ఏప్రిల్ 20 నుంచి ఓటర్ల సవరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితాల సవరణకు ఎన్నికల కమిషన్ షెడ్యూలు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న 36 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు ఈ అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు.
కొత్త ఓట్లతో పాటు ప్రస్తుత ఓట్ల జాబితాల్లో పేరు లేని వారందరూ ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాల్లో తప్పులుంటే సరి చేసుకోవాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాల సవరణకు ఇంటింటి సర్వే చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో మే ఒకటో తేదీ నుంచి జూన్ 15 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.