలియజేశారు. -
ఈసెట్, పీజీసెట్ల షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: ఈసెట్, పీజీసెట్ల షెడ్యూళ్లు ఖరారయ్యాయి. ఈ రెండు సెట్ల బాధ్యతలు చూస్తున్న కమిటీలు గురువారం ఉన్నత విద్యా మండలిలో సమావేశమై షెడ్యూళ్లను ఖరారు చేశాయి. ఈ నెల 8వ తేదీన ఈ సెట్ల నోటిఫికేషన్లు వెలువడతాయి. ఈసెట్ దరఖాస్తులు 9 నుంచి, పీజీసెట్ దరఖాస్తులు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు సెట్లకు దరఖాస్తులను ఆన్లైన్లోనే సమర్పించాలి. ఈసెట్‌కు దరఖాస్తు రుసుము రూ.250గా నిర్ణయించారు. పీజీసెట్ దరఖాస్తు రుసుము రూ.500గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా నిర్ణయించారు. ఈసెట్‌కు కొత్తగా ప్రొద్దుటూరులో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీజీసెట్‌కు కాకినాడ కేంద్రంగా రీజనల్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఈ సమావేశంలో ఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ లాల్ కిషోర్, కన్వీనర్ ప్రొఫెసర్ బి.భానుమూర్తి, పీజీసెట్ చైర్మన్ డాక్టర్ బి.ప్రభాకర్‌రావు, కన్వీనర్ జీవీఆర్ ప్రసాదరాజు, మండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలు మార్చి 26 నుంచి
ఏప్రిల్ 11తో ముగియనున్న పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2015 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 12 రోజులు జరగనున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 11తో ముగియనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.ఉషారాణి పాల్గొన్నారు. విభజన తరువాత ఏపీలోని 13 జిల్లాల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని మంత్రి వివరించారు. మిగతా పబ్లిక్ పరీక్షలకు ఇబ్బంది లేకుండా అధికారులు షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఎస్ఎస్సీ పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కులకు సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అది ఇచ్చే నివేదికను పరిశీలించి వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త పద్ధతి అమలుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
పట్టభద్రుల నమోదు ఇలా..
వైరా : పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో సవరణకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకు వీరికి అవకాశం ఉంటుంది. ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవడానికి, తప్పులు సరిచేసుకునేందుకు, మార్పులు, చేర్పులతో పాటు పేర్లు తొలగించడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 16 వరకు మార్పులు చేసేందుకు అవకాశం ఉంది. మరి ఏయే దరఖాస్తుకు ఎలాంటి ఫారం కావాలి... అవి ఎక్కడ దొరుకుతాయి... ఎక్కడ దరఖాస్తు చేయాలి..? తదితర వివరాలు ఇలా... దరఖాస్తు విధానం దరఖాస్తును ఇంటర్నెట్ ద్వారా http://ec-.in/ecimain1/formsvoters.aspx లింక్‌ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులో పూర్తి వివరాలు కరెక్ట్‌గా నమోదు చేయాలి. ఫారంలో చూపిన చోట ఈ-మెయిల్, ఫోన్ నంబరు ఇస్తే నమోదు వివరాల సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. దరఖాస్తుకు జత చేయాల్సినవి... పట్టభద్ర (డిగ్రీ) ధ్రువీకరణ పత్రం ఓటరు గుర్తింపు కార్డు అర్హతలు ఇవీ... నియోజకవర్గంలో స్థానికంగా నివాసం ఉండాలి. 2014 జనవరి 1వ తేదీకి మూడేళ్లకు ముందు భారతదేశంలో ఏదైనా విశ్వవిద్యాలయంలో పట్టభద్రులై ఉండాలి. (డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తి కావాలి) దేనికి ఏ ఫారం..? కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకునే వారు ఫారం 18 పేరును తొలగించేందుకు ఫారం 7 ఓటు హక్కులో ఏమైనా మార్పులు చేయాలంటే ఫారం 8ఏ ఓటు హక్కులో కొత్తగా చేర్పులు చేయాలంటే ఫారం 8 పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను జత చేయాలి. కొత్తగా పేరు నమోదు చేసుకునే వారు, పేరును తొలగించుకోవాలని అనుకునేవారు ఫొటో జత చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఎవరికి సమర్పించాలి..? పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గంలోని అసిస్టెంట్ ఎలక్ట్రోలర్ రిజిస్ట్రేషన్ అధికారికి ఇవ్వాలి. ఈనెల 25 నుంచి డిసెంబర్ 16లోగా దరఖాస్తులు అందించాలి. చేయకూడనివి... దరఖాస్తులో తప్పులు దిద్దినా (కొట్టివేతలు), దరఖాస్తు ఫారం చిరిగినా దానిని తిరస్కరిస్తారు. అదేవిధంగా ఏమైనా తప్పుడు సమాచారం పేర్కొంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకుంటారు. మరిన్ని వివరాలకు http:// ceo telangana.nic.in వెబ్ సైట్లో చూడొచ్చు. -
‘ఎస్సీ, ఎస్టీ’ చట్టానికి సవరణ బిల్లు
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలోపేతం చేసే పలు ప్రతిపాదనలతో ఒక బిల్లును ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు(ఎస్సీ, ఎస్టీలు కానివారు) తమ విధులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం శిక్షార్హ నేరంగా పరిగణించాలని అందులో ప్రతిపాదించారు. కేసు నమోదు, ఎఫ్ఐఆర్ రూపొందించడం, బాధితుల స్టేట్మెంట్ నమోదు.. లాంటి విధుల్లో కావాలని నిర్లక్ష్యం ప్రదర్శిస్తే.. సంబంధిత అధికారులకు ఆరునెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించవచ్చు. అలాగే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి.. ఆయా రాష్ట్రాలు ఎస్సీ,ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి గెహ్లాట్ ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లులో ఉంది. ఈ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఈ మార్చిలో రాష్ట్రపతి జారీ చేశారు. -
ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూలు జారీ
-
ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూలు జారీ
జూలై 1నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈనెల 19న అడ్వాన్స్డ్ ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ తాత్కాలిక షెడ్యూలును జేఈఈ మెయిన్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు (సీఎస్ఏబీ) జారీ చేసింది. వ చ్చేనెల 1న ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనున్నట్లు బోర్డు పేర్కొంది. జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన విద్యార్థుల ఇంటర్మీడియట్ మార్కుల వివరాలను తమ వెబ్సైట్లో ఉంచింది. ఏమైనా తేడాలు ఉంటే ఈనెల 27లోగా తెలియజేయాలని సూచించింది. ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల్లో ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తున్న నేపథ్యంలో మార్కుల్లో తేడాలుంటే సవరించుకోవాలని సూచించింది. మరోవైపు, వీటి అలిండియా ర్యాంకులను జూలై 7న ప్రకటిస్తామని గతంలోనే సీబీఎస్ఈ వెల్లడించింది. ఇక ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఈనెల 19న వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసింది.