జేఈఈ మెయిన్స్‌కు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 22 నుంచి 30 వరకు పరీక్షలు.. రాష్ట్రంలోని 17 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు
12 లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకూ జరిగే జేఈఈ మెయిన్స్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తొలి సెషన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. గత ఏడాది ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది హాజరయ్యారు. ఈసారి కూడా దాదాపుగా అంతే సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది ఆన్‌లైన్ విధానంలో జేఈఈ మెయిన్స్ రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పట్టణాల్లో పరీక్ష ఉంటుంది. 22, 23, 24 తేదీల్లో పేపర్–1 (బీఈ, బీటెక్‌లో ప్రవేశానికి) ఉంటుంది. 28, 29, 30 తేదీల్లో పేపర్–2 (బీఆర్క్, ప్లానింగ్‌లో ప్రవేశానికి) ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ ఒక షిఫ్ట్, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకూ మరో షిఫ్ట్ ఉంటుందని ఎన్‌టీఏ వెల్లడించింది. అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చని తెలిపింది. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని స్పష్టం చేసింది.
పెరగనున్న సీట్లు
దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఈసారి బీటెక్ సీట్లు పెరిగే వీలుంది. కొత్త కోర్సులు, ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి తేనుండటంతో కనీసం 5 వేల సీట్లు పెరుగుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో ప్రస్తుతం 24 వేల సీట్లున్నాయి. ట్రిపుల్ ఐటీల్లో 8,500 సీట్లు ఉన్నాయి. ఎన్‌ఐటీల్లోని 50% సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో చేరాలంటే మెయిన్స్ కీలకం. ఇక మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ సంఖ్య 2.5 లక్షలుగా ఉంటుంది. జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో సీట్లు పెరుగుతున్న నేపథ్యంలో రెండో దఫా పరీక్షకు ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈసారి చాయిస్ ఎత్తివేత
బీఆర్క్‌కు ఏటా 50 వేలకు మించి దరఖాస్తులు రావడం లేదు. కరోనా సమయం నుంచి సెక్షన్ ‘బీ’లో చాయిస్ ఇస్తున్నారు. కానీ ఈసారి చాయిస్ ఉండదు. ఈ సెక్షన్‌లో ఐదు ప్రశ్నలే ఇస్తారు. సెక్షన్ ఏ, బీలో మైనస్ మార్కులు ఉంటాయని ఎన్‌టీఏ తెలిపింది. ఇద్దరు అంతకన్నా ఎక్కువ మందికి సమాన స్కోర్ వస్తే తక్కువ మైనస్ మార్కులు వచి్చన వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తారు.
అడ్మిట్ కార్డులు కీలకం
విద్యార్థులకు ఎన్‌టీఏ కొన్ని సూచనలు చేసింది. జామెట్రీ బాక్స్, పెన్సిల్ బాక్స్, హ్యాండ్‌బ్యాగ్, పర్సు, పేపర్, పుస్తకాలు, మొబైల్, మైక్రోఫోన్, ఇయర్‌ఫోన్స్, కెమెరా, ఎల్రక్టానిక్ వస్తువులు, వాచీలు, స్కేల్, ఆల్గారిథమ్ బుక్, మెటల్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష పూర్తయ్యాక ఇన్వి జిలేటర్ నుంచి అనుమతి వచ్చే వరకూ గదిలోనే ఉండాలి. కీలకమైన అడ్మిట్ కార్డులో మూడు పేజీలుంటాయి. సెంటర్ వివరాలు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్, ముఖ్యమైన సూచనలు, ఇతర వివరాలు మూడో పేజీలో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment